వేటూరి సాహిత్యాభిమాన సమితి – అమేరిక కవికులాంలంకార వేటూరి సాహితీ మహోత్సవంలో ప్రధానాంశంగా 28న హైదరాబాద్ శిల్ప కళా వేదికపై వేటూరి రాసిన సినిమా, సినిమాయేతర 6300 పాటల్ని 8సంపుటాలుగా వెలువరించింది. (ఈ సంపుటాల బరువు 12.5 కిలోలు)
1 దొరకునా ఇటువంటి సేవ.
2 మానస వీణా మధుగీతం
3 నవమి నాటి వెన్నెల భాగం 1 భాగం 2
4 ఎడారిలో కోయిల
5 ఝుమ్మంది నాదం భాగం 1 భాగం 2
6 ఎరక్కపోయి వచ్చాను
ఈ 6 శీర్షికలతో 8 సంపుటాలు.
తానా తోటకూర ప్రసాద్ అంకిత భావంతో చేసిన కృషి, అలుపెరగని పనితనం ఫలితంగానూ, వేటూరి తనయుడు రవి ప్రకాష్ పాటల సేకరణ ఫలితంగానూ, ధర్మతేజ నిర్విరామ అభినివేశం ఫలితంగానూ, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సూచనలు, మార్గదర్శనం ఫలితంగానూ
ఈ ‘విరాట్ వేటూరి సాహిత్యం’ విడుదలైంది.
వేటూరి సుందరరామమూర్తి … తెలుగు సినిమాలో వచ్చిన అత్యుదాత్తమైన కవి వేటూరి సుందరరామమూర్తి. తెలుగు సినిమాలో వేటూరి సుందరరామమూర్తి అంత గొప్ప కవి ఇంత వరకూ రాలేదు! ఈ నా మాటకు ఎవరికైనా కోపం వస్తే అది వాళ్ల మానసిక సమస్య మాత్రమే సత్యం సమస్య కాదు.
1974లో వేటూరి సినిమా కవిగా వచ్చాక ఒక్క గుంటూరు శేషేంద్రశర్మ స్థాయిని మినహాయిస్తే మొత్తం తెలుగులో వేటూరి స్థాయి కవిత్వం ఇంత వరకూ ఏ కవీ ఏ రూపంలోనూ రాయలేదు. ఈ మాటకూ ఏ కవి నామ వికృత స్వభావుడికైనా, ఏ విమర్శక నామ అధముడికైనా కోపం వస్తే నేను జాలిపడతాను.
గత కొన్ని దశాబ్దులుగా తెలుగులో ప్రముఖ కవులుగా పిలిపించుకుంటున్న శివారెడ్డి, గోపి, అఫ్సర్, వాడ్రేవు చినవీరభద్రుడు వంటి వాళ్లు వేటూరి కాలి గోటికి కూడా సమానం కారు. ఇకనైనా వేటూరి విరాట్ సాహిత్యాన్ని చదవడం నేర్చుకుని ఆకళింపు చేసుకుంటే వాళ్లకు ఇకపై కవిత్వం, కవిత్వ పరమైన శిల్పం, శైలి, శయ్య, అభివ్యక్తి లోతు, వెడల్పు అవగతం అయ్యే అవకాశం మాత్రం ఉంది.
తెలుగు కవిత్వం అన్నది
కమ్యూనిజమ్, ఇస్లామ్, కుల మాఫియాల దాడికి, దాష్టీకానికి అవాగాహనా రాహిత్యానికి, చదువులేమికి, ప్రతిభా రాహిత్యానికి బలై వికారమైనపోయిన ఇవాళ్టి దుస్థితిలో ఈ విరాట్ వేటూరి సాహిత్యం తెలుగు కవిత్వ పునర్నవానికి ప్రేరకం, మార్గదర్శనం అవుతుంది!
తెలుగులో కవులు, విమర్శకులు అనబడుతున్న మేధావులు, ఎమ్.ఫిల్., పీహెచ్.డీ.ల మేధావులు కొంత కాలం పాటు కవిత్వం కవిత్వం అంటూ బహిరంగ మల, మూత్ర విసర్జను మానుకుని ఇదిగో ఈ విరాట్ వేటూరి సాహిత్యాన్ని చదివి స్వస్థత పొంది ‘రచనా సంవిధానం’ ఆలోచనను, అవగాహనను సాధించాలని ఒక మామూలు తెలుగు వ్యక్తిగా మనసా, వాచా కోరుకుంటున్నాను.
ఈ ఎనిమిది సంపుటాల్లో పలువురు లబ్ద ప్రతిష్ఠులు తమ మాటలు రాశారు. నేనూ నా మాట రాశాను. అందుకు నాకు సంతోషం.
సంతోషం… వేటూరి విరాట్ సాహిత్యం ఇలా ఎనిమిది సంపుటాల్లో తెలుగువారికి చేతుల్లోకి చేరేందుకు రావడం సంతోషం. వేటూరి జయంతి సందర్భంగా ఈ సంపుటిలో నమోదైన నా మాటను వారికి నివాళిగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.
