– తపస్సు – ఒక ఆధ్యాత్మిక క్వాంటం ప్రయాణం
( శివ నారాయణ రాజు కె)
లోకంలో విలువైన దేనికైనా పరీక్ష తప్పదు. నిప్పుల్లో కాలినప్పుడే బంగారం తన స్వచ్ఛతను నిరూపించుకుంటుంది; కానీ విలువలేని బొగ్గును ఎవరూ పరీక్షించరు. అలాగే, చరిత్రలో ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావులందరూ కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నవారే. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన ఆధారాలు నేడు భౌతికంగా ఎందుకు లేవు? అనే గందరగోళానికి సమాధానం ‘ కాలం’ మరియు ‘చైతన్యం’ లోనే దాగి ఉంది.
మనం భౌతిక ప్రపంచంలో ఎంట్రోపీ (Entropy) నియమం ప్రకారం కాలంతో ముందుకు మాత్రమే ప్రయాణిస్తుంటాం. కానీ క్వాంటం మెకానిక్స్లోని ‘టైమ్ సింమెట్రీ’ ప్రకారం పరమాణువుల స్థాయిలో గతం-వర్తమానం-భవిష్యత్తుల మధ్య విభజన రేఖ చాలా పలుచగా ఉంటుంది. ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం (Relativity) కూడా సమయం అందరికీ ఒకేలా ఉండదని, అది ప్రయాణించే వేగాన్ని బట్టి మారుతుందని నిరూపించింది.
ఋషులు ఈ శాస్త్రీయ రహస్యాలను వేల ఏళ్ల క్రితమే తమ తపస్సు ద్వారా ఛేదించారు. వారు తపస్సులో భాగంగా తమ ‘ అహంకారాన్ని ‘ పూర్తిగా తొలగించి, భౌతిక దేహం కంటే సూక్ష్మమైన ‘సూక్ష్మ శరీరంతో’ విశ్వ చైతన్యంలోకి ప్రవేశించేవారు. అప్పుడు వారి మనస్సు ఒక ‘ ఆధ్యాత్మిక టైమ్ మిషన్’ గా మారి, కాల ప్రవాహానికి ఎదురీది ‘కాల గుండెల్లోకి’ ప్రవేశించేది.
భౌతికమైన రాళ్లు, రప్పలు కాలక్రమేణా నశించిపోవచ్చు, కానీ విశ్వంలో నిక్షిప్తమై ఉన్న శబ్ద తరంగాలు (Data) ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఋషులు ఆ తరంగాలను దర్శించి (Visualizing), తాము చూసిన ప్రత్యక్ష సత్యాలనే గ్రంథాలుగా, ఉపనిషత్తులుగా మనకు అందించారు. అందుకే మన పురాణాలకు భౌతిక ఆధారాల కంటే, ఋషుల అతీంద్రియ అనుభవాలే అతిపెద్ద రుజువులు.
బంగారం లాంటి సత్యాన్ని తెలుసుకోవాలంటే, కేవలం కంటికి కనిపించే ఆధారాలు మాత్రమే కాదు, ఋషులు చూపిన ఆ అంతర్ జ్ఞాన నేత్రం కూడా అవసరమని ఈ చర్చ సారాంశం.