– జనాభా ప్రాతిపదికన పోలిసింగ్ ఉండేలా ప్రణాళికలు
– సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల కమిటీ
– ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి.
– అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో ఎదురైన సమస్య లోతును అర్థం చేసుకోవాలి
– తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. మనం ఎక్కడున్నామో తెలిసుకోగలిగితే మనం ఎక్కడికి చేరుకోవాలో తెలుస్తుంది. అందుకే ఈ రిట్రీట్ కార్యక్రమం ద్వారా సమస్యలు, పరిష్కారాలపై విశ్లేషించుకున్నాం.
ఛాలెంజ్ లు రెండు రకాలు.. ఒకటి టెక్నికల్ ఛాలెంజ్, రెండోది అడాప్టివ్ ఛాలెంజ్. రిసోర్సెస్, సమయాన్ని కేటాయిస్తే టెక్నికల్ ఛాలెంజ్ ను అధిగమించవచ్చు. కానీ… అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో ఎదురైన సమస్య లోతును అర్థంచేసుకోవాలి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి.
రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండకూడదనే తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించుకున్నాం. పెట్టుబడులను ఆకర్షించడానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 2100 కి.మీ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా పరిగణించుకుంటున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం.
దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు నగరంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయి.అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఏ సమస్య వచ్చినా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమే. ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేది. ఇందుకోసం ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు. అవినీతిని నిరోధించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఫిజికల్ క్రైమ్ నిరోధించేందుకు ఇప్పటి వరకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం.
కానీ ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది. సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న సిబ్బంది, అధికారులను అప్ గ్రేడ్ చేసుకోకపోతే నేరాలను నిరోదించలేరు. రిట్రీట్ కార్యక్రమం ద్వారా మీ సమస్యలను గుర్తించి విశ్లేషించుకున్నారు.
సమస్య ఏమిటో గుర్తిస్తే 50 శాతం సమస్య పరిష్కారం అయినట్లే. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్ మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి మీరు కొన్ని ప్రతిపాదనలు అందించారు. సమస్యల పరిష్కారానికి మీరు అందించిన ప్రతిపాదనలపై విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం.
మీ ప్రతిపాదనలపై కమిటీలో విశ్లేషించి చట్టం రూపంలో మా ముందుకు తీసుకురండి. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంటుంది. పోలీస్ శాఖలో సిబ్బంది రేషనలైజేషన్ చేసుకుని జనాభా ప్రాతిపదికన పోలిసింగ్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి.
పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్ కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇతర శాఖల్లా పోలీస్ శాఖలో ఆటో మోడ్.. ఆటో ప్రమోషన్ ఉండదు. పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాల్సిందే. అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. మీ పనితీరు ఆధారంగానే పోస్టింగులు ఉంటాయి.
ప్రతీ ఏటా డిసెంబరులో రిట్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసునేలా ప్రణాళిక రూపొందించుకోండి. బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే, అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించుకోవచ్చు.