– గీతం కాలేజీ భూదోపిడీని అడ్డుకుంటాం
– ప్రభుత్వానికి వైయస్సార్సీపీ నాయకుల హెచ్చరిక
– వైయస్సార్సీపీ హయాంలో గీతం కబ్జా నుంచి 55 ఎకరాలకు విముక్తి
– అవే భూములు గీతం కాలేజీకి ధారాదత్తం చేసే కుట్ర
– జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి పంపాలని నిర్ణయం
– వైయస్సార్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే గీతం కాలేజీకి ఎదురుగా రోడ్డుపై బైఠాయింపు
విశాఖపట్నం: విశాఖపట్నంలో సుమారు రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని, విశాఖపట్నం ఎంపీ భరత్‌కి చెందిన గీతం విద్యా సంస్థకు రెగ్యులరైజేషన్ చేసే ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలని వైయస్సార్సీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈనెల 30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా చేర్చి క్రమబద్ధీకరణ చేయడానికి జరుగుతున్న కుట్రను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గీతం ఆక్రమణలో ఉన్న భూముల పరిశీలనకు వెళ్లిన వైయస్సార్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
అనంతరం అక్కడే వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ భూముల బదలాయింపు అంశాన్ని ఎజెండా నుంచి తీసేస్తే తప్ప రేపు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనివ్వమని, మా కార్పొరేటర్లు అడ్డుకుంటారని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబ భూదోపిడీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని, ఎంపీ భరత్ భూదోపిడీపై పార్లమెంట్లో సైతం గళం వినిపిస్తామని స్పష్టం చేశారు.
రేపు మరోసారి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, మేథావులు, ఉద్యమ కారులతో కలిసి ఈ భూదోపిడీని నిరసిస్తూ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పోలీసులు దోపిడీదారులకు కాపాలాదారులుగా మారిపోయి, దోపిడీని అడ్డుకుంటున్న వైయస్సార్సీపీ నాయకులను భూముల పరిశీలనకు వెళ్లకుండా ఆపడం సమంజసం కాదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గీతం భూదోపిడీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు.
ఈ నిరసన కార్యక్రమంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కెకె రాజు, అనకాపల్లి జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, పండుల రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావులతోపాటు, రాష్ట్ర కార్యదర్శులు (నియోజకవర్గ పరిశీలకులు), పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
చట్టాలంటే చంద్రబాబుకి గౌరవం లేదా?: బొత్స
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖలో వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన బినామీలకు ధారాదత్తం చేస్తున్నాడు. వైయస్సార్సీపీ హయాంలో గీతం భూదోపిడీ నుంచి కాపాడిన రూ. 5 వేల కోట్ల విలువైన 55 ఎకరాల భూములను ఇప్పుడు చంద్రబాబు యథేచ్ఛగా తన కొడుకు తోడల్లుడికి బహుమానంగా ఇచ్చేస్తున్నాడు.
ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని, దీనిని ఆక్రమిస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని హెచ్చరిక బోర్డులు పాతినా చంద్రబాబు లెక్క చేయడం లేదు. చట్టాలను కాపాడాల్సిందిబోయి చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు సైతం దోపిడీదారులకు కాపాలాదారులుగా మారిపోయి, దోపిడీని అడ్డుకుంటున్న మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు చెయ్యాల్సింది ఇదేనా?
వైయస్సార్సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలపై హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, గీతం కాలేజీ భూదోపిడీపై ఎందుకు నోరెత్తడం లేదు? ఆయన ఈ భూకబ్జాను సమర్థిస్తున్నారా? కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ భూదోపిడీకి వత్తాసు పలుకుతున్న ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు వైయస్సార్సీపీ పోరాటం ఆపదు. బీజేపీ కూడా గీతం భూదోపిడీపై స్పందించాలి.