విశిష్టమైన వేటూరి శ్రేష్ఠమైన కావ్యత్వంతో
‘తెలుగు సినిమా పాటల్లో వేటూరి సుందరరామమూర్తి రాసి పెట్టినంత గొప్ప కవిత్వం మరొకరు రాయలేదు’. తెలుగు సినిమా పాటలో శ్రేష్ఠమైన కావ్యత్వాన్ని పండించారు వేటూరి. తెలుగు సినిమాలో వేటూరికి ముందు సముద్రాల రాఘవాచార్య, పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, ఆరుద్ర, సీ. నారాయణరెడ్డి, దాశరథి వంటి గొప్ప కవులున్నారు. సినిమా పాటకు సంబంధించినంత వరకూ వేటూరి అందరికన్నా గొప్ప కవి!
మొత్తం దక్షిణాది సినిమాలో గొప్పకవి కణ్ణదాసన్. మలయాళం వయలార్ రామవర్మ, పీ. భాస్కరన్ కన్నా కణ్ణదాసన్ గొప్ప కవి. కన్నడ కవి ఆర్.ఎన్. జయగోపాల్‌తో నేను కొన్ని సందర్భాల్లో చర్చించినప్పుడు కణ్ణదాసన్ ఘనతను ఆయన స్మరించుకోలేకుండా ఉండలేకపోయారు. అంత కణ్ణదాసన్‌ను కూడా మరిపించగలిగింది ఒక్క వేటూరి మాత్రమే.
వేటూరి రాసిన “మానసవీణ మధుగీతం…” (సినిమా పంతులమ్మ) కణ్ణదాసన్ కూడా రాయలేరేమో? శంకరాభరణం పాటలల్లో వేటూరి చూపిన ప్రతిభ అద్వితీయం. “త్యాగరాజు కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టు ఉందమ్మా” అని వేటూరి మాత్రమే అనగలరు. మల్లెపువ్వు సినిమాలో వేశ్యా వాటికలో వినవచ్చే “ఎవ్వరో ఎవ్వరో…” పాటలోనిది ఉన్నతమైన సాహిత్యం. ఇలాంటి సందర్భానికే మానవుడు దానవుడు సినిమాలో సీ. నారాయణరెడ్డి రాశారు.
ఆ నారాయణరెడ్డి రచన కన్నా వేటూరి “ఎవ్వరో ఎవ్వరో…” రచనే గొప్పది అని అర్థం చేసుకోవడం ఏ తప్పూ అవదు. హిందీ ప్యాసా సినిమాలో ఆ సందర్భానికే సాహిర్ లుధియాన్వీ రాసిన “యే కూచే యే నీలామ్ (జిన్హేన్ నాజ్ హై హిన్ద్ పర్)…” రచన కన్నా వేటూరి రచన మిన్న అన్న నిజాన్ని గట్టిగా చెప్పుకోవడం కూడా ఒప్పే. ఆ పాటలో “ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో/ ఏ ఖర్మం ఈ గాయం చేసిందో” అని ఉన్నది వేటూరి మాత్రమే అనగలిగింది.
వేటూరికి ముందూ వేటూరికి తరువాతా గొప్ప కవిత్వం తెలుగు సినిమా పాటల్లో మనం విన్నాం. కానీ వేటూరి సృష్టించిన కవిత్వం ఎంతో విశిష్టమైంది. తొలిరోజుల్లో పంతులమ్మ చిత్రంలో వేటూరి రాసిన “మానస వీణా మధుగీతం…” పాట నుంచీ ఆయన చేసిన కవిత్వావిష్కరణ అపూర్వం.
“కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమని, తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని” అని ఆయన అన్నది అంతకు ముందు తెలుగు సినిమాకు అందని అలరు, ఔన్నత్యం. “మానస వీణా మధుగీతం మన సంస్కారం సంగీతం..” అంటూ ఈ పాట మలయాళంలో కూడా ధ్వనించింది. ఆ మలయాళం రచన వేటూరి రచన స్థాయిని అందుకోలేదు.
అడవి రాముడు సినిమాలో “ఆరేసుకోబోయి పారేసుకున్నాను…” పాట సీసపద్యం. ఆ పాటలో పైట లేని ఆమెతో “నా పాట నీ పైట కావాలి” అన్నారు వేటూరి. అడవిరాముడు సినిమాలోని ఇంకో చక్కని పాట “కుహు కుహు కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి…” పదాల పొందికలోనూ, భావుకతలోనూ ఎంతో బావుండే పాట.
సిరిసిరిమువ్వ సినిమా పాటల నుంచి వేటూరి వైశేష్యం వివృతమవడం మొదలైంది.
“శారదా వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము, నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము” అని అనడం సినిమా పాటలోనే కాదు మొత్తం తెలుగు సాహిత్యంలోనూ మహోన్నతం. “తత్త్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము” అని అన్నప్పుడూ “అద్వైత సిద్ధికి అమరత్వలబ్దికి గానమే సోపానము” అనీ అన్నప్పుడు త్యాగరాజ స్వామిని వేటూరి ఆపోశన పట్టారన్నది తెలుస్తున్నది. వేటూరికి అన్నమయ్య పూనడం కూడా జరిగింది. అందువల్లే ‘జానపదానికి జ్ఞానపథం’ అనీ, ‘ఏడు స్వరాలలే ఏడు కొండలై’ అనీ ఆయన రాయగలిగారు.
