– రేవంత్ రెడ్డి మార్క్ ‘దోపిడీ పాలన’లో కుప్పకూలిన విద్యా వ్యవస్థ.
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న పరిపాలనా వైఫల్యాలను, విద్యాశాఖలో జరుగుతున్న భారీ అవినీతిని ఆధారాలతో సహా ఎండగట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపున హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఒకే ప్రశ్నాపత్రం – ఉస్మానియా వర్సిటీ చరిత్రలో చీకటి రోజు
ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ తీరుపై శ్రవణ్ విస్మయం వ్యక్తం చేశారు.
“ఫిబ్రవరి 25న జరిగిన 5 ఏళ్ల లా కోర్సు పరీక్షకు, ఫిబ్రవరి 27న జరిగిన 3 ఏళ్ల లా కోర్సు (హానర్స్) పరీక్షకు ఒకే ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి అధికారులు బరితెగించారు. సిలబస్ అంశాలు దగ్గరగా ఉన్నప్పటికీ, రెండు వేర్వేరు కోర్సులకు ఒకే పేపర్ ఇవ్వడం విద్యార్థుల మేధస్సును అవమానించడమే.
రెండు రోజుల ముందే పరీక్ష జరిగిన పేపర్ మళ్ళీ రావడం వెనుక ఉన్న నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? కనీసం ఒక క్వశ్చన్ పేపర్ కూడా సరిగ్గా సెట్ చేయలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది?” అని ఆయన నిలదీశారు.
బంకర్ బెడ్ల కొనుగోలులో ₹100 కోట్ల కుంభకోణం
విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిపై శ్రవణ్ ఘాటు విమర్శలు చేశారు.
“గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల కోసం కొనుగోలు చేసే బంకర్ బెడ్ల విషయంలో భారీ దోపిడీ జరిగింది. మార్కెట్ ధర ప్రకారం ₹60 కోట్లకు రావాల్సిన బెడ్లను, ప్రభుత్వం ₹160 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే అక్షరాలా ₹100 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టింది.
గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీలకు తెలంగాణలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ టెండర్లు కట్టబెట్టడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలి” అని డిమాండ్ చేశారు.
విద్యా కమిషన్ నివేదిక – పేద విద్యార్థులపై దాడి
ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ నివేదికపై ఆయన మండిపడ్డారు.
“తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు తప్పుల తడకగా ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలిచే గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను రద్దు చేయాలని సిఫార్సు చేయడం దారుణం.
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ₹10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను ఈ ప్రభుత్వం అటకెక్కించింది. గతంలో ఉస్మానియాకు కేటాయించిన ₹1000 కోట్లు ఏమయ్యాయో సమాధానం చెప్పాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుల్డోజర్ రాజకీయం – వినాశకర పాలన
రాష్ట్రంలో సామాన్యుల ఇళ్లను కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
“ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసి వారిని రోడ్డున పడేశారు. శారదా పీఠం భూముల విషయంలో హరీష్ రావు వెళ్లగానే కక్షపూరితంగా నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాలను టీ-హబ్ (T-Hub) లో పెడతామని చెప్పి, విమర్శలు రావడంతో వెనక్కి తగ్గడం ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనం. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు.”
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని, కేవలం ‘దోపిడీ’ మాత్రమే తెలుసని శ్రవణ్ విమర్శించారు. “మీకు పాలన చేతకాకపోతే దిగిపోండి. విద్యాశాఖను కనీసం చదువుకున్న, బాధ్యత గల వ్యక్తులకు అప్పగించండి” అని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా పరాచకాలు ఆపి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన హెచ్చరించారు.
