బీఆర్ఎస్ పార్టీ ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. టీవీ ఛానళ్ల డిబేట్లలో పాల్గొనేటప్పుడు వ్యక్తిగత దూషణలు తగవని బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడికి తెలియని విషయం కాదు. కానీ, అదే స్ట్రాటజీగా పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు.
అయితే ఇందులో అర్థంకాని విషయం ఒక్కటే; టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఏబీఎన్ పైన, ఆంధ్రజ్యోతి పైన కత్తులు దూస్తూనే ఉన్నది. అయినా ఎక్కడా జంకకుండా పోరాటం చేసి ఛానల్‌ను నడిపారు. ముందు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఒక్కటే కక్ష గడితే, 2019 నుండి ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించింది.
అందుకని ఏబీఎన్‌ను బీఆర్ఎస్ కొత్తగా బహిష్కరించేదేమీ లేదు. కాకపోతే, “తెలంగాణ గడ్డమీద ఉంటూ, తెలంగాణ గాలి పీల్చుతూ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు” అంటున్నది టీఆర్ఎస్ పార్టీ. ముల్కీ రూల్స్ కూడా తెలంగాణ పౌరసత్వాన్ని నిర్ణయించలేదు కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ పౌరసత్వాన్ని నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే వాళ్లు తెలంగాణ ద్రోహులు!
కానీ తెలంగాణ సమాజానికి అటువంటి సంకుచిత మనస్తత్వం ఎప్పుడూ లేదు. నీరు, నిధులు, నియామకాల కోసం పోరాటానికి తెలంగాణ సమాజం మద్దతు తెలిపింది. ఇక్కడే పుట్టి పెరిగిన వారి మూలాలు వెతికి మరీ, వారు తెలంగాణ సమాజానికి చెందిన వారు కాదనడం సరికాదు. బహుశా మూడోసారి కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చివుంటే, ట్రంప్ మాదిరిగా జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేవారేమో!
బహిష్కరణ ఉత్తర్వుల్లో “తెలంగాణ గాలి” ని కూడా ప్రస్తావించారు. దాని అర్థం ఏమిటో బీఆర్ఎస్ వారే వివరించాలి. గాలికీ, నీటికి కూడా యాజమాన్య హక్కులు దఖలు పరుచుకుంటున్నారు. మరి ఎక్కడో పశ్చిమ కనుమల్లో, మహాబలేశ్వర్ దగ్గర గౌముఖంలో పుట్టిన కృష్ణానదీ జలాల కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పోరాటం చేసే హక్కు ఎలా వస్తుంది? మహారాష్ట్రలో పుట్టింది కాబట్టి ఆ రాష్ట్రానికే హక్కు అంటే.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పొట్లాడుకోవడంలో ఔచిత్యం లేదు.
త్రయంబకేశ్వరంలో పుట్టిన గోదావరి జలాల మీద కూడా మహారాష్ట్రకే హక్కు అనుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పొలాలు బీటలు వారిపోతాయి. గాలికి, నీటికి హద్దులు పెట్టే ప్రయత్నం చేస్తే నష్టపోయేది మనమే.
ప్రసార మాధ్యమాలకు ఒక ప్రాంతం, ఒక రాజకీయపార్టీ రంగు అంటగట్టి కక్షసాధింపు చర్యలు చేపట్టడం వలన, ప్రాంతీయపార్టీ స్థాయి నుండి జాతీయపార్టీ స్థాయికి ఎదగాలని పేరు మార్చుకున్న బీఆర్ఎస్కు ప్రయోజనం చేకూరుస్తుంది అనుకుంటే పొరపాటే. డిబేట్లో పాల్గొన్న శాసనమండలి సభ్యుడి అనుచిత ప్రవర్తనను మందలించాల్సింది పోయి, ఛానల్‌ను బహిష్కరించడం బాధ్యతారాహిత్యంగానే భావించాలి. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి.
కానీ వాటిని వ్యక్తపరచడానికి ఒక పద్ధతి ఉంటుంది. అటువంటి పద్ధతిని పాటించమనడంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు. విమర్శించే వారికి దూరంగా ఉండే తత్వం వల్ల తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని చేజార్చుకోవడం మినహా ఒరిగేదేమీ లేదు.
గతంలో ఇదే ఛానల్ ప్రసారాలను టెలికాస్ట్ చేయకుండా అడ్డుపడ్డారు, అయినా ఓటమి చవిచూడవలసి వచ్చింది. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ పైనే ఆధారపడి రాజకీయం చేసే అవస్థలోనే బీఆర్ఎస్ ఉండిపోయింది. పాలిటిక్స్‌లో రాణించిన వారికి తమ గతం తెలిసిన వారంటే ఒక భయం ఉంటుంది.