“కైలాసాన కార్తీకాన శివరూపం/ ప్రమిదేలేని ప్రమాదా లోక హిమదీపం” అని వేటూరి అన్నది మనం మరో కవి నుంచి విననిది. మరెవరూ అనలేనిది. సాగర సంగమం సినిమాలో “ఓం నమశ్సివాయ…” పాటలోని సాహిత్యం న భూతో న భవిష్యతి. భావుకత, కల్పనా శక్తి , పద కూర్పు పరంగా అది ఒక మహోన్నతమైన రచన. ఈ పాటలో ‘నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ’ అన్న వాక్యం వేయి కావ్యాల పెట్టు. అసలు ఉపనిషత్తులు పది మాత్రమే. ఆ సత్యాన్నీ, మౌనమే వేదాంతం అన్నదాన్నీ అద్భుతంగా మనకు అందించారు వేటూరి.
“గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై” అనడం ‘రచనా సంవిధానంలో వేటూరి మహోన్నతుడు’ అని నిరూపిస్తోంది. ఇక్కడ ఈశ్వరుడి సంకల్పం అంటే సృష్టి దానికి గజముఖ,షణ్ముఖ, ప్రమధ గణాలు ఋత్విజ వరులు (యజ్ఞం చేసే ఋత్విక్కులలో శ్రేష్ఠమైన వాళ్లు) అయ్యారు” అని అన్నారు. ఋత్విజ వరులు అన్న పదం వాడడం వల్ల ఈశ్వర సంకల్పం ఒక యజ్ఞం అన్నదాన్ని యజ్ఞం అన్న పదం వాడకుండా చెప్పారు. ఇది మహాకవులకు మాత్రమే సాధ్యం. వేటూరి ఒక మహాకవి!
“శంకరా నాద శరీరా పరా” పాటలో వేటూరి వాడిన సంస్కృతం తెలుగుకు అపూర్వం. వేటూరికి ముందు మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల రాఘవాచారి వంటి వారు తెలుగు సినిమా పాటలో పూర్తి సంస్కృతాన్ని చక్కగా వాడారు. వేటూరి సంస్కృతాన్ని గొప్పగానూ వాడారు. సప్తపది చిత్రంలో “అఖిలాండేశ్వరి…” పాట పార్వతి, లక్ష్మి, సరస్వతి స్తోత్రంగా పూర్తి సంస్కృతంలో అద్భుతంగా రాశారు వేటూరి. అలవోకగా ఎన్నో మంచి సమాసాల్ని వేటూరి ప్రయోగించారు. ఆయన వాడినన్ని అలంకారాలు తెలుగులో మరో సినీకవి వాడలేదు. వేటూరి ఎన్నో మంచి కవిసమయాల్ని వాడారు.
“చినుకులా రాలి నదులుగా సాగి…” పాట ప్రేమ గీతాలలో ఒక ఆణిముత్యం. “ఏ వసంతమిది ఎవరి సొంతమిది?…” అని వేటూరి కవిత మాత్రమే అడగగలదు. “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో…” పాటకు సాటి రాగల పాట మన దేశంలో మరొకటి ఉంటుందా?
“ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది” ఇలా రాయడానికి ఎంతో పదును కావాలి. ఆదిశంకరాచార్య, కాళిదాసు, కణ్ణదాసన్ వంటి కవులలో మెరిసే పద పురోగతి (Word-proggression) వేటూరి పాటల్లో ద్యోతకమౌతుంది.
తమిళ్ష్‌లో కణ్ణదాసన్ రాశాక అంతకన్నా గొప్పగా తెలుగులో రాయడం ఒక్క వేటూరివల్ల మాత్రమే సాధ్యమైంది. కణ్ణదాసన్ పాటలు రాసిన సందర్భాలకు తెలుగులో రాసిన కవులు ఉన్నారు. అయితే వాళ్లు కణ్ణదాసన్ స్థాయిని అందుకో లేకపోయారు. ఒక్క వేటూరి మాత్రామే కణ్ణదాసన్ రాసిన సందర్భానికి ఆయన కన్నా, అంతకన్నా గొప్పగా తెలుగులో రాయగలిగారు.
అమావాస్య చంద్రుడు సినిమాలో “అందమే అందము దేవత/ వెయ్యి మంది కవులు రాసే కావ్యము” అని కణ్ణదాసన్ తమిళ్ష్ పల్లవి రాస్తే “కళకే కళ ఈ అందము/ ఏ కవి రాయని తీయని కావ్యము” అని వేటూరి తెలుగు పల్లవి రాశారు. “కేశ వర్ణం మేఘం లాగా చల్లగా ఉన్నది/గారాలొలికే చెవులు రెండు ప్రశ్నలైనవి/బంగారం మోము తామర పువ్వులే కన్నులో/ మనో నేత్రాలు చెప్పే స్వర్ణ చిత్రం” అని కణ్ణదాసన్ మొదటి చరణంలో అంటే “నీలికురులు పోటి పడెను మేఘమాలతో/ కోల కనులు పంతాలాడే గండుమీలతో/ వదనమో జలజమో నుదురదీ ఫలకమో/ చెలి కంఠం పలికే శ్రీ శంఖము” అని వేటూరి అన్నారు.
