– అభివృద్ధి పనులు అనేవి నిరంతర ప్రక్రియ.
– 200 సంవత్సరాలు నిలిచిపోయేలా పనులు చేశాం.
– పూర్తికాని 5 శాతం పనులను వెంటనే పూర్తి చేయాలి.
– బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి.
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఎస్.ఎస్.తాడ్వాయి మండలం, ములుగు జిల్లా: గత నెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర విజయవంతం కావడానికి అందరం పట్టుదలతో పనిచేయడం వల్లే విజయవంతమైందని, మేడారంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
శనివారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం నకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క లకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, తదితరులు పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క లు వన దేవతలను దర్శించుకున్నారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ సీతక్క సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజు దేవతల గద్దెల చుట్టూ రాతి నిర్మాణాన్ని, ఆలయ చుట్టూ ప్రకారం , ప్రధాన ఆర్చిలను, ప్రహరీ సాండ్ స్టోన్ చిత్రాలను, చుట్టూ డ్రైనేజీ, మీడియా టవర్ లను, గద్దెల చుట్టూ ఉన్నా గ్రిల్స్ లను ఆలయ ఫ్లోరింగ్ ను కూలంకషంగా పరిశీలించారు. అనంతరం వాహనం లో జంపన్న వాగు, హరిత,ఊరట్టం, చిలకల గుట్ట, ఆర్ టి సి జంక్షన్ లను కూలంకషంగా పరిశీలించారు. అనంతరం మంత్రులు మేడారంలోని హరిత హోటల్ లో సంబంధిత శాఖల ఉన్నత జిల్లా అధికారులతో , మేడారం జాతర అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాఖల వారిగా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.; మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి నిత్యం భక్తులు వివిధ ప్రాంతాల నుండి చేరుకుంటున్నారని, సెలవు రోజులలో లక్షలాదిమంది భక్తులు అమ్మవార్ల దర్శన భాగ్యం కోసం చేరుకుంటున్నారని అన్నారు. మేడారం చేరుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిరంతరం ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని సూచించారు. ఆలయ ప్రాంతంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, గుత్తేదారులకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పట్టుదలతో ఈ జాతరను ఎన్నడు లేని విధంగా విజయవంతం చేయాలన్న సంకల్పంతో 251 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ప్రధాన ద్వారం తో పాటు గద్దెల ప్రాంతం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేశామని, 2 వందల సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా పనులు చేయడం జరిగిందని వివరించారు.
మహా జాతరకు వచ్చిన భక్తులకు త్రాగునీరు ఇబ్బంది ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నివాస స్థలాలు ఏర్పాటు చేసి అధికారులు విజయవంతం చేశారని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించడం చెప్పుకోదగ్గ విషయమని అధికారులను అభినందించారు. జాతరకు ముందే 95 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, మిగతా ఐదు శాతం పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రకారం ఆలయం పునర్నిర్మాణం చేయడం జరిగిందని, భవిష్యత్తు తరాలకు 200 సంవత్సరాల వరకు ఎంత మంది భక్తులు వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన వసతులను రోడ్ల విస్తరణ నివాసయోగ్యం ఇతర వసతులు కల్పించడం జరిగిందని, అమ్మవార్ల గద్దెలు, ఆలయ ప్రకారం, ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రపంచం మొత్తం జాతర వైపు చూసిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా చెక్ డాం ల నిర్మాణానికి ప్రణాళికల సిద్ధం చేయాలని, రహదారులకు ఇరువైపులా ప్లాంటేషన్ చేయాలని అన్నారు.
మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా జాతర అనంతరం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, జాతర అనంతరం కూడా అధికారులకు మరింత బాధ్యత పెరిగిందని మనసా వాచా కర్మణా మిగిలిన పనులను పూర్తి చేయాలని అన్నారు.
మేడారం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం ప్రజా ప్రభుత్వం రెండవ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం జరుగుతుంది.
దానిలో భాగంగా మేడారం ప్రాంతంలోని రెండు చెరువులను అభివృద్ధి చేయడం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, మీడియా భవన్ వంటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జాతర విజయవంతంలో అధికారులు చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్ల శక్తిని గ్రహించి ప్రతి పని విషయంలో చోరవ చూపారని, ఏకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అమ్మవార్ల భక్తి చాటారని అన్నారు. నిత్యం తరలివస్తున్న భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు.
అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ 2026 మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని విజయవంతానికి కృషి చేసిన అధికారులు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
నాలుగు రోజులు పాటు జరిగిన మహా జాతరకు 1 కోటి 55 లక్షల మంది భక్తులు రావడం జరిగిందని, భవిష్యత్ తరాలకు 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఆలయం పునరుద్ధరణ చేయడం జరిగిందని భక్తుల రద్దీ కారణంగా మిగిలిన సూక్ష్మ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి సూచన మేరకు జంపన్న వాగులో 365 రోజులు నీరు ఉండే విధంగా గోదావరి నది జలాలను జంపన్న వాగుకు మళ్ళించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం పుణ్య స్నానాలు ఆచరించడానికి రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తు నీరు నిల్వ ఉండే విధంగా జంపన్న వాగుపై ఐదు చెక్ డాం ల నిర్మాణాలు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, మేడారం ప్రాంతంలో ఉన్న రెండు చెరువులను సుందరీకరించి అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. జాతర విజయవంతానికి తోడ్పడిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు , కృషిచేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ & బి ఈ ఎన్ సి మోహన్ నాయక్ , జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు మునిసిపాలిటీ చైర్మెన్ చింతనిప్పుల చంద్రకళ, ఈ ఓ వీరస్వామి, పూజారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.