– అంబటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ పార్లమెంటు టిడిపి శ్రేణులు దిష్టి బొమ్మ దగ్ధం
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అహంకారపూరిత, అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని సికింద్రాబాద్ పార్లమెంటు పార్టీ నాయకులు విమర్శించారు.
అంబటి వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ పార్లమెంటు టిడిపి నాయకులు అశోక్ నగర్ వద్ద నల్లెల కిషోర్, పి. బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ, నిప్పు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ద్వారా సుమారు 250 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంబటి రాంబాబు ‘డైవర్షన్ పాలిటిక్స్’ కు పాల్పడుతున్నారని టిడిపి నేతలు విమర్శించారు.
పవిత్రమైన శ్రీవారి ప్రసాదం తయారీలో ఆవు నెయ్యి బదులు 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వాడారని, ఇందులో 36 మంది భాగస్వామ్యమున్నట్లు SIT రిపోర్ట్ స్పష్టం చేసినా, ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం అంటే రాష్ట్ర ప్రజలందరినీ అవమానించడమేనని నేతలు ధ్వజమెత్తారు.
తప్పును ఎత్తిచూపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రౌడీయిజంతో తొలగించడమే కాకుండా, సభ్య సమాజం తలదించుకునేలా బూతులతో రెచ్చిపోవడం అంబటి అహంకారానికి నిదర్శనమని అన్నారు. మాజీ మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన అంబటి బజారు రౌడీలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే హానికరమని నేతలు అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో పరశురామ్, ఓ. వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, భాను ప్రకాష్, కరణం కిరణ్, శ్యామ్ సుందర్, తడక వినోద్, అనిల్ కురుమ, వంశీ కృష్ణ, చంద్రమోహన్ గౌడ్, ఎస్.ప్రకాష్, కొమురయ్య, భవానీ శ్రీనివాస్, పి.వీరబాబు, అమ్మి నాయుడు, భిక్షపతి చారి, సత్యనారాయణ, అహ్మద్ అలీ, శక్తి ప్రేమ్, రవి గౌడ్ పాటు సికింద్రాబాద్ నియోజకవర్గ టిడిపి శ్రేణులు మరియు ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.