“ముత్యపు చిప్పలు లాగా పెదవులు రెండు మెఱుస్తున్నాయి/ కలిసి ఉన్న పళ్ల వరుస మొల్లల వంటివి/ వెదుళ్లే భుజాలో తియ్యదనం ముక్కలు వేళ్లో/ ప్రతి అంగమూ చేతులకు తెలియనిది” అని రెండో చరణంలో కణ్ణదాసన్ అంటే “పగడములను ఓడించినవి చిగురు పెదవులు/ వరుస తీరి మెరిసే పళ్లు మల్లె తొడుగులు/ చూపులే తూపులో చెంపలే కెంపులో/ ఒక అందం తెరలో దోబూచులు” అని వేటూరి అన్నారు.
“పూవు ఊగే తీగలాగా నడుమును చూస్తున్నా/ అటుపైన అరటి వంటి అందాన్ని చూస్తున్నా/ మావిడాకు పాదమో మగువ నువ్వు వేదమో/ ఈ భూమిపై ఇలాంటి వనిత లేదు కదా” అని కణ్ణదాసన్ అంటే “తీగలాగా ఊగే నడుము ఉండి లేనిది/ దాని మీద పువ్వై పూచి నాభి ఉన్నది/ కరములే కొమ్మలో కాళ్ళవి బోదెలో/ నీ రూపం ఇలలో అపురూపం” అని వేటూరి అన్నారు.
ఈ పాట విషయంలో కణ్ణదాసన్ కన్నా వేటూరి చాల గొప్పగా రాయడం ప్రస్ఫుటం ఔతోంది. కణ్ణదాసన్ రాశాక అంతకన్న బాగా రాయడం అంటే మాటలు కాదు. వేటూరి పల్లవిలోనే తన గొప్పతనాన్ని చాటారు. పాటంతా వేటూరి గొప్పతనం నిర్ద్వంద్వం. కణ్ణదాసన్ సరళిని అధిగమించి (కృష్ణశాస్త్రికి, శ్రీశ్రీకి, ఆత్రేయకు, ఆరుద్రకు, దాశరథికి, అనిశెట్టికి కణ్ణదాసన్ స్థాయిని అధిగమించడం సాధ్యపడలేదు) ఆయన కన్నా బాగా రాయడం వేటూరి గొప్పతనం. కణ్ణదాసన్ రాసిన తరువాత అంతకన్న ఒక కవి గొప్పగా రాయడం ఇదే మొదటి సంఘటన అయుండచ్చు. తమిళ్ష్‌లో కణ్ణదాసన్ రాసిన తరువాత ఆ సందర్భాలకు తెలుగులో అంతకన్నా బాగా రాసిన తొలి ఆపై ఒకే ఒక్క కవి వేటూరి.
అమావాస్య చంద్రుడు సినిమాలో మరో పాట “సుందరమో సుమధురమో…” పాట సందర్భానికి ముందుగా తమిళ్ష్‌లో వైరముత్తు రాశారు. ఆ సందర్భానికి కూడా వేటూరి రచన తమిళ్ష్ వైరముత్తు రచనకన్నా గొప్పది. తమిళ్ష్ పాట పల్లవిలో నాయకుడు పాత్రలో వైరముత్తు “సాయంత్రం వాన కురుస్తోంది ఒక్కొక్క చుక్కలోనూ నీ మోము తెలుస్తోంది/ ఇంద్రుడి తోటలోని జీడిపప్పా
మన్మధ దేశానికి మంత్రివే” అని అంటే తెలుగులో “సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో/ మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో” అని వేటూరి అన్నారు.
