– పని ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసిన సంగీతం టీచర్
– వార్డెన్లు చేసే పనులు టీచర్లు ఎలా చేస్తారు?
– గురుకులాల్లో వార్డెన్లు ఏరీ?
– పనిచేసే వాతావరణమే కరవు
నేను సంగీతం టీచర్ నా.? ..హాస్టల్ వార్డెన్ నా? …పిల్లల కేర్ టేకర్ నా అని అర్ధమయ్యేదే కాదు.
ఒక మంచి సంగీత ఉపాధ్యాయురాలిని.. గురుకుల పేద విద్యార్థులకు కళాత్మకమైన ఆలోచనలతో కళాసాధనకు విద్యార్థుల్లో కళాత్మకమైన విద్యను అందించాలనుకున్న ఉపాధ్యాయురాలని గురుకుల విద్యార్థులు కోల్పోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం.
తన ఆవేదనతో కూడిన అనుభవాన్ని ఇలా వాట్సాప్ గ్రూప్ లో పంచుకున్నారు. దాన్ని ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నాను.
తెలంగాణా గురుకుల సంగీతం టీచర్ ప్రయాణానికి స్వస్తి
సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే సమయానికి గురుకుల్ పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా జాయిన్ అయ్యాను. తరాలుగా మాది సంగీత కుటుంబం. రెగ్యులర్ BA తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్శిటీలో నాలుగేళ్ల పాటు కర్నాటక సంగీతంలో BA.. ఆ తర్వాత కూడా కర్నాటక సంగీతంలో తిరుపతి పద్మావతి యూనివర్శిటీలో PG కూడా చేశాను. నిజానికి ప్రభుత్వ ఉద్యోగం కోసం పెద్దగా కష్టపడింది లేదు.
ఎందుకంటే పదేళ్ల పాటు ఈటీవీ న్యూస్ రీడర్‌గా మీడియాలో పనిచేశాను. మా అక్కయ్య, నేను వందల సంఖ్యలో వివిధ రాష్ట్రాల్లో సంగీత కచేరీలు చేశాం. ఆన్లైన్లో US, UK విద్యార్థులకు కూడా సంగీతం క్లాసులు తీసుకున్నాను. అసలు ప్రభుత్వ ఉద్యోగం గురించి నేను పెద్దగా ఆలోచించలేదు.అర్హత ఉన్నది. అందునా నాకు వచ్చిన సబ్జెక్టే కనుక సులభంగానే ఎగ్జామ్ రాశాను. సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగం వచ్చిన మొదట్లో చాలా ఆనంద పడ్డాను. కానీ ఇప్పుడు నేను గురుకుల్లో వచ్చిన సంగీతం టీచర్ ఉద్యోగాన్ని అంతకన్నా ఎక్కువ ఆనందంతో వదిలేశాను.
కారణాలు అనేకం ఉన్నాయి.
నా జీవిత ప్రయాణంలో…. చదువు,ఉద్యోగం తో పాటు సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను.నా కెరీర్ అంతా దాంతోనే లింక్ అయి ఉంది. సంగీతాన్ని నేర్చుకోవాలన్న కోరిక కొంతమంది మనుషుల్లో, పిల్లల్లో చాలా మందికి ఆసక్తి ఉండడాన్ని నేను చూశాను. కానీ వారికి ఎక్కడ నేర్చుకోవాలో తెలిసేది కాదు. ఉన్నా కొంతమందికి నేర్చుకోడానికి అంత స్థోమతా లేకపోవచ్చు.
గురుకులాల్లో ఉద్యోగం వచ్చిన వెంటనే.. నేను ఆనంద పడిన విషయం ఏదైనా ఉందంటే ఇదే. గొంతున్న ప్రతీ విద్యార్థికీ సంగీతం నేర్పాలన్న తాపత్రయం కలిగింది. ఫైనల్ ఇంటర్వ్యూలో నా కర్టాటక సంగీత ప్రదర్శన చూసి.. అక్కడి ఇంటర్వ్యూ చేసిన పెద్దలు, నిష్ణాతులు చాలా ఆనందించారు. గీతాలు, వర్ణాలు, కృతులు, నెరవల్,స్వరకల్పన, రాగ ఛాయలు, రాగం, తానం, పల్లవి, ఇత్యాదుల గురించి నాకున్న సంగీత అర్హతకు తగ్గట్టుగా పాడమన్నారు. అవకాశం వచ్చిందే తడవు మొత్తం టాలెంట్ బయటకొచ్చేసింది.
