– మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాల్సిందే
– బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు
– ఇప్పటివరకు దాదాపు 150 వరకు ఆలయాలను కూలగొట్టారు
“సేవ్ తెలంగాణ – ఓట్ ఫర్ బీజేపీ” నినాదంతో ప్రజలంతా ముందుకు సాగాలి
– కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బిజెపి చార్జ్‌షీట్ విడుదల లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పేర్కొంది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడుతూ “బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు” పేరిట భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ చార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ఈ చార్జ్‌షీట్‌ను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు , మహారాష్ట్ర మంత్రి, తెలంగాణ మున్సిపల్ & కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జ్ అశిష్ షెలార్ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ & కార్పొరేషన్ ఎన్నికల కో–ఇంచార్జులు అశోక్ పర్ణామి , ఎంపీ ఈటల రాజేందర్ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతం రావు , రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జ్ ఎన్.వి. సుభాష్ , సీనియర్ నాయకులు జి. వెంకట్ రెడ్డి , సునీత , విఠల్ గారు, కప్పర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అంశాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజలపై చేసిన మోసాలను తీవ్రంగా ఎండగట్టారు.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420కి పైగా హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ప్రజలను ఘోరంగా మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా మోసపోయారని తెలిపారు. DAలు, PRC, హెల్త్ కార్డులు అమలు చేస్తామని ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, నగదు రహిత వైద్యం పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకు కూడా సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు హామీ గాలిలో కలిసిపోయిందని, ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక, ఆరోగ్య భద్రత లేకుండా అనిశ్చితిలోకి నెట్టబడ్డారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని రాంచందర్ రావు తెలిపారు. రైతుబంధును బంద్ పెట్టారని, రుణమాఫీ, రైతు భరోసా వంటి కీలక హామీలు అమలు కాక రైతులు తీవ్రంగా మోసపోయారని అన్నారు. భూవివాదాలను పెంచేలా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులను కొత్త సమస్యల్లోకి నెట్టిందని విమర్శించారు.
విద్యారంగంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాంచందర్ రావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్లకు చేరాయని, విద్యా భరోసా కార్డులు, బస్తీల్లో పాఠశాలల నిర్మాణం, IIITల ఏర్పాటు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, కొత్త నియామకాలు లేకుండా పాత నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్దానం అమలుకు నోచుకోలేదని తెలిపారు.
వైద్య రంగంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయాయని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు హామీలు అమలుకు దూరంగా ఉన్నాయని అన్నారు.
రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా హామీ ఇచ్చి బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు చికిత్సలు నిరాకరిస్తున్నాయని, పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అన్ని మున్సిపాలిటీల్లో 100 పడకల ఆసుపత్రులు, ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ, ప్రసూతి ఆసుపత్రుల ఏర్పాటు హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు.
మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మాట తప్పిందని విమర్శించారు. నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, అంగన్వాడీ వేతనాల పెంపు, ఎలక్ట్రిక్ స్కూటీల హామీలు అమలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని రాంచందర్ రావు గుర్తుచేశారు.
పేదలు, చిరు వ్యాపారుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని తెలిపారు. ఇళ్లు, పెన్షన్లు, చేయూత పథకాలు హామీలకే పరిమితమయ్యాయని, వీధి వ్యాపారుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
కార్మికులు, యువతకు ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలు జరగలేదని తెలిపారు. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, యువత ఆశలు అడియాశలయ్యాయని విమర్శించారు.
SC, ST, BC వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం, అసైన్డ్ భూములు, పోడు పట్టాల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని తెలిపారు. సామాజిక న్యాయం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు.
మున్సిపాలిటీల్లో పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. నిధులు విడుదల చేయకపోవడంతో చెత్త కుప్పలు, మురికి కాలువలు, దెబ్బతిన్న రోడ్లు, వెలగని వీధి దీపాలతో పట్టణాలు అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల వేళ, గత పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను వంచించిన బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా నడుస్తోందని ఆరోపించారు. అబద్ధపు హామీలు, అసాధ్యమైన వాగ్దానాలతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని రాంచందర్ రావు అన్నారు.
మున్సిపాలిటీల్లో సుమారు రూ.2,500 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూనే రెండున్నరేళ్లుగా అభివృద్ధి, మౌలిక వసతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాంచందర్ రావు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రాణాధారంగా మారిందని ఎన్. రాంచందర్ రావు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, హరిత వనాలు, కమ్యూనిటీ హాళ్లు, సిమెంట్ రోడ్లు, తాగునీటి పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ మున్సిపాలిటీల్లో అమలవుతున్నాయని స్పష్టం చేశారు. కేంద్ర నిధులు లేకపోతే తెలంగాణ మున్సిపాలిటీల పరిస్థితి ఏమైపోయేదో ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పందులు, కోతులు, దోమల సమస్య, డ్రగ్స్, దొంగతనాలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాదులు హిందూ దేవాలయాలను కూలగొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఇప్పటివరకు దాదాపు 150 వరకు ఆలయాలను కూలగొట్టారని ఆరోపించారు.
అయితే మతోన్మాదులు ఆలయాలపై దాడులు చేస్తే.. వారిని పిచ్చివారిగా చూపించి వదిలివేస్తోందని ఫైరయ్యారు. హిందూ దేవాలయాల భూములు కబ్జాలకు గురవుతున్నాయని, ఆక్రమణకు పాల్పడిన వారిలో పలువురు అధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారని విమర్శించారు. గోరక్షకులపై కాల్పులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో హోంమంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ వంటి కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయని, అయినప్పటికీ ఈ శాఖలన్నీ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని రాంచందర్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి కూడా పాలనలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణాలు, టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పాలన మొత్తం 40 శాతం కమిషన్ల పాలనగా మారిందని తీవ్రంగా మండిపడ్డారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని, సుపరిపాలన అందిస్తోందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మితే ప్రజలు మరోసారి మోసపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రజల పక్షాన నిలబడేది భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తును కాపాడాలంటే “సేవ్ తెలంగాణ – ఓట్ ఫర్ బీజేపీ” నినాదంతో ప్రజలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్, స్వచ్ఛ భారత్, స్వనిధి, పీఎం జన్‌ధన్ యోజన, ఉజ్వల, కుసుమ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా మున్సిపాలిటీలకు చేరాలంటే, రానున్న మున్సిపల్ – మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అవినీతిరహిత, అభివృద్ధి దిశలో పాలన అందించే కమలం గుర్తుపై ఓటు వేసి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బలపడుతోందని, రానున్న రోజుల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.