తమిళ్ష్ మొదటి చరణంలో నాయిక పాత్రలో “తేనెలో తుమ్మెద మునిగేడప్పుడు అయ్యోపాపం అని వచ్చింది వనిత/ మనసులో నిప్పును పెట్టి మోహం అంటావు నీళ్లల్లో మునుగుతూనే దాహం అంటావు” అనీ, నాయకుడు పాత్రలో “ఒంటరితనంలో ఏమీలేని స్థితిలో ఎన్ని రోజులే యవ్వనంలో/ ఎన్నో రాత్రులు? కాల్చేశాయి కలలు రెప్పలు కూడా భారమే యవ్వనంలో” అనీ వైరముత్తు అంటే నాయిక పాత్రలో “ఆనందాలే భోగాలైతే హంసా నంది రాగాలైతే/ నవ వసంత గానాలేవో సాగేనులే, సుర వీణ నాదలెన్నో మోగేనులే” అనీ, నాయకుడు పాత్రలో “వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోవెలలో/మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువు లూదిన గీతికలో” అనీ వేటూరి అన్నారు. తమిళ్ష్ రెండో చరణంలో నాయకుడు పాత్రలో వైరముత్తు “దేహం అంతా మంటల దాహం దాహం తీరడానికి నువ్వే మేఘం/ కళ్లలో ముల్లును పెట్టి ఎవరు గుచ్చారు/ నీళ్లలో నుంచున్నా కూడా చెమటపోస్తోంది” అనీ నాయిక పాత్రలో “మనసును ఆపుకో కొంచెం ఆగిపో పైట వింజామరల్ని విసురుతాను/ మన్మధుడి బాణాలు గుచ్చిన చోట్లలో చందనంగా నన్ను పూస్తాను/చిప్ప నుండి తప్పిపోయిన ముత్యమా
రహస్య రాత్రి పుస్తకమా” అనీ అంటే తెలుగులో నాయకుడు పాత్రలో “అందాలన్నీ అందే వేళ బంధాలన్నీ పొందే వేళ/ కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే” అనీ నాయిక పాత్రలో “కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో/ మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో/ సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో అనీ వేటూరి అన్నారు.
తమిళ్ష్‌లో “సాయంత్రం వాన కురుస్తోంది ఒక్కొక్క చుక్కలోనూ నీ మొహం తెలుస్తోంది” అని అనడం బావుంది. తెలుగు పల్లవి చాల గొప్పగా రాశారు వేటూరి. “మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో” అని అనడం కావ్యస్థాయి. తమిళ్ష్ పాటలో ఈ స్థాయి వాక్యాలు లేవు. ఇంక రెండు చరణాల విషయంలోనూ తెలుగు పాటకు తమిళ్ష్ పాట సరితూగలేకపోయింది.
“వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోవెలలో/ మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలో” అనీ, “కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే” అనీ, “కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో/ మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో” అనీ వేటూరి అన్నది గొప్పగా ఉన్నాయి. తమిళ్ష్‌లో వైరముత్తు ఈ స్థాయి సాహిత్యం ఇవ్వలేదు.
రాముడే రావణుడైతే సినిమాలో “రవివర్మకే అందని ఒకే ఒక అందానివో…” అంటూ వేటూరి రాసిన సందర్భానికి ముందుగా కన్నడం సొసె తంద సౌభాగ్య సినిమాలో “రవివర్మన కుంచద కలె బలె సాకారవో…” అంటూ ఆర్.ఎన్.జయగోపాల్ రాశారు. కన్నడం పల్లవిని “రవివర్మ కుంచె కళకు భలే సాకారానివో/ కవి కల్పనలో కనిపిస్తున్న అందం యొక్క జాలానివో” అని జయగోపాల్ రాస్తే తెలుగు పల్లవిని “రవివర్మకే అందని ఒకే ఒక అందానివో/ రవి చూడని పాడని నవ్య నాదానివో” అని వేటూరి రాశారు.
మొదటి కన్నడం చరణంలో “ఉయ్యాలలో ఆడుతూ ఆనందిస్తున్న రూపసీ/ దేవలోకం నుంచి దిగి వచ్చిన నిజ ఊర్వశీ నా ప్రేమ ప్రేయసీ” అని రాస్తే “ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే/ ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే/ ఏ మూగ భావాలో అనురాగ యోగాలై నీ పాటలే పాడనీ” అని వేటూరి రాశారు. రెండో చరణాన్ని జయగోపాల్ “పువ్వుల రాశి మధ్యలో నవ్వుతూ ఉన్న కోమలీ/ కవి కాళిదాసు కావ్యరాణి శకుంతలా శాశ్వతమైన యవ్వనం నీదే” అని రాస్తే “ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే/ ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే/ ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై కదలాడనీ పాడనీ” అని వేటూరి రాశారు.
సాహిత్య స్థాయి పరంగా తెలుగు వేటూరి సాహిత్యం చాల ఉన్నతంగా ఉంది. “రవివర్మ కుంచె కళకు భలే సాకారానివో” అని జయగోపాల్ అంటే “రవివర్మకే అందని ఒకే ఒక అందానివో” అని వేటూరి అన్నారు. అటుపైన ఈ పాటంతా వేటూరి చాలా గొప్పగా రాశారు. కన్నడ చరణాలు ఏ మాత్రమూ తెలుగు చరణాల ముందు నిలిచేవి కావు. బావుకత, భావం, భాష పరంగా తెలుగు చరణాలు కన్నడం కన్నా ఎంతో గొప్పగా ఉన్నాయి. ఒక సందర్భంలో కన్నడ కవి ఆర్.ఎన్. జయగోపాల్‌తో ఈ పాట గురించి చర్చ చేస్తూ వేటూరి రచన గొప్పగా ఉందని అన్నాను. ఆయన కాదనలేదు.
