“ఓటు హక్కు అనేది కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే కాదు, అది రాజ్యాంగబద్ధమైన పౌర హక్కు”. ఇది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా యొక్క ప్రత్యేక సవరణ. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్‌లో మొదలుపెట్టినప్పటి నుండి ఎన్డీఏ పక్షాలు తప్ప ఎవరూ సమర్థించలేదు. కానీ ఎన్నికలసంఘం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. బీహార్ లో 2024 సాధారణ ఎన్నికలలో ఓటేసిన వారి నుండి శాసనసభ ఎన్నికలు వచ్చేటప్పటికి 65 లక్షల ఓట్లు తొలగిపోయాయి.
ఎస్.ఐ.ఆర్. బీహార్‌లో రివిజన్ మొదలుపెట్టగానే వివాదం మొదలైంది. విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 65 లక్షల ఓట్లు తొలగించారు, ఎన్నిసార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కేసులు తేలలేదు. ఈలోపు బీహార్ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు పశ్చిమబెంగాల్లో ఎస్.ఐ.ఆర్. మొదలైంది. బెంగాల్లో పరిస్థితి వేరుగా ఉన్నది. బెంగాల్లో బంగ్లాదేశ్ నుండి వచ్చినవారి ఓట్లు తొలగించాలనేది ఎన్నికల కమిషన్ లక్ష్యం.
ఎస్.ఐ.ఆర్. ముఖ్య ఉద్దేశ్యం నకిలీ ఓట్లను తొలగించి, కొత్తవారికి ఓటుహక్కు కల్పించటం. మరణించినవారి ఓట్లు తీసివేయటం, కొత్తగా ఓటుహక్కు పొందే వయస్సు వచ్చినవారిని ఓటర్ లిస్టులో చేర్చటం, బదిలీలు లాంటివి ప్రతిసంవత్సరం చూస్తూనే ఉంటాం. భారత పౌరులందరికీ ఓటుహక్కు కల్పించటం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. అది ఒక నిరంతర ప్రక్రియ. కానీ గత కొద్దికాలంగా దేశంలో ఎన్నికల కమిషన్ చేపట్టే కార్యక్రమాలు ప్రతిపక్షానికే కాకుండా ప్రజలకు కూడా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఎన్నికల కమిషనర్లను నిర్ణయించే బాధ్యతల నుండి భారత ప్రధానన్యాయమూర్తిని తొలగించటం, అకస్మాత్తుగా ఎన్నికల కమిషనర్లు రాజీనామాలు చేయటం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారు వారం రోజుల లోపుగానే ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయటం, పార్లమెంటు సీట్లు, సమస్యాత్మక ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎన్నికల షెడ్యూలును ఖరారు చేయటం వంటి విషయాలు ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చాలా ముఖ్యమైన విషయం మరియు అవసరం అనేది ఎవరూ కాదనలేని సత్యం. కానీ అది జరుగుతున్న విధానం సందేహాలు రేకెత్తిస్తున్నాయి. బీహార్‌లో సరిగ్గా ఎన్నికలు సమీపించే సమయంలో మొదలుపెట్టి, ఓటర్ల లిస్టులో నుండి తొలగించే వారికి వారి పౌరసత్వాన్ని నిరూపించుకోవలసినంత భారం ఓటర్ల పైన పెట్టటం ఈసీఐ మీద అనుమానాలను కలిగించాయి.
ఇప్పుడు పశ్చిమబెంగాల్లో కూడా అదే పరిస్థితి. బీహార్ లో మొదలుపెట్టిన మోడల్ విజయవంతం అయ్యింది కాబట్టి, బీజేపీకి బెంగాల్ కూడా బీహార్ కంటే మించిన ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రం కావటంతో అదే పద్ధతిని మరింత కఠినంగా అమలు చేస్తున్నారు అనిపిస్తున్నది.
డిజిటల్ యుగంలో ఉన్నాము అనే కుంటిసాకుతో, ఓటర్ తనను తాను ఆ ప్రాంత ఓటరే అని నిరూపించుకోవటానికి సేవా కేంద్రాల చుట్టూ తిరగవలసిన అవసరాన్ని కల్పిస్తున్నారు. రోజువారీ పనిపాటలు చేసుకునే వారు ఓటర్ ఐడి కార్డ్ కోసం రోజుల తరబడి సేవా కేంద్రాల చుట్టూ తిరగటం కష్టం. వారి దినసరి వేతనం లేకపోతే వారికి గడవదు. ఓటర్‌గా నిరూపించుకునే ప్రక్రియను సంక్లిష్టం చేయటం వలన వస్తున్న ఇబ్బందులు ఇవి. కేంద్రమే ఇచ్చిన ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డులను పనికిరాని వాటిగానే చేశారు.