కానీ ఈ గురుకులంలో సంగీతం టీచర్ కు ఉండేదానికన్నా అర్హత ఎక్కువగా ఉన్నది. మీరు నిజంగా ఈ ఉద్యోగం వస్తే చేయగలరా అని అడిగారు. వారు ఆ మాట ఎందుకన్నారా అని ఆశ్చర్యం కలిగింది. పాఠశాలలో అడుగు పెట్టాక వారన్న ఆ మాటకు అర్థం కళ్ల ముందు కనపడింది.కొండంత రాగం అనే సామెత గుర్తుకొచ్చింది.
అక్కడ ఉన్న విద్యార్థుల్లో చాలా మందికి సంగీతం పట్ల ఆసక్తి ఉంది. వారికి సంగీత జ్ఞానాన్ని పంచుదామని ఉత్సాహంగా ఆ ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వెళ్లాను. కానీ వెళ్లాక కానీ అర్థం కాలేదు. అక్కడ అసలు సంగీతానికి, కళలకు సంబంధించిన ఉపాధ్యాయులకు అసలు విలువే లేదు. ఆర్ట్స్ టీచర్స్ని చాలా చులకనగా చూస్తారు. ముఖ్యంగా కర్టాటక సంగీత ఉపాధ్యాయులకు అస్సలు విలువే లేదు. పైగా గురుకులాల్లో మ్యూజిక్ టీచర్లను ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాలేదు..
ఎందుకంటే.. సంగీతం లేదా ఇతర ఆర్ట్స్ టీచర్లకు.. వారికి అసలు సంబంధమే లేని, అనుభవమే లేని, అసలు వారి పనే కాని వార్డెన్ పనులు, ఇతర క్లరికల్ పనులు అప్పచెప్తుంటారు.అది ఎంత రిస్కో ఆ సిస్టమ్‌కి అర్థం కాకపోవడం ఆశ్చర్యం. నేను మీడియాలో పనిచేశాను కాబట్టి.. వార్డెన్ చేయాల్సిన పని.. టీచర్లు చేస్తే ఆ పనిలో ఏ మాత్రం క్వాలిటీ ఉండదన్న విషయం నాకు మాత్రమే తెలుసు.
వార్డెన్ పని వార్డెన్ చేయాలి. టీచర్ పని టీచర్ చేయాలి. ఇది మినిమమ్ కామన్ సెన్స్.
నిజానికి వార్డెన్ పనుల కోసమే.. సంగీతం, లైబ్రెరియన్ లాంటి ఉద్యోగులను తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు.. వారికి బదులుగా వార్డెన్లనే తీసుకోవచ్చు కదా అనే వాదన వినిపించేదాన్ని. కానీ అసలు అక్కడ సంగీతం చెప్పే పరిస్థితులే లేవు. మ్యుూజిక్ టీచర్ల పేరుతో.. రిక్రూట్మెంట్ చేయడం కూడా వృధా అనిపించింది. కొందరికి ఈ ఉద్యోగం ముఖ్యం. నాకు కాదు అనిపించింది.
నేను చాలా మంది ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో… నాకు తెలిసీ ఎక్కడా హాస్టల్ లో ప్రత్యేకంగా వార్డెన్లు ఉన్నట్టు కనపడలేదు. స్కూల్ టీచర్లకే షిప్ట్‌ల వైజ్‌గా వార్డెన్ పనులు చెప్తుంటారు. మిగిలిన సబ్జెక్ట్ టీచర్లు కూడా… ఈ పనులను తప్పక చేస్తున్నారు తప్పా.. ఇంట్రస్ట్‌తో అస్సలు కాదు. ఎందుకంటే అది వారి పని కాదు.
