ఆవకాయ, మాగాయ పచ్చళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సాంప్రదాయకమైన మరియు అత్యంత ఇష్టమైన ఊరగాయలు.
ఆవకాయ మరియు మాగాయల రుచి, ఘాటును వర్ణిస్తూ కొందరు కవులు కవితలు, పద్యాలు,కథలు కూడా వ్రాశారు అనడంలో సందేహము లేదు.
ఉదాహరణ కు: “విస్తరించి నట్టి విపులఖ్యాతి గలదావకాయ
విస్తరాకునకు పునిస్త్రీ శోభనిచ్చు ఆవకాయ
రుద్రఫాలనేత్రమై రాజిల్లే ఆవకాయ
ముద్ద పప్పు మిత్రమై వర్దిల్లే ఆవకాయ
వేసవిలో పుట్టి చవులూరించే ఆవకాయ
కవులెందరినో కదలించినదావకాయ”
మన కవులు అంధించిన మరియొక పద్యం:
ఇందువల దందు బాగని
సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
తెలుగు వారందరికీ బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతం అత్యంత ప్రీతిపాత్రం.
పోతన భాగవతం లోని ఈ క్రింది పద్యాన్ని వినని వారుండరు. ఇది సుప్రసిద్ధమైన పద్యం.
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామ భద్రుండట నే
పలికిన భవహరమగునట
పలుగక వేరొండు గాథ పలుకగ నేలా
స్వయంగా ఆ రామభద్రుడే తన నోట పలికించే ఈ భాగవతాన్ని పలికితే జీవితమే ధన్యమౌతుంది అనే భావాన్ని పోతనామాత్యుడు వక్కాణించాడు. నిజంగా భాగవత కావ్యం అంత మధురంగానూ, రసవత్తరంగానూ ఉంటుంది. ఇది అందరూ ఒప్పుకున్న సత్యం.
ఆవకాయలో ఉన్న అద్భుతమైన ఆకర్షణ, ఆ రుచే వేరు. ఈ ఆవకాయ ఆంధ్రుల స్వంతం. వారి ప్రత్యేకం. వారికి మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేకమైన ఊరగాయ.
రసవత్తరమైనట్టి ఆంధ్రులకి ఇష్టమైనట్టి పోతనామాత్యుని భాగవతాన్ని ఆంధ్రులు ఎంతగా ఆదరిస్తారూ అంటే ఒకానొక కవి, ఉండబట్ట లేక, అంతటి అద్భుతమైన రుచి గల ఈ ఆవకాయని, ఈ రెంటికీ సామీప్యాన్ని చూపిస్తూ, పేరడీగా ఒక కందపద్యాన్నే రచించాడు. అదికూడా సరిగా పోతనామాత్యుని పద్యాన్ని అనుకరిస్తూ.
ఇదిగో అదే ఈ క్రింద పొందుపరచిన ఆవకాయ మీద కంద పద్యం.
చదవండి.
కం.
కలిపెడిది ఆవకాయట
కలిపించెడి వారు మామ గారట మరి నే
కలిపిన రుచికరమగు నట
కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా.
ఇలా చెప్పటం మొదలు పెడితే ఇంకా ఆవకాయ, మాగాయ ఊరగాయలు గురించి చాలా ఉంది.
ఆవకాయ, మాగాయలు కేవలం పచ్చళ్లు కావు, తెలుగు వారి ఆత్మీయత, సంప్రదాయం, మరియు జ్ఞాపకాల సమాహారం.
వందల లెక్కల్లో ఆవకాయలు పెట్టిన అమ్మమ్మలూ, నాయనమ్మలు ఆవకాయ పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఆ హడావిడి, కొత్త ఆవకాయ రుచి చూడాలనే తాపత్రయం, ఆవకాయ ఊరిన తర్వాత దాని కమ్మని వాసన – ఇదంతా ఒక పెద్ద యజ్ఞం లాంటిది.
ఆవకాయ అంటే తెలుగు వారి జిహ్వలో రసాలు ఊరుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆవకాయ అంటే చెవి కోసుకుంటారు.