రాష్ట్రప్రభుత్వాలు మంజూరు చేసే రేషన్ కార్డులను కూడా నివాస ధ్రువీకరణ పత్రాలుగా ఒప్పుకోవటం లేదు. ఓటర్ను లిస్టు నుండి తొలగించే ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వటం లేదనేది బాధితుల ఆరోపణ.ఓటర్ లిస్టులో జరుగుతున్న తొలగింపులో ఎక్కువశాతం బడుగు బలహీన వర్గాల వారివే ఉంటున్నాయి అని బెంగాల్ నుండి ఒక పాత్రికేయ మిత్రుడు చెబుతున్నారు.
వారిని టార్గెట్ చేస్తే లాభమేమిటి అంటే ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ పోటీ పడుతున్నప్పుడు, ప్రాంతీయ పార్టీ తాను చేయలేని అభివృద్ధికి సాకుగా కేంద్ర ప్రభుత్వాన్ని చూపిస్తుంది కాబట్టి, రోజువారీ కాయకష్టం చేసుకునే వారి నిత్య జీవితంలో ఉండే అసంతృప్తికి వారే బాధ్యులవుతారు అని అంటున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం లాంటి విషయాలకు వారు ప్రాధాన్యత ఇవ్వరు అన్నారు. అందులో కూడా వాస్తవం ఉన్నది. భక్తి ఉన్న వారికి ప్రతి ఊరులోనూ రామాలయం ఉంటుంది. అయోధ్య రాముడైనా, అనకాపల్లి రాముడైనా రాముడు మన ఇంటి రాముడే.
మరి బీహార్‌లో ఎన్డీఏ అధికార పార్టీగానే ఉన్నది కదా అంటే అధికారపార్టీలు చేసే అభివృద్ధి ఫలాలు బడుగు జీవుల వరకు రావు కాబట్టి, అక్కడ కూడా వారే టార్గెట్ అయ్యారు అని అంటున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలు మనకు కొత్త కాదు, కానీ బడుగు బలహీన వర్గాల ఓటు విలువ ఎక్కువ ఉంటే కూడా తొక్కేస్తారు అనుకుంటే బాధగా అనిపిస్తుంది. ఈ విషయంలో ప్రతిపక్షం కూడా బాధ్యత వహించవలసిందే. బీహార్‌లో ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు హడావుడి చేశారు. దానికి “ఓటు చోరీ” అని పేరు పెట్టి ఆ నినాదంతో ఆగిపోయారు. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిఘటన కొనసాగించలేకపోతున్నారు.
ఇక సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు కొత్తగా వింటున్నట్లుగా వ్యాఖ్యానిస్తుందే కానీ నిర్దిష్టమైన తీర్పు ఇవ్వదు. ప్రపంచాన్ని జయించటానికి పావుగా ఎంచుకుని సుంకాలను విధించిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమెరికా సుప్రీంకోర్టు సంవత్సరం తిరిగేటప్పటికి కొట్టివేసింది. మన దేశంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతిని తీసుకోవాలా అనే ప్రశ్న రెండున్నర సంవత్సరాలు గడచిపోయినా ఇప్పటికీ తేలలేదు. ఈలోపులో చంద్రబాబు నాయుడు 53 రోజులు జైలులో ఉన్నాడు, బెయిల్ వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పైన చేయబడిన ఆరోపణలకు ఆధారాలు లేవని కేసు పెట్టిన సీఐడీ కోర్టుకు తెలిపింది, కేసు కొట్టివేయబడింది.
ఎస్.ఐ.ఆర్. మీద సంవత్సరం నుండి సుప్రీంకోర్టు వింటూనే ఉన్నది. ఇప్పుడు కూడా ఫైనల్ ఆర్డర్ ఇవ్వకుండా కొన్ని నిబంధనలు మాత్రం విధించింది. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను, క్లెయిములను పరిష్కరించటానికి జిల్లాకోర్టుల సిట్టింగ్ మరియు రిటైర్డ్ జడ్జిలను నియమించాలని ఆదేశించింది. కారణం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు మధ్య నమ్మక లోపం ఉన్నది కాబట్టి. విచారణ సరిగా చేయాలని ఈసీఐని, సమగ్ర విచారణ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు పెట్టకూడదని నిర్ధారించింది.
విచారణను మార్చిలో ఫైనల్ గా వింటామని వెల్లడించింది. రాజకీయనాయకులు ఎస్.ఐ.ఆర్. పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది.రాజకీయవ్యవస్థ, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఎవరి ప్రతిభను వారు వెల్లడి చేసుకుంటున్నారు కానీ, సామాన్యుడికి జరిగిన న్యాయమేమిటో మాత్రం అర్థం కాలేదు. కానీ అందరూ కోరుకుంటున్నామని చెప్పింది మాత్రం ఒక్కటే: “సర్వేజనా సుఖినోభవంతు.”
– ఇంద్రాణి