హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల పికెట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో క్రిశాంక్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పికెట్‌లోని తన నివాసంలో చికిత్స పొందుతున్న క్రిశాంక్‌ను కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా క్రిశాంక్ కుటుంబ సభ్యులతో ముచ్చటించిన కేటీఆర్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్‌తో క్రిశాంక్ చేపట్టిన ‘లక్ష సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల కేటీఆర్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సమస్యలపై క్రిశాంక్ చూపుతున్న చొరవను అభినందించిన కేటీఆర్, గాయం దృష్ట్యా మరికొద్ది రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ పరామర్శలో కేటీఆర్ వెంట మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితర ముఖ్య నేతలు ఉన్నారు.