- భారీ హాస్టల్ భవన నిర్మాణానికి ముమ్మర సన్నాహాలు
- అనుమతుల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తా
- ఎంపీ సానా సతీష్ బాబు హామీ
- పేద విద్యార్థుల కష్టాలను గమనించాం.. నాణ్యమైన వసతి కల్పనలో వెనక్కి తగ్గేదే లేదు:
- మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ
- విద్యార్థుల వసతి సమస్యలకు చెక్: రాయల్ సర్వీస్ ట్రస్ట్ సేవలపై వెల్లువెత్తిన ప్రశంసలు
విజయవాడ: గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ వంటి నగరాలకు ఉన్నత చదువుల కోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థుల వసతి సమస్యలను తీర్చేందుకు ‘రాయల్ సర్వీస్ ట్రస్ట్’ ఒక బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామ పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రతిష్టాత్మక హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఈ ట్రస్ట్ నడుం బిగించింది.
ఈ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతూ, ట్రస్ట్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కీలక ప్రతిపాదన వెనుక మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మార్గదర్శకత్వం ఎంతో ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ, “చదువుకోవాలనే తపన ఉన్నా, వసతి లేక ఎంతోమంది ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. వారిని ప్రోత్సహించడం కోసం అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో కూడిన వసతిని కల్పిస్తూ ఈ హాస్టల్‌ను నిర్మిస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు సకాలంలో అందేలా ఎంపీ కి విన్నవించాము. .
ట్రస్ట్ ప్రతినిధుల విన్నపాన్ని సానుకూలంగా పరిశీలించిన ఎంపీ సానా సతీష్ బాబు, విద్యా రంగంలో ట్రస్ట్ చేస్తున్న ఈ కృషిని అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, హాస్టల్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాన్ని చేపట్టిన రాయల్ సర్వీస్ ట్రస్ట్ సభ్యులను ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, “గ్రామీణ విద్యార్థులకు కేవలం వసతి మాత్రమే కాకుండా, నాణ్యమైన భోజనం, చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం, భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించాం. దీనివల్ల వందలాది మంది పేద విద్యార్థులకు భరోసా కలుగుతుంది,” అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పెటేటి పుల్లయ్య, సీతాళం రాంబాబు, పెడన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఈ హాస్టల్ నిర్మాణం కార్యరూపం దాల్చి, విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల్ సర్వీస్ ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. విద్యాభివృద్ధికి ఈ హాస్టల్ ఒక ఆశాదీపంగా మారుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు….