– పేదవాడిని ఇబ్బంది పెట్టడం.. ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు
– వరదలు వచ్చినపుడు ముంపు బాధితులుగా మిగలకూడదు అనేది మా తపన
– కూకట్ పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్ పల్లికి రావడం సంతోషంగా ఉంది.రాజకీయాలకు అతీతంగా మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తా.
రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకెళ్లడమే మా విధానం. చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు, ఎంతమంది ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా మౌనంగా భరించా. నల్ల చెరువు అభివృద్ధిని చూసాక.. ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూస్తే నాకు ఆ విమర్శలు ఆశీర్వాదంగా మారినట్లు కనిపిస్తోంది.
పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. వరదలు వచ్చినపుడు ముంపు బాధితులుగా మిగలకూడదు అనేది మా తపన. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి నా సూచన ఒక్కటే.. మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తాం.
చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.నగరంలోని చెరువులన్నింటినీ పునరుద్దరించుకుందాం. దేశంలో మహానగరాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అందుకే మన నగరంలో ప్రకృతిని కాపాడుకుని చెరువులను పునరుద్ధరించుకుందాం.
మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం
కోర్ అర్బన్ రీజియన్ లో ఉన్న చెరువులన్నీ పునరుద్ధరించుకుందాం. నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం, రోడ్ల విస్తరణ చేపడుదాం. ఒక మంచి నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చి దిద్దుకుందాం. అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిని అడ్డుకోకండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అభివృద్ధి చేసుకోలేం.
ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తెండి.. తల తాకట్టు పెట్టైనా నిధులు ఇచ్చే బాధ్యత నాది. కష్ట కాలంలో ఈ ప్రాంత ప్రజలు నన్ను నిలబెట్టారు.. నన్ను నిలబెట్టిన మీ కోసం అభివృద్ధి చేయడానికి వెనకాడను. మీ సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతా.