– అమరావతి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకూ శుద్ధి చేయాలి
– తిరుమల లడ్డూపై దుష్ప్రచారం
– సీబీఐ ఛార్జి షీట్ తో బయటపడ్డ వాస్తవాలు
– తొలుత నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కల్తీ అన్న ఈవో శ్యామలరావు
– అయోధ్యకి పంపిన లక్ష లడ్డూలు కల్తీ అన్న పవన్ కళ్యాణ్
– పచ్చి అబద్దాలతో దేవదేవుడి ప్రతిష్ఠ దిగజార్చిన వైనం
– కోట్లాది మంది హిందువుల మనోభావాలు కలుషితం
– అసలు జంతు కొవ్వే లేదన్న సీబీఐ ఛార్జి షీట్
– టీటీడీ మాజీ చైర్మన్, వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జి షీట్ లో నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదన్న వాస్తవం తేటతెల్లమైందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ … ఈ ఛార్జి షీట్ సాక్షిగా తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల దుష్ప్రచారం బట్టబయలైందన్నారు.
తొలుత నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు చెబితే… కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణ చేయడంతో పాటు, ఈవో తో కూడా మరలా తప్పుడు ప్రకటన చేయించారని మండిపడ్డారు. మరోవైపు అయోధ్యకి పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితో తయారుచేసినవి చెప్పడం ద్వారా…. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం దేవదేవుడి ప్రతిష్ఠను దిగజార్చి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు కలుషితం చేశారని మండిపడ్డారు.
అసలు జంతు కొవ్వే లేదన్న సీబీఐ నివేదికతో కూటమి కుట్ర బయటపడిందని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన నేరం లేదని తేలిందన్న భూమన.. సిట్ ఛార్జి షీట్ లో టీటీడీ అధికారులు, సాంకేతిక నిపుణులు కుమ్మక్కయ్యారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి 2013 నుంచే ప్రీమియర్ డెయిరీ, బోలేబాబా నెయ్యి సరఫరా చేస్తున్నాయని.. ఈ నేపధ్యంలో 2014-19 మధ్య నెయ్యి సరఫరాపై విచారణకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకూ శుద్ధి చేయాలి.
సీబీఐ నేతృత్వంలోని సిట్ తిరుమల ప్రసాదంపై కోర్టుకు తన నివేదికను సమర్పించింది. సిట్ తన రిపోర్ట్ లో ఎక్కడా రాజకీయపరమైన నేరం జరిగిందని ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. తద్వారా పూర్తిగా వాస్తవం లోకానికి స్పష్టీకరమైంది. సిట్ ఛార్జి షీట్ లో అధికారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ అధిపతులు కుమ్మక్కై నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిపి నెయ్యిగా మార్చారన్నది సీబీఐ ఇచ్చిన నివేదిక.
2014-19 వరకు లడ్డూ ప్రసాదంపై విచారణ చేయమని సీబీఐను ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సీబీఐ ఇచ్చిన నివేదికలో మాల్ గంగా, ఏఆర్,ప్రీమయర్, వైష్టవి డెయిరీలకు బోలేబాబా నుంచి కల్తీ నెయ్యి అందిందని చెప్పారు. 2013 నుంచి ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీనే 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేసింది. దీని మీద మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. ప్రీమియర్ డెయిరీ కూడా బోలేబాబా నుంచే నెయ్యి సరఫరా చేసిందని స్పష్టంగా సీబీఐ తన ఛార్జి షీట్ లో స్పష్టీకరించింది. ఇదే ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. దీనిపై సిబీఐ విచారణ చేయించే దమ్ము ఉందా?
కేవలం అధికారులు, డెయిరీ యజమానాలు లాలూచీ పడ్డం ద్వారా ఈ నేరం జరిగిందని మాత్రమే చెప్పారు. అది కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జంతుకొవ్వు, ఆవుకొవ్వు, పందికొవ్వు, చేప కొవ్వు వాడారన్న పదం ఒక్క చోట లేకపోగా.. యానిమల్ ఫ్యాట్ వాడలేదని స్పష్టంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సంస్థను కూడా టెండర్లకు ఆహ్వానించారు. నిజానికి ఏపీడీడీసికి ఒక్క ఆవు కూడా లేదు. కానీ ఈ సంస్థ పాల ఉత్పత్తులు కొని వ్యాపారం చేస్తోంది. ప్రభుత్వ సంస్దే వ్యాపారం చేస్తుందనడానికి ఆ సంస్థ ఇచ్చిన ప్రకటనే సాక్ష్యం. వైయస్.జగన్ హయాంలో అడుగడుగునా స్వామి వారికి మేలు చేయాలన్న తపనతోనే ఎన్ డీ డీ బీ చైర్మన్ ని పిలిపించారు.
కానీ నిస్సిగ్గుగా పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం అపవిత్రమైపోయిందని.. విజయవాడ దుర్గమ్మ మెట్లు కడిగాడు. తిరుపతిలో వింతవింతగా మాట్లాడాడు. రహస్యంగా బూట్లు, బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతని.. పవనానంద సిట్ రిపోర్టు తర్వాత ఎందుకు మౌనం వహించావు. నోరు తెరిచి ఇప్పుడు మాట్లాడు.
మీరు దాడి చేసింది వైయస్.జగన్ మీద, వైయస్సార్సీపీ మీద కాదు.. స్వయంభూ అయిన సాక్షాత్తూ శ్రీ మహావిష్టువు మీదనే దాడి చేశాడు. 140 కోట్ల మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకునే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మీద, వైయస్.జగన్ ను దెబ్బతీయడానికి జగన్మోహనుడు, జగన్నాధుడు అయిన స్వామి వారిని పావుగా వాడటం మహా పాపం.