– ఆర్గానిక్ ఫార్మింగ్ లో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేయండి
– వ్యవసాయ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేయండి
– వ్యవసాయ శాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్ : రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లతో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ లో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములుగా చేయాలని వ్యవసాయ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలు, పూల సాగు చేయించి ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్ గోడౌన్లు, వేర్ హౌసింగ్ గోదాములపై సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.
ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ శాఖకు విద్యుత్ ఖర్చులు మిగలడంతో పాటు అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించుకునే అవకాశం, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ శాఖ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటుకు సంబంధించి రెడ్కో సంస్థను సంప్రదించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం తెలిపారు.
గత ప్రభుత్వ కాలంలో చేపట్టని అనేక సంక్షేమ పథకాలను రైతుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు పెద్ద సంఖ్యలో పంపిణీ చేస్తుంది అదేవిధంగా విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.
రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని ఈ అంశాన్ని రైతులకు చక్కగా వివరించాలని మంత్రులు సూచించారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల కింద వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న తీరు, నీటి సరఫరా, యాసంగి వరి సాగు, మార్కెట్లోకి రానున్న ధాన్యం, సేకరణ తదితర అంశాల పై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్దాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.