– ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఆగ్రహం
హైదరాబాద్: భిన్న ఆలోచనల సంఘర్షణ సమాహారమే ప్రజాస్వామ్యం అని, చర్చలు, విమర్శలే ప్రజాస్వామ్యానికి అసలైన ఊపిరి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ శాసనమండలి లో ప్రస్తుతం చర్చను అణచివేస్తూ ప్రతిపక్ష స్వరాన్ని నొక్కివేసే పరిస్థితి నెలకొనడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం కేవలం ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం మాత్రమే కాదని, అది సాక్షాత్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తినే ఖూనీ చేయడమేనని డా. దాసోజు శ్రవణ్ అన్నారు. రాజ్యాంగాన్ని మంటగలపడం అంటే ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడం మాత్రమే కాకుండా, ప్రజలను నమ్మించి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే నిలువునా మోసం చేయడమే అవుతుందని ఆయన విమర్శించారు.
అధికారంలో ఉన్న వారు ఒక విషయం గుర్తుంచుకోవాలని, చట్టసభలు అనేవి ప్రజల సమస్యలను చర్చించడానికి, వాటికి పరిష్కారాలు కనుగొనడానికి, ప్రజా శ్రేయస్సును కాపాడడానికి ఉన్న పవిత్ర వేదికలని తెలిపారు. అవి పాలకుల సొంత ఆస్తులు కావని, నియంతల మాదిరిగా వ్యవహరించేందుకు ఉన్న వేదికలు కాదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బలపరచాలంటే చర్చలకు అవకాశం ఇవ్వాలని, విభిన్న అభిప్రాయాలను గౌరవించాలని, అదే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.