(ఇంద్రాణి)
తమిళనాడు మధురైలో సీబీఐ ప్రత్యేకకోర్టు తొమ్మిదిమంది పోలీసులకు ఉరిశిక్ష విధించటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు పూర్వాపరాలను గమనిస్తే, అందులో సంఘటనలన్నీ సర్వసాధారణంగా మనదేశంలో మనం వినేవే. ఒక చిన్న సంఘటన వ్యవస్థలోని పలు లోపాలను ఎత్తిచూపింది.
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఈ దేశంలో కోట్ల మంది ఉండి వుంటారు. అంత స్వల్ప నేరానికి తండ్రిని అరెస్ట్ చేయటమే ఆశ్చర్యం కలిగిస్తే, తండ్రి కోసం ఆందోళనతో వచ్చిన కొడుకును కూడా అరెస్ట్ చేసి హింసించటం పోలీసు ఘాతుకానికి నిదర్శనం.
ఇక్కడ న్యాయస్థానం పోషించిన పాత్ర మరుగున పడిపోయింది. కేసులో ప్రధానసాక్షి రేవతి వాంగ్మూలం ప్రకారం.. పోలీసులు తండ్రీకొడుకులు ఇద్దరినీ రక్తమోడేలా దండించారు. రాత్రంతా కొడుతూనే ఉన్నారనేది ఆవిడ సాక్ష్యం. రక్తమోడిన ప్రదేశాన్ని ఆ తండ్రీకొడుకులతోనే తుడిపించారు. మరి వారిని జడ్జి ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు, మేజిస్ట్రేట్ ఆ తండ్రీకొడుకులను ఎందుకు చూడలేదో తెలియదు.
ముద్దాయిలను 24 గంటల్లోపే జడ్జి ముందు హాజరు పరచాలనే నిబంధన ఉన్నది. ఈ కేసులో కూడా నిబంధన ప్రకారం హాజరు పరిచారు. జడ్జి ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు, అంతగా గాయపడి ఉన్న నిందితులు జడ్జికి చెప్పటానికి పోలీసులంటే భయం ఉంటుంది కాబట్టి చెప్పలేరు. కానీ న్యాయవ్యవస్థ బాధ్యతగా అడగాలి కాబట్టి “పోలీసులు కొట్టారా?” అని అడగడంతోనే అయిపోతుందా?
కొట్టే తత్వం ఉన్న పోలీసు, జడ్జి గారికి చెప్పకూడదంటూ బెదిరిస్తాడు అనే విషయం ఖచ్చితంగా న్యాయమూర్తికి తెలిసే ఉంటుంది. జడ్జి ముందు ప్రవేశపెట్టవలసి ఉంటుందనే విషయం తెలిసినా పోలీసులు తమ హింసాత్మక ప్రవృత్తిని చూపిస్తున్నారు అంటే.. పోలీసులు న్యాయవ్యవస్థను గౌరవించకపోవటం అనే భావించక తప్పదు. ఈకేసులో మనం రెండు రకాల పోలీసులను చూస్తున్నాం. న్యాయవ్యవస్థలో కూడా రెండు రకాల న్యాయమూర్తులను చూస్తున్నాం.
రాజ్యాంగంలో అధికరణం 22(2) పౌరులకు కల్పించిన రక్షణకు తూట్లు పొడిచి, పౌరుల ప్రాణాలను భక్షించిన పోలీసు ఒకవైపు ఉంటే, తన ప్రాణాన్ని రిస్కులో పెట్టుకుని న్యాయాన్ని రక్షించిన రేవతి లాంటి పోలీసు ఒకవైపు కనిపిస్తున్నారు. తండ్రీకొడుకుల ప్రాణాలను హరించిన వారిలో కొట్టిన వారితో పాటు సాక్ష్యాల ఆనవాళ్లు లేకుండా చేయటానికి సహకరించిన వారిని కూడా శిక్షించాలి అనుకున్న న్యాయమూర్తి ఒకవైపు నిలిస్తే, ముద్దాయిలను పోలీసులు హింసించి ఉంటారేమో తెలుసుకోవాలి అనే కనీసపు నియమాన్ని పాటించకుండా రిమాండ్ విధించిన న్యాయమూర్తి ఒకవైపు కనిపిస్తున్నారు. రక్షించవలసిన వ్యవస్థ దండిస్తున్నది, శిక్షించగలిగిన వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈకేసులో పోలీసులకు విధించిన శిక్షని హైకోర్టు ఖరారు చేస్తుందా లేదా అనేది తరువాతి విషయం. కొన్ని కేసుల్లో నైతికత కూడా ప్రధానపాత్ర పోషిస్తుంది. చట్టం వేరు, ధర్మం వేరు. రేపు ఈకేసు హైకోర్టు విచారణలో ఏది ప్రధానంగా తీసుకుంటుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ఈ కేసులో పోలీసులకు శిక్ష పడింది, కాబట్టి పోలీసువ్యవస్థ మారిపోతుంది అనుకోవటం అమాయకత్వం అవుతుంది.
ఈ కేసు హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణలను ఎదుర్కొని నిలుస్తుందా లేదా అనేది తెలుసుకోవటానికి కనీసం దశాబ్దం పడుతుంది. కానీ రిమాండ్ విధించే ముందు మేజిస్ట్రేట్ ఒక్కసారి ముద్దాయిలను కనీసం చూసివుంటే, వారు మరణించకుండా ఉండే అవకాశం ఉండేది. న్యాయవ్యవస్థలో ఉన్న ఈ నిర్లక్ష్యమే పోలీసు హింసను పెంచుతున్నది అంటే న్యాయవ్యవస్థకు కోపం వస్తుంది.