డిప్యూటీ వార్డెన్ పనులు కూడా చేయల్సి వస్తుందని… ఇంటర్వ్యూ టైమ్‌లో కూడా చెప్పలేదు. అది చాలా పెద్ద తప్పు. అక్కడ పాఠాలు చెప్పేది తక్కువ. ఈ ఇతర పనులు ఎక్కువ. పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిదే. దాని వల్ల చాలా మంది పిల్లలకు లాభం కూడా. వెరీ గుడ్. కానీ ఆ నిర్ణయాన్ని.. అమలు చేయాల్సిన బాధ్యత.. ఒక మంచి వార్డెన్ చేయగలరు. టీచర్లు ఆ పని ఎప్పటికీ చేయలేరు.
ఈ చిన్న విషయం తెలియకపోతే ఎలా. టీచర్ పని.. పిల్లల భవిష్యత్తును చదువుల పరంగా తీర్చిదిద్దడం. ఉప్పులు, పప్పులు సరిపోయాయో లేదో చూడ్డమో, పిల్లలకు కాపలా కాయడమో కాదు. అందుకు వేరే వ్యవస్థ ఉండాలి.అసలు నేను సంగీతం టీచర్ నా…హాస్టల్ వార్డెన్ నా…పిల్లల కేర్ టేకర్ నా అని అర్ధమయ్యేదే కాదు.
పైగా మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. పరీక్షలు వచ్చాయంటే… అక్కడి పిల్లలను.. ఎగ్జామ్ సెంటర్స్‌కి దిగబెట్టే బాధ్యత, తిరిగి హాస్టళ్లకు తీసుకొచ్చే బాధ్యత. వీటిని ఎస్కార్ట్ డ్యూటీ అంటారు. అంటే టీచర్ కాస్తా.. ఎస్కార్ట్ అవుతుందన్నమాట. ఏ స్కూల్, కాలేజీ దగ్గర పిల్లలకు కాపలా కాయాలో తెలీదు. ఆ పిల్లలకు ఏది జరిగినా.. ఈ టీచర్లపైనే బాధ్యత వేస్తున్నారు. నిజానికి ఇది సంగీతం ఉపాధ్యాయుల బాధ్యత ఎలా అవుతుంది.
పిల్లల పరీక్షలయిపోయే వరకు.. ఆ ఎండల్లో… రోడ్ల మీద ఏదో ప్లేస్ చూసుకుని కూర్చోవాలి. ఆ ఎగ్జామ్ సెంటర్స్ వారు.. కనీసం వాష్ రూమ్ కూడా వాడుకోనివ్వరు. ..
ఆ పరిస్థితుల్లో టీచర్లు ఎక్కడికి వెళ్లాలో తెలీదు. నేనైతే వ్యక్తిగతంగా చాలా సఫర్ అయ్యాను. నా వల్ల అవలేదు. ఇవి మాలాంటి సంగీతం టీచర్లకు తగవు అని సుపరియర్స్ కి చాలా సార్లు చెప్పా. గురుకులం అంటేనే అలాంటి వ్యవస్థ అండి అనేవారు. ఖతం. నాకీ ఉద్యోగం అవసరమా అనిపించింది అప్పుడే. నేను గురుకులాల్లో జాయిన్ అయింది.. మ్యూజిక్ చెప్పడానికి. నాకు సంబంధమే లేని ఇలాంటి పనులు చేయడానికి కానే కాదు.
మీడియాలో న్యూస్ రీడర్‌గా ఈటీవిలో ఎంతో రెస్పెక్ట్ పొందిన నేను.. ఒక మ్యూజిక్ టీచర్‌గా గురుకుల పాఠశాలలో… కనీస గౌరవం పొందలేకపోయాను. నేను పనిచేసిన కాలంలో… పిల్లలకు చెప్పిన సంగీత పాఠాలు తక్కువ. అసలు చెప్పనిస్తే కదా ! చేసిన ఇతర పనులే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో.. మ్యూజిక్ చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు.. ఆ ఉద్యోగంతో నాకేం పని అనుకున్నా.
