– మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన తెచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చినందుకు నోటీసు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు చేయడం మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.
ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై ప్రతీకార రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆయన పేర్కొన్నారు. పది సంవత్సరాల పాలనలో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల అభిమానం పొందిన, గొప్ప పాలనా దక్షుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ రాజకీయ కక్షే అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటినదని, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం మేలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.