– నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెడుతున్నారా?
– పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్..
హైదరాబాద్: మేనిఫెస్టోలో ఉన్న హామీని కూడా లేదు అని చెప్పే దగుల్ బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నోటిఫికేషన్, ఎగ్జామ్, ప్రాసెస్ అంతా బీఆర్ఎస్దే.. కేవలం పోస్ట్‌మెన్‌లా లెటర్లు ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని మేము ఎక్కడా చెప్పలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడటం దుర్మార్గం.
ఓట్లు దండుకోవడం కోసం ఆనాడు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గార్ల సాక్షిగా విడుదల చేసిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లోని మొదటి పేజీలో, మొదటి పాయింట్‌గా రాసిచ్చిన హామీని ఇప్పుడు తుంగలో తొక్కుతారా?
అధికారంలోకి రాకముందేమో పేపర్లలో ప్రకటనలు ఇచ్చి, ప్రచార సభల్లో గొంతు చించుకొని ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని ఊదరగొట్టారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక మేము అనలేదు.. మా టర్మ్ ఐదేళ్లలో ఇస్తాం అన్నాం అని మాట మార్చడం నిరుద్యోగులను, తెలంగాణ యువతను మోసం చేయడమే.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోంది. ఆ 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎగ్జామ్స్ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి నియామక ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నీ సిద్ధం చేశాక, కేవలం అపాయింట్మెంట్ లెటర్లు చేతికి ఇచ్చి, ఆ ఉద్యోగాలను మీ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. ఇతి వేసి పొత్తు కూడినట్టు ఉంది మీ తీరు.
రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి భర్తీ చేసిన ఉద్యోగాలు 5 వేలకు మించి లేవు. మిగతావన్నీ కేసీఆర్ హయాంలో భర్తీ చేసినవే.
మేనిఫెస్టోలో పెట్టిన హామీని పీసీసీ అధ్యక్షుడే ఇలా అబద్ధం అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇప్పటికైనా అబద్ధాలు ఆడం మాని, మీరు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి డిమాండ్ చేస్తున్నాం.