(మార్తి సుబ్రహ్మణ్యం)
హిందువులు ఆరాధించే కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల రాజకీయాలకు వేదిక కావడం విచారకరం.పార్టీలు ఎత్తు పైఎత్తుల క్షుద్ర రాజకీయాల్లో.. చివరాఖరకు ఆ దేవదేవుడు కూడా తురుపుముక్క కావడం, కోట్లాదిమంది హిందువులను క్షోభ పెడుతుంది. ఈ క్షుద్రరాజకీయంలో హిందువులపై పేటెంటీ పొందిన ‘దేశభక్త’ పార్టీ కూడా ఉండటం మరో విషాదం.
దేవుడు!.. ఇది నమ్మేవాళ్లకు గుండెల్లో కొలువైన స్థానమయితే, నమ్మనివాళ్లను లేరన్న విశ్వాసం. ఇది విశ్వాసులు-అవిశ్వాసుల మధ్య కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతున్న మానసిక భావనాపరమైన ఘర్షణ.
సరే. ఏదేమైనా నమ్మేవాళ్లకు దేవుడు ఉన్నాడు. నమ్మని వారికి లేనట్లు లెక్క. ఈ సనాతన-హేతువాదనలు పక్కనపెడితే.. అన్ని రాజకీయపార్టీలూ దేవుడిపై భారం వేసి, ఎన్నికల ప్రచారానికి బయలుదేరే ముందు, తిరుమల వెంకన్న ముందు సాగిలబడి తమ పార్టీలను కరుణించమంటూ ఆర్తిగా ప్రార్ధించేవే. కాళ్లరిగేలా కొండపైకి నడిచి వెంకన్న ఆశీర్వాదం ఆకాంక్షించేవే.
ఇప్పుడు అలాంటి వీరభక్త పార్టీలన్నీ వైరి పక్షాలుగా నిలబడి, అదే తిరుమలను కేంద్రంగా చేసుకుని.. అరాజకీయం చేయటమే హిందువుల మనసును గాయపరచడం క్షమించరానిదేనన్నది భక్తుల మనోభావన. మరి ఈ రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలు గుర్తిస్తున్నాయా? లేక హిందువుల మనోభావాల కంటే.. రాజకీయ ప్రయోజనాలే ప్రధానమని భావిస్తున్నాయా? అన్నదే ప్రశ్న.
వేల సంవత్సరాల నుండి ఉంది హిందూ మతం/సనాతన ధర్మం/వైదిక ధర్మం. తనను తానే కాలానుగుణంగా కాలక్రమంలో సంస్కరించుకుంటూ, ఎన్నో సమకాలీన ధర్మాలు కనుమరుగవుతున్నా, ఇంకా విరాజిల్లుతూనే ఉంది , విరాజిల్లుతుంది కూడా. .
దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా నయా హిందూ/సనాతన ధర్మ రక్షకులు ఉద్భవించారు . తామే రక్షించగలమని గావుకేకలు పెడుతున్నారు . ఈ క్రమంలో హిందూ మతాన్ని , దేవుళ్ళను , ముఖ్యంగా వెంకన్నని పావుని చేసారు . 2019 ఎన్నికల ముందు పింక్ డైమండ్ గోల . 2024 ఎన్నికల తర్వాత ఇప్పుడు సుదీర్ఘ విరామానంతరం లడ్డు యాగీ! అంశం ఏదైనా దాని కేంద్రబిందువు మాత్రం ఏడుకొండలే. ఇదే దరిద్రం!
గతంలో ఎన్నికల ముందు వెంకన్న పింక్ డైండ్ మాయమయి, అది నాటి సీఎం చంద్రబాబు ఇంటి నేలమాళిగల్లో ఉందంటూ విపక్ష వైసీపీ-నాటి తిరుమల అర్చకస్వామి జమిలిగా చేసిన యాగీ అంతా ఇంతా కాదు. వైసీపీ ఎన్నికల ప్రచారానికి ఆ పింక్ డైమండ్ అక్కరకొచ్చింది. హిందువులకు ఆ ఆరోపణ కనెక్టయి, నాటి అధికార టీడీపీ రాజకీయ వియోగం అనుభవించాల్సి వచ్చింది.
పోనీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ- ఎన్నికల ముందు తానే చేసిన ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో తేల్చిందా? చంద్రబాబు ఇంటి నేలమాళిగల్లో దాచిపెట్టారని, ఎన్నికల ముందు తామే ఆరోపించినందున.. బాబు ఇంటి నేలమాళిగలను పురావస్తుశాఖవారితో తవ్వించి, పింక్ డైమండును మళ్లీ స్వామివారికి అలంకరించిందా అంటే అదీ లేదు.
పైగా అసలు స్వామివారికి పింక్ డైమండ్ అనేదే లేదు. అంతా తూచ్.. అని ఘనత వహించిన ఈఓ సాములు చావుకబురు చల్లగా చెప్పారు. అంతేనా? గత టీటీడీ పాలకవర్గం వేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకునేంత వరకూ వెళ్లారు. అంటే వెంకన్న పింక్ డైమండ్ ఒక రాజకీయ పార్టీ పతనానికి- మరో పార్టీ అధికార ప్రాప్తికి అక్కరకొచ్చిందన్నమాట. మరి ఆ ప్రకారంగా ఓట్ల కోసం వైసీపీ హిందువులను వెర్రివారిని చేసి, వారి మనోభావాలను సొమ్ము చేసుకున్నట్లే కదా?
పోనీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమేమైనా నాటి పింక్ డైమండ్ అనే ఆరోపణలను బట్టకాల్చి తమ నె త్తిపై వేసిన వారి సంగతి తేల్చిందా అంటే అదీ లేదు. ఆ ఆరోపణలు చేసిన వారిని కోర్టుకీడ్చి చట్టప్రకారం శిక్షించిందా?
టీటీడీ చైర్మన్, క్యూలైన్లలో జరిగే వ్యవహారాలపై సోషల్మీడియాలో పోస్టులు పెట్టే వారిపై యుద్ధప్రాతిపదికన కేసులు పెట్టించి, జైలుకు పంపించే టీడీపీ పాలకవర్గం-కమ్ ఈఓ… స్వామివారి పింక్ డైమండ్ దొంగిలించారంటూ, అడ్డగోలు ఆరోపణలు చేసిన వారిని ఎందుకు విడిచిపెట్టింది? అంటే కలియుగ దైవమైన వెంకన్న కంటే, ఆయన పేరుతో ఉపాథి పొందుతున్న టీటీడీ చైర్మన్లు-అధికారుల పరువే ముఖ్యమా? ఈ మౌనం-పిరికితనం హిందూ సమాజానికి ఏం సంకేతం-సందేశం ఇస్తున్నట్లు?
గత కొద్ది నెలల నుంచి తిరుమల లడ్డు కల్తీ ఆరోపణ-ప్రత్యారోపణ- సవాళ్లు-ప్రతి సవాళ్ల రాజకీయం.. వికృతరూపం దాల్చి, పరాయి మతాల దృష్టిలో పలచనయి, వెంకన్న అప్రతిష్ట పర్వం పరాకాష్టకు చేరి.. దానికి మరికొన్ని ముదనష్టపు అంశాలు అదనంగా తోడయి, మొత్తంగా కొండపై కొలువుతీరిన దేవదేవుడి ప్రతిష్ఠ మసకబారి.. తిరుమల లడ్డు అంటేనే అనుమానం రేె త్తే దౌర్భాగ్య పరిస్థితి దాపురించేందుకు, అన్ని పార్టీలూ కారణమనన్నది నిష్ఠుర సత్యం.
