– ఎలా పరీక్షలు నిర్వహిస్తారు? ఎలా పోస్ట్ లు భర్తీ చేస్తారు?
– భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా ప్రవేశ పెట్టిన జాబ్ క్యాలెండర్ చెల్లని చిత్తు కాగితం అయింది
– అప్డేట్ చేయాల్సింది ఓటీఆర్ ను కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
– రిటైర్డ్ జడ్జీలు సైతం తమ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు
– ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా?
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్:. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలపై, కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు యూత్ డిక్లరేషన్ పై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఏనుగుల రాకేష్ రెడ్డి తెలంగాణ భవన్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ…99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో కేవలం ఒక్క రోజు నిరుద్యోగ యువత గురించి, జాబ్ నోటిఫికేషన్ ల గురించి ఆలోచించే సమయం లేదా? 20 వేల పోలీస్ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. లైసెన్సిడ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. ఎకరం సర్వే చేస్తే కేవలం 10 రూపాయలు మాత్రమే ఇవ్వడం పై పునరాలోచన చేసి, పెంపు పై ప్రకటన చేయాలి.
ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతభత్యాల పై ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. విద్యా శాఖ ప్రక్షాళన పేరుతో ఇచ్చిన రిపోర్ట్ లో ఫీజు రీయింబర్స్మెంట్ తొలగించాలి అనటం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న కుట్రనే. అప్డేట్ చేయాల్సింది ఓటీఆర్ ను కాదు. అప్డేట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అప్పుడే నోటిఫికేషన్ లు వస్తాయి. రిటైర్డ్ జడ్జీలు సైతం తమ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా?
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పేరుతో వివిధ ప్రభుత్వ శాఖలకు ఒక యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ ను ప్రకటించడం జరిగింది. తద్వారా, ఇన్నాళ్లకు రాష్ట్రంలో ఒక పాలన ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషం. కానీ, దురదృకరమైన వార్త ఏంటంటే 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఒక్క రోజు కూడా నిరుద్యోగ సమస్య మీద ఆలోచించడానికి వెచ్చించకపోవడం చాలా దౌర్భాగ్యం.
తెలంగాణలో ప్రతీ ఇంటికో నిరుద్యోగి ఉన్నాడు. వాళ్ళే కోటి మంది నిరుద్యోగ యువత కోటి ఆశలతో ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల సమయంలో ప్రధానంగా ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, జీవో 46 రద్దు, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు అమలు చేస్తామని ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది.
న్యాయమైన హక్కుల సాధన కోసం దిల్ శుక్ నగర్ లో నిరుద్యోగ యువత నిరసన తెలిపితే అక్రమంగా అరెస్ట్ చేసి, అక్రమ కేసులు బనాయించి వాళ్లకు నాయకత్వం వహించే నిరుద్యోగ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. నమ్మి నానపోతే పుచ్చిబుర్రలాయే అంటారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే పుచ్చి బుర్రలు అవ్వడం కాదు. ఏకంగా నిరుద్యోగుల పుర్రెలే పగలగొడుతున్నారు.
రెండేళ్లు కావొస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంస్కరణ కూడా తీసుకురాలేదు. యూపీఎస్సీ నోటిఫికేషన్ లో సివిల్ సర్వీస్ లో ఉన్నవాళ్ళు నేరుగా పరీక్షలు రాయడానికి వీలుగా లేదని, ఒకవేళ ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లుగా విధులు నిర్వహస్తున్న వారు మళ్లీ యూపీఎస్సీ పరీక్ష రాయాలంటే ముందుకు తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలన్న నిబంధనను కొత్తగా తేవడం జరిగింది. 2028 నుండి అమల్లోకి రాబోతుంది.
జ్యుడీషరీ వ్యవస్థలో ఒక కొత్త సంస్కరణలు వచ్చాయి. ఒక లాయర్ జడ్జి కావాలంటే లా చదివి బార్ అసోసియేషన్ సభ్యులు అయితే జడ్జి పరీక్ష రాసి జడ్జి కావొచ్చు. కానీ, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం జడ్జ్ కావాలంటే కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసి ఉండాలని నిబంధన తేవడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫైనాన్స్ శాఖకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, అక్కడ ఇటీవలే నిర్వహించిన ఒక పోటీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఒక విచారణ కమిటీ వేసింది.
మన తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది ఒక సిలబస్ రివ్యూ కమిటీ వేసి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు ఆ సిలబస్ పై దిక్కుమొక్కు లేదు. ఇది తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి సోయి? అసలు సిలబస్ ఫైనల్ కాకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? ఎలా పరీక్షలు నిర్వహిస్తారు? ఎలా పోస్ట్ లు భర్తీ చేస్తారు?
స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా ప్రవేశ పెట్టిన జాబ్ క్యాలెండర్ చెల్లని చిత్తు కాగితం అయింది.రేవంత్ రెడ్డి పాలన వల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ ప్రపంచ దిగ్గజ సంస్థల్లో సైతం లే ఆఫ్స్ అవుతున్నాయ్.నాది ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగమైనా నోటిఫికేషన్ ఇచ్చారా?
స్వయంగా ముఖ్యమంత్రే విద్యా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్రంలో విద్యా శాఖను ఎలా ప్రక్షాళన కావాలని కమిటీ వేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకూడదని ఆ కమిటీ సిఫార్స్ చేసింది. స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహించే ఈ శాఖ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను విద్యకు దూరం చేసే కుట్రలు శ్రీకారం చుట్టడం అత్యంత దారుణం.
అపర మేధావిగా ఫీలయ్యే ఆకునూరి మురళి ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఇస్తున్నారని కమిటి రిపోర్ట్ లో ఇచ్చి ఉపాధ్యాయ వృత్తినే అవమానించారు. మరి మీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సి, డీఏ ల గురించి రిపోర్ట్ లో ఎందుకు స్పందించలేదు?
ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని రోదిస్తున్నారు. ఏకంగా హైకోర్టు జడ్జ్ మా రిటైర్మెంట్ బెనిఫిట్ త్వరగా ఇవ్వాలని హైకోర్ట్ మెట్లెక్కి దుస్థితి దాపురించింది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తుంది. నిరుద్యోగ అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనలతో ఉద్యమ కార్యాచరణ చేపడతాం.