జీ.ఎస్. శివరుద్రప్ప రాష్ట్రకవి పురస్కారాన్ని అందుకున్న కన్నడ కవి. ఆయన రాసిన ఒక కవితను తరువాతి రోజుల్లో పుట్టణ్ణ కణగాల్ తన మానససరోవర సినిమాలో పాటగా పొందుపరిచారు. ఆ సినిమా తెలుగులో అమాయక చక్రవర్తి. కన్నడం పల్లవి: “వేదాంతి చెప్పాడు బంగారం అంతా మట్టి, మట్టి/ కవి ఒకడు పాడాడు మట్టి అంతా బంగారం, బంగారం”. తెలుగు పల్లవి: “వేదాంతమంటున్నది జగమంతా స్వప్నం, స్వప్నం/ కవి స్వాంతమంటున్నది జగమంతా స్వర్గం, స్వర్గం”.
కన్నడం మొదటి చరణం: “వేదాంతి చెప్పాడు ఈ స్త్రీ మాయ, మాయ/ కవి ఒకడు కలవరించాడు ఈమె సౌందర్యవతి, సౌందర్యవతి/ ఈమె తోడుంటే నేను స్వర్గాన్నే గెలుస్తాను”. తెలుగు మొదటి చరణం: “వేదాంతమేమన్ననూ నిలబడితే అది చెట్టు, చెట్టు/ఏ కావ్యములు ఏమన్నా పడిపోతే అది కట్టె, కట్టె/బ్రతుకులో సత్యముంటే అది అంతే, ఇది ఇంతే”. కన్నడం రెండో చరణం: “వేదాంతి చెప్పాడు ఈ బ్రతుకు శూన్యం, శూన్యం/ కవి నిలబడి చాటాడు ఇది శూన్యం కాదు/ జన్మ జన్మలు చవి చూస్తాను నేనెంత ధన్యుణ్ణి”. తెలుగు రెండో చరణం: “వేదాంత వాదమ్ములో ఈ బ్రతుకు శూన్యం, శూన్యం/ కవికంఠ నాదమ్ములో అది జన్మజన్మల పుణ్యం/ కవి భావనే సత్యమైతే ఈ జన్మ ధన్యం, ఈ జన్మ ధన్యం”.
ఈ రెండు భాషల పాటల విషయంలో కన్నడం స్వతంత్రం. ఉన్న రచనను సన్నివేశం కోసం ఉపయోగించుకున్నారు. తెలుగులో సన్నివేశానికీ, బాణికీ రాయాలి. ఆ పని వేటూరి నేర్పుగా చేశారు. పల్లవిలోనే వేటూరి సత్తా చాటారు. మూలంలో ఉన్న దాన్ని పునర్నిర్మితం చేశారు వేటూరి. మొదటి చరణం వేటూరి అన్నది మూలం కన్నా గొప్పగా ఉంది. రెండో చరణాన్ని వేటూరి మలిచిన తీరు ప్రశంసనీయం. ఈ సందర్భంలో వేటూరే ప్రశస్తం అన్నది సుస్పష్టం.
వేటూరి సినిమా పాటల్లో ప్రదర్శించిన గజలియత్ సీ. నారాయాణరెడ్డి గజళ్లు అని రాసిన వాటిల్లో కూడా తీసుకురాలేకపోయారు. తమిళ్ష్ సినిమా కోళ్షిక్కూవుదు. ఇది తెలుగులో వీరభద్రుడు పేరుతో వచ్చింది. అందులో ఒక తమిళ్ష్ ప్రేమ యుగళగీతాన్ని వైరముత్తు రాస్తే అదే సందర్భానికి ట్యూన్‌కు తెలుగులో వేటూరి రాశారు. ఆ పాటలో వేటూరి గజలియత్‌ను ఆవిష్కరించారు ఇలా: “చందమామ ఎండకాసే నిప్పుపూల దండలేసే/ గుబులు గుబులు గుండెలోన అర్థరాత్రి తెల్లవారే/ అతని చేయి తాకితేనే అలవికాని ఆశలాయే/ ఉండి ఉండి ఊపిరంతా పరిమళాల వెల్లువాయే/ ఆపలేని విరహవేదనే తీపితీపిగా ఎదను కోయగా”
సీ. నారాయణరెడ్డి ఆదిగా తెలుగులో గజళ్లు అని రాసిన చాల మందికి అందనిది వేటూరి ఆవిష్కరించిన ఈ గజలియత్. ఈ పాటలోనే “లేత ఉసురు సోకితేనే కన్నెవయసు గాయమాయే” అనీ, “తాళలేని తపన వేడిలో రెండు ఎదలలో ఏక తాళమై” అనీ అని వేటూరి తన ముద్రను బలంగా వేశారు. (ఈ పాట విషయంలోనూ తమిళ్ష్ వైరముత్తు వేటూరి స్థాయిలో రాయలేదు) ఫార్సీ కవిత గొప్పతనం, సంతకం గజలియత్. ఈ గజలియత్ మన వాల్మీకి రచనల్లోనే ఉందన్న సత్యాన్ని గుంటూరు శేషేంద్రశర్మ ‘కవిసేన మేనిఫెస్టో’లో తెలియజేశారు.