దేవుడిని నమ్మని వారు ఎలాగూ నమ్మరు.ఎందుకంటే ఎవరి నమ్మకం వారిది. కానీ నమ్మే కోట్లాదిమంది హిందువుల నమ్మకాన్ని చంపేసే వ్యవహారంలో, అన్ని పార్టీలూ తలా ఓ చేయి వేస్తుండటమే విషాదం. అందుకు హిందుత్వంపై పేటెంట్ తీసుకున్న ‘దేశభక్త భారతీయ పార్టీ’ కూడా మినహాయింపు కాకపోవడం మరింత విషాదం.
తిరుమల లడ్డుపై గత కొద్దినెలల నుంచి నిర్విరామంగా, నిర్విఘ్నంగా, నిర్నిరోధంగా జరుగుతున్న చర్చ లాంటి రచ్చ గురించి మళ్లీ ప్రస్తావించడం రోత. ఎందుకంటే రోజూ దానిపై అధికార-విపక్ష పార్టీలు చేసుకునే వాంతులను, ప్రచార-ప్రసార మాధ్యమాల్లో దర్శిస్తున్నవే.
ఇప్పుడిక చర్చించాల్సింది…రక్షించాల్సింది కోట్లాదిమంది హిందువుల మనోభావాలను మాత్రమే. ఎందుకంటే తిరుమల లడ్డు అంశంలో నిర్విరామంగా జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహోదగ్రులవుతున్న హిందూ సమాజం, ఇంకెంతమాత్రం ఈ రాజకీయ రచ్చను క్షమించదు కాబట్టి!
సరే.. సెక్యులర్ పార్టీల రాజకీయాలు కొంతమేరకు అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే వాటికి అన్ని కులాలు-అన్ని మతాల ఓట్లు కావాలి కాబట్టి! వాటి కోణం ఎప్పుడూ రాజకీయ లాభనష్టాల తూకాల ఆధారంగానే ఉంటుంది.
కానీ ప్రపంచంలోని హిందువులకు తానే పెద్దన్నగా.. అసలు యావత్ హిందూ జాతిపై తానొక్కరికే సర్వహకులూ ఉన్నాయని ప్రచారం చేసుకునే ‘దేశభక్త భారతీయ పార్టీ’ కూడా.. ఈ వికార-వికృత రాజకీయంలో భాగస్వామి కావడమే ఆశ్చర్యం. కేవలం ఆశ్చర్యమే కాదు. క్షమించరాని నేరం.
అసలు ఈ లడ్డు అంశంలో ఎవరైనా ముద్దాయి ఉన్నారంటే, అది ఆ దేశభక్త పార్టీనే. ఆ పార్టీ సిఫార్సు చేసిన ఆరుగురు ప్రతినిధులే అప్పుడు-ఇప్పుడూ ‘కొండ’ చూరుపట్టుకుని వేళ్లాడుతున్నారు. మరి కల్తీ జరిగినప్పుడు.. బోర్డులోనే సభ్యులుగా అఘోరిస్తున్న ఈ ఆరుగురు దేశభక్తుల పార్టీ ప్రతినిధులు అడ్డుకోకుండా, గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా? గుప్పెడు నిద్రలు మాత్రలు మింగి గెస్టుహౌసుల్లో తొంగున్నారా? ఇప్పుడు మంత్రి-ఎమ్మెల్యే పదవులు వెలగబెడుతున్న మరో ఇద్దరు.. ఆనాడు నెయ్యి కొనుగోలు చేసే పర్చేంజింగ్ కమిటీలో ఉన్నప్పుడు.. ‘అది కల్తీ నెయ్యి. దానిని కొనవద్ద’ని చెప్పేందుకు నోరు రాలేదేం? మళ్లీ ఇప్పుడు అదే నోళ్లు కల్తీ లడ్డుపై మాట్లాడటం రోత కదా?
