– ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
వికారాబాద్: దేశంలోని సామాజిక, ఆర్థిక రుగ్మతలకు పరిష్కారం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజల్లో నిరంతరం పనిచేస్తూ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం సాధనలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పాత్ర పోషించిందని పేర్కొన్న ఆయన, అంటరానితనం నిర్మూలన నుంచి భూ సంస్కరణలు, ఎస్సీ-ఎస్టీ హక్కుల పరిరక్షణ వరకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం సాధించడంతో పాటు సామాజిక న్యాయం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించిన ఆయన, రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులు విశ్వనాథన్, వంశీ చందర్ రెడ్డి, సావంత్, సచిన్ రావు తో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.