– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు
మల్కాజిగిరి : స్వస్థ్ భరత్ , క్యాన్సర్ ముక్త భారత్ ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్య భారత్ గా మారుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు. మేకిన్ ఇండియా ఉత్పత్తులతో వైద్య రంగంలో ఆధునిక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దంత వైద్య సేవ లు కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆనందబాగ్ లోని సన్ డెంటల్, రేనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రామచంద్ర రావు ప్రారంభించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు స్వయంగా రక్త పోటు పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దంత పరీక్షలు నిర్వహించే ఆధునిక పరికరాన్ని ప్రారంభించారు. దంతాల సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్య రంగం లో వచ్చిన మార్పులకు అనుగుణంగా చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సన్ డెంటల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రభాకర రావు, డాక్టర్ శకుంతల సౌజన్య, మాజీ కార్పొరేటర్ శ్రవణ్ , రాంబాబు, వాసంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.