(తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా)
ఇది రక్తబంధంరా తమ్ముడు
పంతాలకూ పట్టింపులకూ
నెత్తురు నీరైపోతుందా ?!
రంగుమారి వెలిసి పోతుందా ?!
కాలం కుట్రచేసి
మనమధ్య అపోహల గీత
అడ్డంగా గీసినంత మాత్రాన
బంధం విడిపోతుందటరా ?!
సందేహాలు, అపోహలు తీరిపోతే
మళ్ళా మన మనసులు ఒక్కటైపోవూ ?!
అమ్మా నాన్నా ఉక్కు కణాలతో
నిర్మించిన బంధ సౌధంరా ఇది
తుది శ్వాస వరకూ నిలబడే ఉంటుంది !
నువ్వు అమెరికాలో ఉన్నా
నేను అంటార్కిటికాలో వున్నా
మన బంధం
దేహంలో ఊపిరై , కంటిలో నీరై
తడితడిగా ప్రవహిస్తూనే ఉంటుంది !
చిన్నప్పుడు
సంపూర్ణ రామాయణం సినిమాకు
ఇద్దరం కలిసి వెళితే
మనల్ని రామ లక్ష్మణులని
నాన్న అనలేదూ !
ఇద్దరం ఒకే ఆకులో
కలిసి భోంచేస్తే
అమ్మ ముచ్చట పడలేదూ !
నిన్ను ఎంతమంది అవమానించారో
నన్ను ఎంతమంది ఎగతాళి చేసారో
ఇంకా మనస్సులో రగులుతూనే ఉంది కదా !
ఇప్పుడు మనం విడిపోతే
శత్రువులు సంతోషించి
పండగలు చేసుకోరూ …?!
విరోధులు ఈలలు వేసి
సంబరపడి పోరూ …?!
గతాన్ని ఒక్కసారి
గుర్తుచేసుకోరా చిన్నోడా !
నది నుండి విడిపోయి
ఉపనదులుగా సాగినా
మరలా ఆ నదిలోనే కలిసిపోవడం
చూస్తున్నాం కదా !
మన బంధం కూడా అంతేరా
అనుబంధంలో కలవాల్సిందే !
(అపోహలతో విడిపోతున్న అన్నదమ్ముల కోసం )
– పి. లక్ష్మణ్ రావ్
విశాఖపట్నం
9441215989