ఒక సంగీతం టీచర్‌గా ప్రభుత్వం ప్రస్తుతం నాకు ఇచ్చే మూడు పదుల జీతం.. పదేళ్ల క్రితమే నాకు ఈటీవీలో వచ్చేది. డబ్బు అనేది అస్సలు నాకు ప్రయారిటీ కాదు. అసలు డబ్బు కోసం నేను ఆ ఉద్యోగం జాయిన్ అవలేదు. నాకు వీలైన సమయంలో వివిధ మీడియా, యూట్యూబ్ చానెల్స్ కు..మా సొంత ఛానెల్స్ కు ఫ్రీలాన్స్ పని చేస్తూ ఇప్పటికీ అంతకు మించి సంపాదించేదాన్ని.
సంగీతం లో ఆసక్తి ఉన్న పేద పిల్లలు,కొన్ని వర్గాల పిల్లల్లో.. టాలెంటెడ్ పిల్లలను బయటకు తీసుకొద్దామని వెళ్లిన నాకు… అతి పెద్ద డిసప్పాయింట్మెంట్. అక్కడ అలాంటి పరిస్థితులే లేవు. అక్కడి పిల్లల్లో… కళలకు సంబధించిన విషయాల్లో… నేర్చుకునే పరిస్థితులు లేవని.. నా ప్రత్యక్ష అనుభవాలతో చెప్పగలను. కొందరు చదువులో మంచి పేరు తెచ్చుకుంటారు. మరి కొందరు కళలలో పేరు తెచ్చుకుంటారు. రెండూ ఇంపార్టెంటే.
అందుకే… ప్రభుత్వ ఉద్యోగమైనా సరే.. ఆత్మ సంతృప్తి లేనప్పుడు.. ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు పనిచేయడం కష్టం అనిపించింది.సంగీతానికి ప్రాధాన్యతే లేని ఆ ఉద్యోగం.. అది ప్రభుత్వ ఉద్యోగమైన సరే…మా వారికి చెప్పి రిజైన్ చేసేశాను. నేను జాయిన్ అయినప్పుడు అందరికీ అంటే స్నేహితులు బంధువులు, దగ్గరికి వారికి ఎలా అయితే తెలియచేసానో… వదిలేసాక అలానే తెలియచేస్తున్నా.
మళ్లీ మీడియాలోనే కొనసాగుతాను . ఇక్కడ నా పనిలో నాకు గౌరవం,స్వేచ్ఛ ఉంది. నా పనిని నేనే నిర్ణయించుకునే ఆత్మ సంతృప్తి ఉంది. ఇప్పటికీ ఎన్నో అవకాశాలు నా కోసం ఇంకా ఎదురు చూస్తున్నాయి. నా అనుభవమంతా.. సంగీతం, మీడియాలోనే ఉంది. నా జ్ఞానాన్ని పది మందికి పంచే ప్లానింగ్ చేసుకునే అవకాశం మళ్ళీ వచ్చినందుకు గర్వంగా ఉంది. మా వారు ఎప్పుడూ అంటుంటారు.
మొదట నీకిచ్చిన పనిని ఇష్టం గా చేయి. పరిస్థితులు అనుకూలించనపుడు నీకిష్టమైన పని మాత్రమే చేయి. అది ఎవరి కోసమో, నా కోసమో కాదు. నీ ఇష్టానికి తగ్గట్టుగా…. అలా ఏ పరిస్థినైనా చెప్పుకుని ఇలా ముందుకెళ్తాను అనే నా నిర్ణయాన్ని మొదటగా వారితోనే పంచుకుంటాను. ఎందుకంటే నా స్థాయి నాకంటే వారికే ఎక్కువ తెలుసు గనక. ఇక తరువాత నా కుటుంబ సభ్యులందరూ నా సదభిప్రాయాన్ని ఎప్పుడూ సానుకూలంగానే స్వాగతిస్తారు. అందులో ప్రధమంగా మంచి నిర్ణయమేదైనా మా అక్కయ్య నా పక్కనే నిలబడతారు.
అదే నా బలం.. నా ధైర్యం