– పోలీసులకు హైకోర్టు ఆదేశం
– లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ హర్షం
సికింద్రాబాద్: ఫిబ్రవరి 7 వ తేదీన సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి అనుమతించాలని హై కోర్టు సోమవారం పోలీసు శాఖను ఆదేశించింది.
గత నెల 17 వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి MG రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ కోసం పోలీసు శాఖను అనుమతి కోరగా, చివరి నిమిషంలో నిరాకరించిన పోలీసు అధికారులు. దీంతో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ జనవరి 21 వ తేదీన నగర పోలీసు కమిషనర్, మల్కాజిగిరి DCP లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్యారడైజ్ గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీకి అనుమతించాల్సిందిగా కోరుతూ మరోమారు దరఖాస్తు చేయడం జరిగింది.
గత నెల 17 వ తేదీన నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి పోలీసు శాఖ చివరి నిమిషంలో దరఖాస్తు ను రద్దు చేయగా, ఇబ్బందులు ఏర్పడ్డాయని అయితే జనవరి 21 వ తేదీన చేసిన దరఖాస్తు పై పోలీసు శాఖ నుండి స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 7 వ తేదీన ర్యాలీకి అనుమతించాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ హై కోర్టును ఆశ్రయించారు.
సోమవారం ఇరువర్గాల వాదనలు విన్న హై కోర్టు 21 వ తేదీన చేసిన దరఖాస్తు పట్ల సానుకూలంగా స్పందించాలని, అవసరమైతే లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులతో సంప్రదించి తగు నిబంధనలు రూపొందించి పూర్తి నివేదికను ఈ నెల 5 వ తేదీ లోగా సమర్పించాలని, హైకోర్టు 13 వ బెంచ్ న్యాయమూర్తి తుకారాం జీ పోలీసు శాఖను ఆదేశించారు. లష్కర్ జిల్లా సాధన సమితి తరపున సీనియర్ న్యాయవాది ముఖీద్ వాదనలు వినిపించారు.