– రేవంత్ రెడ్డి సర్కారు గడ్డపార సర్కారుగా మారింది
– శారదా పీఠానికి అండగా ఉంటాం
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: కోకాపేట్ నియోపోలిస్ ప్రాంతంలో విశాఖ శారద పీఠానికి చెందిన రాజశ్యామల అమ్మవారి ఆలయం నిర్మితమై, అప్పటి నుంచే అక్కడ నిత్య పూజలు, వేద పాఠశాల కార్యకలాపాలు, నిత్య అన్నదానం నిరంతరంగా కొనసాగుతున్నాయి.
2019లో గత ప్రభుత్వ హయాంలో చట్టబద్ధంగా విశాఖ శారద పీఠానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే శారదా పీఠాన్ని, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ రెడ్డి సర్కారు గడ్డపార సర్కారుగా మారింది.
హైడ్రా పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడం, ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేత, జూబ్లీహిల్స్లో హిందూ దేవాలయాల కూల్చివేత.. ఇది ఇప్పుడు ఒక తంతుగా మారిపోయింది.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలనే లక్ష్యంగా చేసుకుంటోంది. హిందూ దేవాలయాలను, పేదల ఇండ్లను కూల్చిన వారిని సమర్థించేలా దిగజారింది. ఇది దుర్మార్గం. అదే కోవలో ఇప్పుడు శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం శారదా పీఠం జోలికి వస్తే బిజెపి ఊరుకోబోదని గట్టిగా హెచ్చరిస్తున్నాం. హిందూ సంస్థలు, వ్యవస్థలు, దేవాలయాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోంది. మజ్లిస్ పార్టీతో దోస్తానా చేసి, ముస్లిం ఓటు బ్యాంకు కోసం, సంతుష్టీకరణ రాజకీయాల పేరుతో హిందూ విశ్వాసాలపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య.
వేద పాఠశాల నడుస్తున్న చోట, నిత్య అన్నదానం జరుగుతున్న ఆధ్యాత్మిక కేంద్రంపై- శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని కూల్చివేయాలని ప్రయత్నించడం దారుణం.
ఈ అంశంపై అక్కడి స్వామిజీతో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. అదేవిధంగా మార్చి 2వ తేదీన నేను స్వయంగా శారదా పీఠానికి వెళ్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాలు, మఠాల జోలికి వస్తే మేం ఊరుకోం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం బిజెపి నిరంతరం పోరాడుతుంది.