మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లకు లేదు
కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసి కేసీఆర్‌ను బొక్కలో వేయించాలి: సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్: బీజేపీ నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణలకు ప్రధాని మోదీ ముందు మాట్లాడే ధైర్యమే లేదని, ఇక్కడ వచ్చి కాంగ్రెస్‌పై రంకెలేయడం తప్ప కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి తెచ్చిన చరిత్ర లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను జైలుకు పంపించడమే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ గడ్డపై నుంచే ప్రత్యేక తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ మాట ఇచ్చారని, ఎన్నో అవాంతరాలు ఎదురైనా, అన్నీ కోల్పోయినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆరెస్ నాయకులు వేల కోట్లు సంపాదించుకున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీలేదని విమర్శించారు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడితే బీఆరెస్ నేతలు విషం చిమ్ముతున్నారని, పేదలకు కనీసం డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు.
రైతులకు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేశామని తెలిపారు.
నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దమనిషి పాలమూరుకు వచ్చాడని, బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ తమ జాతీయ నాయకులందరినీ తీసుకొచ్చినా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీని ఒక్క సీటు కూడా గెలవనీయరని స్పష్టం చేశారు. గతంలో ప్రధాని మోదీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నారని, ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ నాయకులు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. మెట్రో రెండో విడత, కాళేశ్వరం విచారణ, మూసీ ప్రక్షాళన నిధుల గురించి మాట్లాడకుండా ఏ మొహం పెట్టుకుని బీజేపీ నాయకులు రాష్ట్రానికి ప్రచారానికి వస్తున్నారని నిలదీశారు. బీజేపీ, బీఆరెస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ అవయవదానం చేసి బీజేపీని 8 స్థానాల్లో గెలిపించిందని ఆరోపించారు.
అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి తీర్మానం పంపినా, ఆరు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అన్న ప్రధాని మాటలకు ఇప్పటివరకు చర్య ఎందుకని నిలదీశారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అధికారిపై విచారణకు అనుమతి కోరినా స్పందన లేదన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న బీజేపీ, బీఆరెస్‌లు పదేళ్ల బీఆరెస్ పాలన, పన్నెండేళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ధైర్యముంటే ఎల్బీ స్టేడియంకు వచ్చి తలలు లెక్కపెడదామన్నారు.
వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. చొప్పదండిలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తున్నామని చెప్పారు. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించామని తెలిపారు. కేవలం రైతుల కోసమే రెండేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చామని అన్నారు.
గత ప్రభుత్వంలో ఆడబిడ్డలు కట్టుకునే చీరల్లో కూడా కమిషన్లు తీసుకున్నారని విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం రెండేళ్లలో రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని, మహిళలకు రూ.27 వేల కోట్ల రుణాలు అందించి వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల యజమానులను చేశామని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని అప్పులపాలు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, ఆయన కుటుంబం ఇసుక నుంచి మిడ్ మానేరు ఇండ్ల వరకు వదలలేదని ఆరోపించారు. 2027లో గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఆలయాలను అభివృద్ధి చేస్తామని, ఎకో టూరిజంను ప్రోత్సహించి పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావడం లేదని, పేదల దేవుళ్లను మొక్కేందుకు వారికి నామోషీ అని విమర్శించారు. బీఆరెస్ ఎన్ని శాపనార్థాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు అధికారం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్‌కు ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామని, వరంగల్–కరీంనగర్ జంట నగరాలుగా అభివృద్ధి చేసి మధ్యలో డంప్ యార్డు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధికి బండి సంజయ్ ఏం నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధి ఆగదని, మున్సిపల్ ఎన్నికల్లో మంచి వారిని ఎన్నుకుని కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తామని, మళ్లీ వస్తానని హామీ ఇచ్చారు