– ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాల్లో కోత పెడతారా?
– మీ కుట్ర ఏంటో ఉపాధ్యాయ లోకానికి సమాధానం చెప్పాలి
– రాజకీయ విమర్శలు చేయడానికి సిగ్గుపడాలి
– రాజకీయాలు చేయాలనే ముచ్చటే ఉంటే గాంధీ భవన్కు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకుని రండి
– విద్యాకమిషన్ సిఫార్సులపై ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఫైర్
హైదరాబాద్: ఆకునూరి మురళి గారూ.. ఇకపై మీ పేరు ఎనుముల మురళి అని మార్చుకుంటే బెటర్. ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం మీరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే జాలేస్తోంది. ఐఏఎస్ హోదాలో పని చేసినా కూడా.. మీ బుద్ధి ఆలోచనా తీరు మాత్రం ఆ హోదాకు తగ్గట్టుగా లేకపోవడం విచారకరం.
దశాబ్దాల తెలంగాణ చరిత్రలో విద్యా రంగాన్ని స్వర్ణయుగంగా మార్చింది కేసీఆర్. పదేళ్లలో కేసీఆర్ విద్యాశాఖ మీద రివ్యూ చేయలేదని చెప్పడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. తెలంగాణ వ్యాప్తంగా 1000 కి పైగా గురుకులాలు, 75 కొత్త డిగ్రీ కళాశాలలు, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ, మహిళా వర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, మన ఊరు-మన బడి, విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కీం పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్.. ఇవన్నీ కేసీఆర్ రివ్యూలు చేయకుండా గాల్లో నుంచి ఊడిపడ్డాయా?
విద్యా కమిషన్ పేరుతో కళ్లు మూసుకుని అబద్ధాలు చెబితే జనం నమ్మరు మురళి గారూ.. రీసెర్చ్ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ అని చాలా గొప్పగా ప్రకటించారు కదా.. ఆ కమిటీలో ఉన్నది ఎవరు? వారి సిఫార్సులు ఏమయ్యాయి?
సోషియాలజీలో పీహెచ్డీ చేసిన వాడిగా నేను సూటిగా అడుగుతున్నా.. Education, Pedagogy, Education Policy కి మధ్య ఉన్న తేడా నాకు తెలుసు.. అసలు మీ ప్యానెల్ లో ఉన్న వాళ్ళకు ఆ తేడా తెలుసా ?
రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ కంటే వెయ్యి రెట్లు నయం అని గొప్పలు చెబుతున్న మురళీ గారు.. ముందు ఈ వాస్తవాలు తెలుసుకో. కేసీఆర్ పాలనలో (2022-23) ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు 48% ఉంటే.. మీ రేవంత్ గారి పాలనలో (2025-26) అది 34 శాతానికి పడిపోయిన మాట వాస్తవం కాదా? అదే సమయంలో 2025-26 లో ప్రైవేట్ స్కూళ్లలో నమోదు 52% నుంచి 66% కు ఎందుకు పెరిగింది? ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టిస్తున్నది రేవంత్ రెడ్డి కాదా..దీనికి ఏం సమాధానం చెబుతారు?
మీరు గొప్పగా చెప్తున్న మీ కమిషన్ రిపోర్టులో.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయి అని పొందుపరిచారు. అంటే దీని అర్థం ఏంటి. ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాల్లో కోత పెడతారా? మీ కుట్ర ఏంటో ఉపాధ్యాయ లోకానికి సమాధానం చెప్పాలి.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరంలో 2,000 కు పైగా ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. ప్రభుత్వ విద్యను బతికించాల్సిన మీ కమిషన్.. బడులు మూతపడుతుంటే ఎక్కడ పోయింది?
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో దాదాపు 130 మంది పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే.. మీ విద్యా కమిషన్ కనీసం ఒక్క రోజైనా నోరు విప్పిందా? ఆకలితో అలమటిస్తూ, పురుగులు పడ్డ అన్నం తినలేక రోడ్లెక్కిన విద్యార్థుల పక్షాన ఒక్క మాటైనా మాట్లాడలేని మీరు ఇప్పుడు మాట్లాడే నైతికత మీకు ఉందా?
విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే గుడ్డి గుర్రం పళ్లు తోమిన మీ కమిషన్.. ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడానికి సిగ్గుపడాలి. రాజకీయాలు చేయాలనే ముచ్చటే ఉంటే.. ఆ కుర్చీ దిగి, గాంధీ భవన్కు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకుని రండి మురళీ బాబూ.. అప్పుడు తేల్చుకుందాం.