కానీ ఈ కేసులో ఆ నిర్లక్ష్యం ఖరీదు రెండు నిండు ప్రాణాలు. చాలా కేసుల్లో ఇదే పరిస్థితి. న్యాయవ్యవస్థతో పాటు మరికొన్ని వ్యవస్థలు కూడా పోలీసు హింసకు మద్దతు పలుకుతున్నాయి. పోలీసులు అరెస్ట్ చేశాక మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచటానికి నిందితుల ఆరోగ్యం రిమాండ్ చేయడానికి ఫిట్ గా ఉందా లేదా అని చెప్పవలసిన డాక్టర్ల పనితీరు, తెలుగురాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు.
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనపైన హింస జరిగిన ఆనవాళ్లు లేవని సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ప్రభావతి గురించి తెలియనివారు లేరు. తండ్రీకొడుకుల కేసులో పోలీసులకు సహకరించి, వారి ఒంటిపైన గాయాలను ప్రస్తావించకుండా సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ కూడా బాధ్యత వహించాలి.
పోలీస్ స్టేషన్లో జరిగిన టార్చర్ కంటే డాక్టర్ చేసిన నేరం తక్కువది కాదు. తండ్రీకొడుకుల ఇద్దరి హత్యాకాండలో పోలీసులతో పాటు వీరు కూడా సహనిందితులే. వ్యవస్థల పనితీరు మారటానికి శిక్షలు ఎంతవరకు ఉపయోగపడతాయో చెప్పలేం కానీ, వ్యవస్థల పనితీరు ఇలాగే ఉన్నంతకాలం కస్టోడియల్ టార్చర్‌ను ఆపటం కష్టం.
డాక్టర్ రిమాండ్‌కు ఫిట్ గా ఉన్నారని తప్పుడు ధ్రువీకరణ చేయకుండా ఉండి ఉన్నా, తండ్రీకొడుకులను మూస ధోరణిలో మేజిస్ట్రేట్ “రిమాండ్” అనకుండా పరిశీలించి నిర్ణయం తీసుకుని ఉన్నా, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మన వ్యవస్థల పనితీరుకు ఈకేసు ఒక్కటే తార్కాణం కాదు. ఇది మొదటిది కాదు, చివరిది అవుతుందన్న ఆశా లేదు. రక్షకభటుడు అంటే భయం ఉండటం అనేది బాధాకరమైన విషయం.
చాలా కేసుల్లో రాజకీయ ఒత్తిడి అని సమర్థించుకుంటూ ఉంటారు పోలీసులు. ఈకేసులో రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశమే లేదు. వారిని ఎదిరిస్తే పోలీసులు ఇలా బెదిరిస్తారు అని సమాజం తెలుసుకున్నది కాబట్టే పౌరులకు పోలీసులంటే భయం.తప్పు చేసిన వాడికి పోలీసులంటే భయం ఉండటంలో ఒక అర్థమున్నది. కానీ తప్పు చేయని వారికి కూడా ఈ దేశంలో పోలీసులంటే భయమే. కారణం స్పష్టం – వారి దాష్టీకం.
ఆ దాష్టీకానికి ఈ వ్యవస్థలు సహకరించకుండా ఉంటే వారికి కూడా జంకు పుట్టే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానమైన వ్యవస్థ న్యాయవ్యవస్థ. పోలీసుల ఈ రకమైన హింసాత్మక వైఖరికి హోదాలకు అతీతంగా ఎవరి పరిధిలో వారు ఇతోధికంగా సహకరిస్తున్నారు. కావాలని చేసి ఉండకపోవచ్చు, కానీ చట్టం తెలిసీ, ఈ దేశంలో పోలీసు వ్యవస్థ గురించి తెలిసి కూడా నిర్లక్ష్యంగా చేయటమనేది చట్టబద్ధంగా కూడా నేరమే.
మేజిస్ట్రేట్ల మూసధోరణి రిమాండ్లు, డాక్టర్ల తప్పుడు ధ్రువపత్రాలు ఆగిపోతే పోలీసులకు కూడా భయం వస్తుంది. తండ్రీకొడుకులను రిమాండ్ చేస్తూ ఆర్డర్ ఇచ్చిన న్యాయమూర్తి, ఒక్కసారైనా తన రిమాండ్ ఆ తండ్రీకొడుకుల మరణానికి కారణమైందని ఆలోచిస్తే, భవిష్యత్తులోనైనా కొద్దిగా జాగ్రత్త తీసుకుంటారేమో అనే ఆశ.
అందుకని ఈ కేసులో మరణశిక్షకు గురైన పోలీసులు మాత్రమే నిందితులు కాదు. పోలీసువ్యవస్థ ఒక్కటే ఇటువంటి అకృత్యాలకు పాల్పడింది అనుకోవటానికి లేదు. వారితో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చకపోయినా వారు కూడా ముద్దాయిలే.
భారతరాజ్యాంగం పౌరులకు కల్పించిన రక్షణను అన్ని వ్యవస్థలు తమ బాధ్యతగా తీసుకోనంత వరకు ఇటువంటి కస్టోడియల్ టార్చరుకు అంతం వుండదు!
