– మాటలు కాదు.. చేతలలో చిత్తశుద్ధి ఉండాలి
– 1,804 పిఇటి పోస్టులు ఖాళీగా ఉన్నకూడా ఎందుకు భర్తీ చేయటం లేదు ముఖ్యమంత్రి గారు?
విద్యార్థుల ఆటపాటల కోసం 8 కోట్లు లేవా ?
– సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం
హైదరాబాద్: క్రీడాభివృద్ధి, క్రీడాకారుల గురించి గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ముందు పిల్లల ఆటపాటలకు 8 కోట్లు విడుదల చేయాలని ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్లో చురకలు అంటించారు. సబితా ఇంకా ఏమన్నారంటే.. క్రీడాకారులు అయితే ఉద్యోగాలు పక్కా అంటున్నారు సీఎం గారు, సంతోషం. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఒకరిద్దరికీ కాదు, మొదట జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వండి. మంచి క్రీడాకారులు కావాలంటే పాఠశాల స్థాయి నుండే శిక్షణా ఇవ్వాలి కదా..శిక్షణ (ట్రైనింగ్) ఇవ్వటానికి పిఇటి లు ఉండాలి కదా.
మరి, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,804 పిఇటి పోస్టులు ఖాళీగా ఉన్నకూడా ఎందుకు భర్తీ చేయటం లేదు ముఖ్యమంత్రి గారు? ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో కెసిఆర్ గారు 20 కోట్లు కేటాయిస్తే, మీరు రాగానే ఎందుకు రద్దు చేశారు?జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ విడుదల చేయలేదు.?
రెండున్నర ఏండ్లలో దాదాపు 8 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు. విద్యార్థులు, పిఇటి టీచర్లే సదరు ఖర్చు భరించారు.అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే లతో నిర్వహించిన ఆటల పోటీలకు 18 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, విద్యార్థుల ఆటపాటల కోసం 8 కోట్లు లేవా ముఖ్యమంత్రి గారు?
200 కోట్లు ఖర్చు పెట్టి, ఒక్క రోజు మెస్సీతో ఆడిస్తే క్రీడాకారులు కాలేరు. మాటలు కాదు, చేతలలో చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి. మట్టిలో మాణిక్యాలు వెలికితియాలంటే దూర దృష్టితో అలోచించి ప్రణాళికలు తయారు చేయాలి. ఒక ప్రత్యేక విజన్ తో ముందుకు వెళ్ళాలి.” అంటూ సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.