మామిడి కాయలు, అంగడిలోకి వస్తున్నాయి అనగానే ఆవకాయ ఊరగాయ పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. సంవత్సరమంతా ఈ ఆవకాయ ఊరగాయని ఆస్వాదించడానికి, దానికి తగినన్ని మామిడి కాయలని కొనుగోలు చేయడానికి ముందుగా, ఆ ఊరగాయని పెట్టడానికి సరిపడే సామగ్రిని శ్రేష్టమైన కారాన్ని, ఆవపొడిని, నువ్వుల నూనెని లేదా వేరుశనగ నూనె,రాళ్ళ ఉప్పుని ముందుగా సిద్ధం చేసి ఉంచుకుంటారు.
అవకాయ” అనే పదం రెండు పదాల కలయిక, ఇందులో “అవ” అంటే “ఆవాలు” మరియు “కాయ” అంటే “పచ్చిగా ఉడికించని కాయ. ఈ సందర్భంలో దీని అర్థం – ఆవాలతో కలిపిన పచ్చి మామిడికాయలు . తాజాగా కోసిన మామిడి ముక్కలలో ఆవాల పొడి, కారం పొడి, మెంతి గింజలు, ఉప్పు మరియు నూనె వేసి కలపడం ద్వారా సాధారణ ఆవకాయను తయారు చేస్తారు.
ఆవకాయ అంటే తెలుగు వారి జిహ్వలో రసాలు ఊరుతూ ఉంటాయి.
ఈ ఘాటైన మామిడి ఊరగాయను పుష్కలంగా వడ్డించుకోకుండా ఏ తెలుగు భోజనం సంపూర్ణమైనట్లు అనిపించదు . అది సాదా అన్నం, పప్పు భోజనమైనా సరే, లేదా వైభవంగా జరిపే పండుగ విందు అయినా, ఆవకాయ రుచుల విస్ఫోటాన్ని జోడించి, ఆ భోజనానికి జీవం పోస్తుంది.
మాగాయ అంటే ఎండబెట్టిన మామిడి ముక్కలతో చేసే పచ్చడి. “తెలుగు వారి రెండు కళ్ళు ఆవకాయ మరియు మాగాయ. ఈ రెండు కళ్ళల్లో నీకు ఏది ఇష్టం అంటే ఎలా చెప్పలేమో, అలాగే…” అని మాగాయ ప్రాముఖ్యతను తెలుపుతుంది.
ఆవకాయ కన్నా ఘాటు తక్కువ, రుచిలో మాత్రం ఏమాత్రం తక్కువ కాదు.మామిడికాయ ముక్కలను 3 రోజుల పాటు ఉప్పు, పసుపులో ఊరబెట్టి, ఆ తర్వాత ఎండబెడతారు. ఎండిన ముక్కలకు కారం, ఆవాల పొడి, మెంతి పొడి మరియు వేరుశనగ లేదా నువ్వుల నూనె కలుపుతారు.
అర్థరాత్రి అయినా సరే ఎవరైనా బంధువు ఇంటికి వస్తే విస్తరిలో వడ్డించటానికి నేను ఉన్నాను అని ముందుకు వచ్చేవి ఆవకాయ, మాగాయ పచ్చళ్ళు. ప్రతి రోజూ అన్నంలో ఉత్తపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకొని తిన్నా విసుగు పుట్టదు.
కొత్తావకాయతో పాటుగా బంగినపల్లి మామిడిపళ్ళుగాని, రసాలు గాని అన్నంతోపాటు తింటుంటే ఆ ఆనందమే వేరు.
తెలుగువారి భోజన ప్రియత్వానికి, వేసవికాలపు సందడికి ప్రతీకలైన ఆవకాయ, మాగాయ ఊరగాయలు .
తెలుగువాళ్ళు కూడా గృహములో నిధిగా మెచ్చుకునే తెలుగు జాతి వైశిష్ట్యమే ఆవకాయ. అంటే, భోగ భాగ్యాలు కలిగించి సంపన్నులను చేసే నవనిధులతో పాటు, ఆవకాయ పదియవ నిధి అన్నమాట.
– ములుకుట్ల సువర్చల