నిజంగా దేశభక్త భారతీయ పార్టీకి హిందూ సమాజంపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. ఈపాటికే తాము సిఫార్సు చేసిన ఆ ఆరుగురు సభ్యులతో రాజీనామా చేయించి ఉండాల్సింది. అలాగే టీడీపీ కూడా.. అప్పట్లో కల్తీ నెయ్యి కొనుగోలు చేసిన, నాటి సభ్యురాలైన- నేటి ఎమ్మెల్యేతో రాజీనామా చేయించడం ద్వారా, తమ చేతులు శుభ్రంగా ఉన్నాయని నిరూపించుకునేది. కానీ ఇవేమీ జరగకపోవడమే విచారకం.
అసలు ఈ అ‘రాజకీయం’లో సెక్యులర్ పార్టీలను మించి, కల్తీ లడ్డు అంశంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ‘దేశభక్త భారతీయ పార్టీ’ తీరే కొంత వింతగా-మరికొంత రోతగా కనిపిస్తోంది. ఈ కల్తీ రోత వ్యవహారంలో భాగస్వాములయిన, తాము సిఫార్సు చేసిన ఆరుగురు బోర్డు సభ్యులపై వేటు వేయకుండా.. అదేదో వేరే పార్టీ హయాంలో జరిగిన అపచారమంటూ చేస్తున్న యాగీ, హిందువులను ఏమాత్రం మెప్పించదు.
జగన్ జమానాలో వారిని సిఫార్సు చేసింది ఇదే దేశభక్త పార్టీ కాదా? ఇక కొండపై అవుట్సోర్సింగ్ సంస్థలు, దర్శనాలు, పైరవీలకు పార్టీని మార్కెటింగ్ చేసుకునే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్టిస్టులు’ కూడా, కల్తీ లడ్డుపై యాగీ చేయడమే వింత, విడ్డూరం!
ఏది ఏమైనా ఇప్పటివరకూ కల్తీ లడ్డుపై జరిగిన రచ్చకు తార్కిక ముగింపు ఇచ్చి, చాలించాల్సిన అవసరం అన్ని పార్టీలపైనా ఉంది. ఇప్పటికే ఈ అపవిత్ర అంశంపై చర్చ రచ్చగా మారి.. వెంకన్న ప్రతిష్ఠ మసకబారి, పరాయి మతాల దృష్టిలో పలచన కావడాన్ని సగటు హిందువు సహించలేకపోతున్నాడు. హిందువులే దేవదేవుడి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని.. తమ రాజకీయాల కోసం దేవుడిని రోడ్డున పడేస్తున్నారన్న ఆగ్రహం-అసంతృప్తితో రగిలిపోతున్నాడు.
అంచేత రాజకీయపార్టీలకు వెంకన్నపై గానీ.. ఆయనను కొలిచే హిందువులపై గానీ గౌరవం ఉంటే.. హిందూ సమాజం మనోభావాలను గుర్తించి-గౌరవించి, తిరుమల లడ్డు కల్తీ చర్చ లాంటి రచ్చకు తెరదించడమే ఉత్తమం. లేకపోతే అది బూమెరాంగయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. విశ్వహిందూ పరిషత్ నుంచి సీపీఐ రామకృష్ణ వరకూ ఈ అంశానికి ఇక తెరదించమని కోరుతున్నారంటే, ఈ అంశంపై జరుగుతున్న ప్రచారంపై ఎంత విరక్తితో ఉన్నారో అర్ధమవుతుంది.
ఇక తిరుమల కల్తీ లడ్డు అంశంపై ఎదురుదాడి చేస్తున్న వైసీపీకి.. జగన్ జమానాలో జరిగిన అకృత్యాలను చర్చిస్తున్న కూటమికి రాజకీయంగా వచ్చే లాభ నష్టాలేమిటో చూద్దాం.