తాము ఎదిగే క్రమంలో అనుసరించిన పద్ధతులు వారికి తెలుసు కాబట్టి, వారిని చూడగానే ఒక వెరపు ఉంటుంది. మెట్లు ఎక్కకముందు తమ ఆర్థిక పరిస్థితుల నుండి, తాము చేసిన వ్యాపారాలతో సహా అన్నీ తెలిసి ఉండటం వల్ల వారు శత్రువుల్లా కనిపిస్తారు. కేసీఆర్ గారికి రాధాకృష్ణ గారంటే అయిష్టత ఉండటంలో అంతకు మించిన కారణం కనిపించడం లేదు.
కానీ.. తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో ‘తెలంగాణ రావటం తథ్యం’ అని ఆంధ్రా వారి వ్యతిరేకతను లెక్క చేయకుండా బాహాటంగా ప్రకటించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ ఛానల్. ఉద్యమానికి నైతిక మద్దతు తెలిపింది కూడా రాధాకృష్ణే. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన టార్గెట్ రాధాకృష్ణకు సంబంధించిన ప్రసార మాధ్యమాలే. ప్రాంతీయపార్టీల తత్వం ‘పార్టీయే నాయకుడు, నాయకుడే పార్టీ’ అన్నట్లుగా ఉంటుంది.
కానీ కేసీఆర్ ఒకడుగు ముందుకు వేసి ‘బీఆర్ఎస్ అంటే చంద్రశేఖరరావే, తెలంగాణ అన్నా కూడా చంద్రశేఖరరావే’ అనే పగటి కలలోనే ఉండిపోయారు. పార్టీలో కూడా అలా భజన చేసేవారినే ఆయన ప్రోత్సహిస్తున్నారు. అందుకే పార్టీ చేసిన కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కవితను కూడా దూరం పెట్టేశారు.
ఆయన విమర్శను భరించలేరు, ఎదుర్కోలేరు. అనేక పుస్తకాలు చదివి సాధించిన విజ్ఞానాన్ని పక్కన పెట్టి వ్యవహరించడం వలన, తన స్థాయి వ్యక్తులకుండే గౌరవమర్యాదలను పొందలేకపోతున్నారు కేసీఆర్. ఒకనాడు కేబినెట్లో మంత్రి పదవి కోసం చంద్రబాబును బతిమాలుకున్న విషయం ఆయన్ను ఇప్పటికీ కలత పెడుతున్నది. అది గుర్తుకు రాగానే చంద్రబాబును విమర్శించే పనిలో పడతారు. అది ఒకనాటి మాట.
టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని నిర్ద్వందంగా ఖండించారు. 610 జీవో పట్ల కూడా ఆయన అభిప్రాయం వేరేగా ఉన్నది. తరువాతి కాలంలో ఆయన ఆలోచనలు మారాయో లేక అవకాశాల కోసమో కానీ.. ప్రత్యేక తెలంగాణకు జై కొట్టారు. విజయం సాధించారు, కోరుకున్న పీఠాన్ని అధిరోహించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చి చంద్రబాబు సరసన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు.
ఇప్పుడు టీడీపీలో కేసీఆర్ కంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఇది వర్తమానం. ఇది మరిచి కేసీఆర్ గతంలోనే ఎందుకు జీవిస్తున్నారో అర్థం కాదు. ఒక ధనిక రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా.. ఆర్థికంగా వెనుకపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూనే రాజకీయం చేస్తూ, ఆయనను, ఆయన పార్టీని తెలంగాణలో సజీవంగా ఉంచుతున్నారు. ఇందుకు టీడీపీ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపవలసిందే.
ఏబీఎన్ ఛానల్ బహిష్కరించడానికి కూడా తెలంగాణ సెంటిమెంటునే వాడే ప్రయత్నం చేయడం వల్ల కేసీఆర్ స్థాయి మరింతగా దిగజారిపోతున్నది. ఈరోజు రెండు తెలుగురాష్ట్రాలకు సంబంధించిన ప్రసార మాధ్యమాల ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
అది గర్వించదగ్గ విషయంగా కేసీఆర్ గుర్తించడం లేదు. గుర్తించి ఉంటే ప్రసార మాధ్యమాలను బహిష్కరించడాలు, తొక్కేసే ప్రయత్నాలు చేయరు. విమర్శను తీసుకోలేని వారు ప్రశంసలకు పాత్రులు కాలేరు!
– ఇంద్రాణి