గుంటూరు శేషేంద్రశర్మ తన విశ్వఘోష కవితలో “అడగారిన అంబుధి కెరటంలాగై/ వేసవి కాలపు వాగై/శుక్లపాడ్యమీ వేళ శశిరేఖకు విడుచు నూలు పోగై అణగారిందేమో!” అంటూ ఒక శ్రేష్ఠమైన రచనా సంవిధానాన్ని ప్రదర్శించారు. ఇది సృజనాత్మక కవితా వైశిష్ట్యం. ఇంతే శ్రేష్ఠమైన రచనా సంవిధానంలో, ఇంతే సృజనాత్మక కవితా వైశిష్ట్యంతో వేటూరి “వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై / ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని…” అనీ, “రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై/ ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని” అని అన్నారు. వేటూరి తన పాటల్లో సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన శిల్పాన్ని, ధోరణుల్ని విరివిగా, అలవోకగా చేపట్టారు.
2025 సంవత్సరానికి నొబెల్ పైరస్కార గ్రహీత హంగరి (హంగేరీ కాదు) దేశ రచయిత లజ్లొ క్రజ్నహోర్ కెయ్ (LASZLO KRASZNAHORKAI). లజ్లొ క్రజ్నహోర్ కెయ్ శైలిలో 1. Intricacy 2. Density (or density of language) ఈ రెండూ ప్రత్యేకతలు అని, నొబెల్ రావడానికి ఆ రెండూ కూడా దోహదపడ్డాయి అని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు, ఆలోచనలు, మాటలు జరిగాయి. నిజంగా ఇవి ఏ కవి, ఏ రచయిత రాణింపుకైనా దోహదమయ్యే విశేషాంశాలు.
Intricacy అంటే సంక్లిష్టత అని మనం తీసుకుంటున్న అర్థం కన్నా ‘the complex character of something that has many details parts or elements’ అన్న వివరణ సరైనది ఔతుంది. Density అంటే సాంద్రత. Intricacy, density ఇవి ఒక రచన గొప్పతనంలో ప్రధానాంశాలుగా సర్వత్రానూ, సార్వత్రికంగానూ ఉంటాయి.
ఆదిశంకరాచార్య, కాళిదాసు వంటి మనదేశ, మనజాతి సంస్కృత కవులు, రచయితలు, మన తెలుగు కవులైన తిక్కన, రామరాజ భూషణుడు వరుసలోని మరికొందరు పూర్వకవుల శైలిలో intricacy, density ప్రస్ఫుటంగా తొణికిసలాడుతూంటాయి. అటు తురువాత ప్రధానంగా అన్నమయ్య, విశ్వనాథ సత్యనారాయణ, గుంటూరు శేషేంద్రశర్మ ఈ ముగ్గురి రచనల్లో intricacy, density నిండుగా ఉన్నాయి.
దేవులపల్లి కృష్ణశాస్త్రిలో కొంత, దాశరథిలో కొంతలో కొంత ఇవి ఉన్నాయి. శ్రీశ్రీ కవితా! ఓ కవితా!! లోనూ, మరి కొన్ని వేళ్లమీద లెక్క పెట్టగలిగిన కవితల్లోనూ intricacy ఉంది. హాఫిజ్, రూమీ, ఖలీల్ జిబ్రాన్, ఉమర్ ఖయ్యామ్ వంటి అంతర్జాతీయ కవుల్లో intricacy, density ఉనికి ఉన్నతం. తమిళ్ష్ మహాకవి సుబ్రమణియ బారదియార్ (సుబ్రహ్మణ్య భారతియార్)రచనల్లో intricacy, density ప్రశస్తం. ఈ intricacy, density సమృద్ధిగా వేటూరి పాటల్లో ఉంటాయి!
వేటూరి తన మొదటి సినిమా (ఓ సీత కథ) పాటలోనే “భారతనారీ చరితము మధుర కథా భరితము/ పావన గుణ విస్ఫురితము పతిసుతానుమతము సతము/ శీలజ్జోత్స్నా పులకిత హేలా శారద రాత్రము/ అతిపవిత్ర మఘలవిత్ర మీధరిత్రి కనవరతము” అంటూ intricacy, density రెండిటినీ అందించారు.
“కాళింది మడుగున కాళీయుని పడగన/ ఆబాలగోపాల మా బాలగోపాలుని/ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ/ తాండవమాడిన సరళీ గుండెల నూదిన మురళీ ఇదేనా/ ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి” అనీ, “హరిహరాంచిత కళాకలిత నీలగళా, చాంద్రచ్ఛటాపటల నిటల చంద్రకళా” అనీ, “శతవసంతాల దశదిశాంతాల సుమసుగంధాల భ్రమరనాదాల” అనీ, నా హృదయనేత్రి విశ్వాభినేత్రి జ్వలన్నేత్రధారాగ్ని తప్తకాంచన కమ్రగాత్రి సుగాత్రి/ మద్గాత్ర ముఖసముద్భూతగానాహ్వాన చరణచారణ నాట్యవర్తి సవిత్రీ/ ఫాలనేత్ర ప్రభూతాగ్నిహోత్రములోన పాపసంచయమెల్ల హవ్యమై/ ఈ జన్మతపమునకు ఈ జన్మ జపమునకు గాయత్రివై…” అనీ అని ఇలా ఇంకొన్నీ అని వేటూరి ఇవాళ అంతర్జాతీయంగా విశేషంగా పరిగణించబడుతున్న intricacyని, densityని తన intensityతో తెలుగు సాహిత్యంలో గొప్పగా నమోదు చేశారు.
