నేను ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో కా. నల్లకన్ను సిపిఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఎప్పుడు కలిసినా నన్ను ఏంతో ఆప్యాయంగా పలకరించే వారు, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకునేవారు, అభిమానించే వారు. నాకు అత్యంత ప్రియమైన కామ్రేడ్ నల్లకన్నుని 2024 డిసెంబరు 27న చెన్నయ్ లో ఆయన నివాసానికి వెళ్ళి కలిశాను. ఆయన ముఖకవళికల్లో సంతోషం కనిపించింది.
కా. నల్లకన్ను తమిళనాడులో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. ఆయన వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకమైనది. ఆయన కమ్యూనిస్టు నైతిక విలువలకు నిలువుటద్దం. భారత కమ్యూనిస్టు పార్టీ, తమిళనాడు రాష్ట్ర పూర్వ కార్యదర్శి. నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మొదలుకొని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయనకు ఎదురొచ్చి నమస్కరిస్తారు.
కా. నల్లకన్ను గారు 101 ఏళ్ళ వయస్సును పూర్తి చేసుకుని, శత జన్మదిన వేడుకను, భారత కమ్యూనిస్టు పార్టీ శత వ్యవస్థాపక దినోత్సవంతో కలిపి జరుపుకున్న ధన్యజీవి. దిగువ మధ్య తరగతి కుటుంబం నివసించే ఇంట్లో నివసిస్తూ, సాధారణమైన జీవితాన్ని గడిపారు. కా. నల్లకన్ను జీవితం కమ్యూనిస్టులకే కాదు, నైతిక విలువలతో జీవించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. కా. నల్లకన్ను గారి జీవితం భావితరాలకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం.
– టి. లక్ష్మీనారాయణ