జగన్ క్రైస్తవుడని, ఆయన కుటుంబం క్రైస్తవ మతాచారాలు పాటిస్తుందని, తండ్రి వైఎస్ అంత్యక్రియలు కూడా క్రైస్తవ మతాచారం ప్రకారమే చేశారని ప్రపంచానికి తెలుసు. అదే సమయంలో జగన్ విపక్షనేతగా-ఆ తర్వాత సీఎంగా తిరుమల కొండపైకి భార్యను, ఒక్కసారి కూడా తీసుకుని వెళ్లలేదనీ తెలుసు. జగన్ గుళ్లకు వెళ్లి ఎన్ని నామాలు పెట్టుకున్నా- ఎన్ని నదుల్లో ముక్కుమూసుకుని మునిగినా ఆయనను హిందువుగా ఎవరూ గుర్తించరు. పైగా ఆయన జమానాలో క్రైస్తవులకు టీటీడీ చైర్మన్ పదవులు ఇచ్చారన్న ఆరోపణ ఇంకా నలుగుతూనే ఉంది.
ఇక జగన్ పార్టీకి క్రైస్తవులు-దళిత క్రైస్తవులు- రెడ్లు- ముస్లిములు సంప్రదాయ మద్దతుదారులన్నదీ బహిరంగమే. వీటికి మించి.. ఆయన అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించారనీ తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాతనే.. వైసీపీకి, తొలుత 67 స్థానాలు ఇచ్చి, తర్వాత జరిగిన ఎన్నికల్లో అద్భుత మెజారిటీతో అధికారం కట్టబెట్టిన ప్రజలే, గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేశారన్న వాస్తవాన్ని విస్మరించకూడదు.
మరి ఇక కొత్తగా ఆ పార్టీని రాజకీయంగా భ్రష్టుపట్టించడానికి ఏముంది? తమ హయాంలో చేయకూడని పనులు చేశాం కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నామని అంబటి రాంబాబు చెప్పిన తర్వాత.. ఇక ఆ పార్టీని రాజకీయంగా సమాధి చేసేందుకు, లడ్డు అంశాన్ని ప్రయోగించడం వివేకవంతుల లక్షణం కాదు.
పైగా.. లడ్డు అంశం రాను రాను.. హిందూ-క్రైస్తవ వ్యవహారంగా మారితే, అది జగన్ పార్టీకి రాజకీయంగా లాభమే తప్ప, నష్టం కాదన్నది గ్రహించాలి. దీనితో గత ఎన్నికల్లో.. స్థానిక కారణాలతో జగన్ పార్టీకి ఓటు వేయని క్రైస్తవ-దళిత క్రైస్తవులు-ముస్లింలు, ఈసారి వైసీపీ వైపు మొగ్గు చూపేందుకు ఈ అంశం దోహదపడే ప్రమాదం లేకపోలేదు. ‘జగన్ తన ధర్మం తాను నిర్వర్విస్తున్నాడు. హిందువులే తమ ధర్మం నెరవేర్చడం లేద’ని తాజాగా ఒక పీఠాథిపతి చేసిన వ్యాఖ్యల మర్మం గ్రహించాలి.
పోనీ అలాగని అదే సమయంలో యావత్ హిందూ సమాజం అంతా ఒక్కతాటిపైకొచ్చి, గంపగుత్తగా కూటమికి ఓట్లు వేస్తారా అంటే అదీ లేదు. ఎందుకంటే క్రైస్తవులు-ముస్లిములకు ఉన్న ఐక్యత-మతాభిమానం, కులాల సంఖ్య ఎక్కువగా ఉన్న హిందువుల్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అలాగని టీడీపీ-జనసేన రాజకీయంగా క్రైస్తవులు-ముస్లిములను వదులుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే రెండూ సెక్యులర్ పార్టీలే కాబట్టి!
మరి తిరుమల లడ్డు అంశాన్ని తీవ్రతరం చేసినందుకు కూటమికి రాజకీయంగా వచ్చే లాభమేమిటి? దానిని చర్చించి, దన్నుగా ఉన్న హిందువులను దూరం చేసుకోవడం తప్ప.. అన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
ఏదేమైనా మత విశ్వాసాలతో కూడిన సున్నితమయిన ఈ కల్తీ లడ్డు అంశానికి ఇకనయినా తెరదించి, విజ్ఞత ప్రదర్శించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైనా ఉంది.