– గవర్నర్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి మన తల్లి కాదు
– ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను రూపుమాపే దుస్సాహసం చేస్తున్నడు
– మేం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సగౌరవంగా గాంధీ భవన్ కు తరలిస్తాం
– విశారదన్ మహారాజ్ అరెస్ట్ అక్రమం.. వెంటనే విడుదల చేయాలి
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను రూపుమాపే దుస్సాహసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు. చరిత్ర నిర్మాణంలో పాల్గొనని వారు మొదట చేయాలనుకునే పనే చరిత్రను చెరిపివేయడం ఆన్నారు. అది కుదరకపోతే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తారని చెప్పారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అదే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో ఈరోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టించిన ఆ విగ్రహం తెలంగాణ చరిత్రను అమానించేలా ఉందన్నారు. బతుకమ్మ లేకుండా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఆత్మకు ఎంతమాత్రం కూడా ప్రతిరూపం కాదని చెప్పారు. సమస్త తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని అన్నారు.
తమ మూలాలు మదిలో తలుస్తూ తెలంగాణ బిడ్డలంతా కూడా ఉద్యమ సందర్భంలో తెలంగాణ తల్లికి అపురూపంగా ఇచ్చిన రూపమే బతుకమ్మతో కూడిన తెలంగాణ తల్లి అని స్పష్టం చేశారు. రాష్ట్రోద్యమ కాలంలో ఏర్పరచుకున్న తల్లి రూపురేఖలు మార్చడం, ఉద్యమ గుర్తులను చెరిపేయటమంటే అది మూర్ఖపు పనేనని ఆమె అన్నారు. తనకు స్థానం లేని ఉద్యమ చరిత్రను రూపుమాపుతున్నానని భ్రమిస్తూ రేవంత్ రెడ్డి అల్ప సంతోషంలో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక… అమరుల త్యాగాలను ఒడిసి పట్టుకున్న నాటి ఉద్యమ తెలంగాణ తల్లిని అదే చోట ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగౌరవంగా కాంగ్రెస్ కు ఆఫీస్ కు తరలిస్తామని తేల్చిచెప్పారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖండించారు.
ఈ అరెస్ట్ అక్రమమని అన్నారు. అరెస్ట్ చేసిన విశారదన్ మహరాజ్ ను పలు స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టటం దారుణమన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకే గర్వకారణం
ప్రముఖ కవి, అధ్యాపకులు నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం ఎంతో సంతోషానిచ్చిందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ఆయనకు ఈ అవార్డు రావటం తెలంగాణకే గర్వకారణమని చెప్పారు. వచన కవిత్వ విభాగంలో నందిని సిధారెడ్డి రచించిన “అనిమేష” కవితా సంపుటికి పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. ఆయన కలం నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.