– కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాముఖ్యత రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి
ఢిల్లీ: తెలంగాణలోని కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాముఖ్యత, నిరంతర సేవలను దృష్టిలో పెట్టుకుని డివిజన్ ఏర్పాటు చేసి మరింత అభివృద్ధి పర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.
ఈ రైల్వే స్టేషన్ మూలాలు 1932లో బ్రిటిష్ కాలం నాటివని, వేగంగా విస్తరిస్తున్న సింగరేణి బొగ్గు క్షేత్రాలకు సేవలు అందించడానికి గాను దీనిని “భద్రాచలం రోడ్”గా అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి,డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్రలు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తెలిపారు.వారు పార్లమెంట్ ప్రాంగణంలో శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఆ కాలం నాటి చారిత్రక పత్రాలు, అరుదైన ఛాయాచిత్రాలు, రైల్వే, మైనింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ స్టేషన్ ఒక వ్యూహాత్మక బొగ్గు రవాణా కేంద్రంగా ఎలా రూపుదాల్చిందో ఇవి స్పష్టం చేస్తాయని రవిచంద్ర, సురేష్ రెడ్డిలు మంత్రికి వివరించారు.
శతాబ్ద కాలంగా కొత్తగూడెం దేశానికి విద్యుత్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని వారు చెప్పారు.
ఇది బ్రిటిష్ కాలంలో బొగ్గు వెలికితీత, రవాణాను సాధ్యం చేసిందని తెలిపారు.
ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నదని, భారతీయ రైల్వేలో సరుకు రవాణా ఆదాయానికి కీలకమైనదని తన వినతిపత్రంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
ఇంత గొప్ప వారసత్వం ఉన్నా కూడా భారతీయ రైల్వే చరిత్రలో కొత్తగూడెం స్టేషన్ తగిన గుర్తింపు లేని కీలకమైన ది మిగిలిపోయిందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు.
ఈ రోజు కొత్తగూడెంలో అనేక ప్రధాన రైల్వే ప్రాజెక్టులు కేంద్రీకృతమవుతున్నాయని ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డిలు మంత్రికి తెలిపారు. కొత్తగూడెం-కిరండల్, మల్కన్ గిరి-భద్రాచలం జునాగఢ్- మల్కన్‌గిరి- భద్రాచలం కారిడార్,ప్రతిపాదిత కొత్తగూడెం-సత్తుపల్లి-కొవ్వూరు మార్గాలు అని వినతిపత్రంలో ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.ఈ ప్రాంతం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఒక ప్రధాన రైల్వే కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నదని ఎంపీ రవిచంద్ర తెలిపారు.
2032లో కొత్తగూడెం రైల్వే స్టేషన్ 100 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్న తరుణంలో, ఈ చారిత్రాత్మక స్టేషన్‌కు తగిన గుర్తింపు లభించాలనేది ప్రజల చిరకాల ఆకాంక్ష అని ఆయన మంత్రికి వివరించారు.
కొత్తగూడెంలో రైల్వే డివిజన్ ఏర్పాటు కేవలం అభివృద్ధి డిమాండ్ మాత్రమే కాదని, 1932 నుండి దాని చారిత్రక సహకారం, బొగ్గు, ఖనిజ రవాణాలో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, జాతీయ రైల్వే కేంద్రంగా భవిష్యత్తులో పాత్ర పోషించనున్నదని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
ఇలాంటి చర్య కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని, మౌలిక సదుపాయాల నిర్వహణను మరింత బలోపేతం చేస్తుందని, ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లోని లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన వివరించారు.కొత్తగూడెంను రైల్వే డివిజన్ గా ప్రకటించి అభివృద్ధి పర్చేందుకు వీలైనంత తొందరగా సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరారు.
వందేళ్ల మైలురాయి (1932-2032) దృష్ట్యా ఈ ప్రతిపాదనను పరిగణించాల్సిందిగా వినతిపత్రంలో పేర్కొన్నారు. కొత్తగూడెం దశాబ్దాలుగా దేశ ఇంధన అవసరాలకు తోడ్పడుతోందని, శతాబ్దకాలం పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో, ఇది గుర్తింపు, పెట్టుబడులు, సంస్థాగత హోదాకు అర్హమైనదని ఎంపీలు వద్దిరాజు, సురేష్ రెడ్డిలు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వివరించారు.