– దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నాఅర్హత ఉంటే ఇల్లు ఇస్తాం
– ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
– ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు
– సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం
– తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు
– ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
– సర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం
– రెవెన్యూ, హౌసింగ్ పై ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి శ్రీ పొంగులేటి సుదీర్ఘ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.
హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సోమవారం నాడు హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జిల్లాల ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా హౌసింగ్ , రెవెన్యూ అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు ప్రస్తావించిన అంశాలపై అక్కడికక్కడే స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణం నిరంతరం ప్రక్రియ. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారు , ఇప్పుడు దరఖాస్తుకున్నా కూడా అర్హత ఉంటే , ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని తెలిపారు. సమావేశాలలో పలువురు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచనలను, సలహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటామని తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా మరింతగా విస్తృతంగా భాగస్వామ్యులు కావాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశామని, ఆయా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేని వారు, తమకు ఇల్లు అవసరం లేదని తెలియచేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని మంత్రి సూచించారు. ఇంటి బేస్ మెంట్ నిర్మాణం పూర్తి అయిన తరువాత లక్ష రూపాయలు మంజురు చేశాక, వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
పేదవారి అభివృద్ధి సంక్షేమం విషయంలో అధికారులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఆనాటి ప్రభుత్వం అక్కడక్కడా నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని, అలాగే మంచినీరు, కరెంటు, డ్రైనేజి వంటి మౌలిక వసతులను కల్పించాలని ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా జి ప్లస్ వన్ పద్ధతిలో ఇండ్లను నిర్మించుకునేలా వెసులుబాటు కల్పంచామని చెప్పారు.
భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం
భూసర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని , ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలోని ఐదు మండలాలలో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత సర్వే మ్యాపు నెంబరు, భూదార్ నెంబరు కేటాయిస్తున్నామని తెలిపారు.
సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామని వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను దఖలు పరిచినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా, తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని తొలివిడతలో శిధిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతిజిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
ఈ సమావేశాల్లో నిజామాబాద్ ఇంఛార్జి మంత్రి దాసరి అనసూయ (సీతక్క), ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి జి.వివేక్, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఆయా జిల్లా ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ సెక్రటిరీ విపి గౌతం తదితరులు పాల్గొన్నారు.