తెలుగు సినిమా పాటలో వేటూరి సమర్పించిన intricacyకి, densityకి సాటిలేదు. మొత్తం దేశ సినిమా పాటలో ఈ విషయంగా వేటూరికి దీటైన వాళ్లు ఉన్నారా? తన సినిమా పాటతో వేటూరి సమర్పించిన intricacy, density నిజానికి మొత్తం తెలుగు కవిత్వంలోనే పరిగణననీయమైనవి. (సినిమా పాట కవిత్వమా అని వాదించే వాళ్లపై జాలిపడదాం)
“వేణువై వచ్చాను భువనానికి/ గాలినైపోతాను గగనానికి” అని అన్న వేటూరి “మమతలన్నీ మౌన గానం/ వాంఛలన్నీ వాయులీనం” అనీ, “కన్నీటికి కలువలు పూసేనా/ కాలానికి ఋతువులు నవ్వేనా/
మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా/
మాటలతో మరపించినా మనసు వేదన తీరేనా; విధి శోధన ఆగేనా” అనీ, “ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక/ ఏదారెటుపోతుందో ఎవరినీ అడగక” అనీ, “నీ వయసే వసంత ఋతువై; నా మనసే జీవన మధువై” అనీ, “ఏ పూలు తేవాలి నీ పూజకు/ ఏ లీల చేయాలి నీ సేవలు” అనీ, “దీపాలెన్ని ఉన్నా హారతొక్కటే/ దేవతలెందరున్నా అమ్మ ఒక్కటే” అనీ, “గీతార్థసారమిచ్చి గీతలెన్నొ మార్చాడే/ నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే” అనీ,
“ఇది సంగ్రామం మహా సంగ్రామం/ శ్రమ జీవులు పూరించే శంఖారావం/అగ్ని హోత్రమే గోత్రం ఆత్మశక్తి మా హస్తం/ తిరుగులేని తిరుగుబాటు మా లక్ష్యం” అనీ, “చుంబించుకున్న బింబాధరాల సూర్యోదాయాలే పండేటి వేళ” అనీ, “వీణవేణువైన సరిగమ విన్నావా/ తీగరాగమైన మధురిమ కన్నావా” అనీ, “ఆకాశన సూర్యుడుండడు సందె వేళకి/ చందమామకు రూపముండదు తెల్లవారితే” అనీ”, “రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే / తోటమాలి నీ తోడు లేడులే/ వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే” అనీ, “కరిగే బంధాలన్నీ మబ్బులే” అనీ, “తన రంగు మార్చింది రక్తమే/ తనతో రాలేనంది పాశమే” అనీ అంటూ ఎన్నో కావ్య వాక్యాలు వాక్య కావ్యాలు వెలువరించారు.
ఎంతో గొప్ప కవిత్వం రాశారు వేటూరి. భాష , రచనా సంవిధానంపై విశేషమైన పట్టు ఉన్న కవి వేటూరి. వేటూరి కాలంలో సినిమాకు బయట ఆ, ఈ అవార్డుల్ని అందుకున్న కవి అనబడిన ఏ వ్యక్తీ కవిగా వేటూరి ముందు ఎంతమాత్రమూ గణనీయం కాదు. అంత, అత్యంత ప్రతిభావంతమైన కవి వేటూరి.
1976 నుంచీ ఇవాళ్టి వరకూ తెలుగు సినిమాలోనే కాదు తెలుగు భాషలోనే వేటూరి స్థాయి కవి రాలేదు! వేటూరి పాటపై, వేటూరి కవిత్వంపై సరైన, సమగ్రమైన లోతైన, విశాలమైన అధ్యయనం జరగాలి. ఆ అధ్యయనం తెలుగు కవిత్వ పునరుత్థానానికి పునాది కావాలి; ఔతుంది!
ప్రపంచ భాషల్లో ఏ భాష కవిత్వమూ పాడవనంతగా తెలుగు కవిత్వం పాడైపోయింది. ఈ స్థితిలో తెలుగు కవితలోని ప్రముఖ కవులకు అతీతంగా వేటూరి సుందరరామమూర్తి కవిత్వాన్ని అర్థం, అవగతం, ఆకళింపు చేసుకోవడం అత్యవసరం. వేటూరి సృజించి సమర్పించిన ఉన్నత స్థాయి కవిత్వం భవిష్యత్తులో తెలుగు కవిత్వం మనుగడకు, ఉన్నతికి దోహదపడుతుంది.
విశిష్టమైన వేటూరి శ్రేష్ఠమైన కావ్యత్వంతో తెలుగు పాట తేట!
– రోచిష్మాన్
9444012279