– దేశంలో కాంగ్రెస్ ఎక్స్పైరీ పార్టీ
– మూడు రాష్ట్రాలకు పరిమితమయిన ప్రాంతీయ పార్టీ
– మీరు కూడా మమ్మల్ని విమర్శించేవాళ్లా?
– ముందు మీ పార్టీ సంగతి చూసుకో రేవంత్
– ‘చీట్ చాట్’ పేరిట లీకులు ఎందుకు?
– ధైర్యం ఉంటే ఆయన్ని బయటకు వచ్చి మాట్లాడమనండి
– నిజానికి ఆయనది ఐడెంటిటీ క్రైసిస్
– కావాలంటే ‘ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం’ అని బ్యానర్ కట్టుకుని ఊరూరు తిరగండి
– మిమ్మల్ని యాంకర్లు, యాక్టర్లు, ప్రజలు, చివరకు ప్రతిపక్ష నాయకుడు కూడా గుర్తించడం లేదు
– బిఆర్ఎస్ పార్టీ కమిటీల రద్దు
– మీడియాతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: కేసీఆర్ ఈరోజు పార్టీ రాష్ట్ర కమిటీని ఉద్దేశించి పూర్తి స్థాయి దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం మావేంట నడిచిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు తెలిపారు. పార్టీలో చేరిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ని జనరల్ సెక్రటరీగా పరిచయం చేసి ప్రకటించారు. పార్టీ ఏర్పాటు చేసిన నాడు ఉన్న దుర్భరమైన తెలంగాణ పరిస్థితిని, ఆనాటి రాజకీయ ముఖచిత్రం గురించి వివరంగా తెలియజేశారు.
ఎంతో ధైర్యంతో, బలమైన దీక్షతో ఆనాడు పార్టీని ఒక్కడిగా ఏర్పాటు చేసి 25 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం సాగించిన పోరాటాన్ని, ఉద్యమాన్ని, ప్రభుత్వ పరిపాలన పరిణామక్రమాన్ని వివరించారు.పదవులను, రాజీనామాలను ఉద్యమం కోసం ఎలా ఉపయోగించుకున్నారో వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సబ్బండ వర్గాల కోసం చేసిన అద్భుతమైన పరిపాలన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూలంకషంగా వివరించారు.
రైతుబంధు వంటి అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు అందించిన కార్యక్రమాల గురించి తెలిపారు. ఒకనాడు ప్రతి పంటకు 10 రోజుల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు పంపితే, ఈరోజు నెలలు దాటినా ఒక్క పైసా పడని ప్రభుత్వ అపసోపాల గురించి వివరించారు. రాష్ట్ర రైతాంగం పడుతున్న బాధలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ఏర్పాటుకు ముందున్న వ్యవసాయ సంక్షోభం తిరిగి వచ్చింది. కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, విత్తనాల కొరత, ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వంటి సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా మంత్రులు చర్చోపచర్చలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు, కార్మిక లోకానికి చేసిన అభివృద్ధిని కూడా వివరించారు.
విఫలమవుతుందన్న తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా చేస్తుందన్నారు భూముల కబ్జాలు, ఇళ్ల కూల్చివేతల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలుపుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ వంటి పథకాన్ని నడిపి తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది .
పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య అనే వ్యక్తి తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోలుస్తూ మరి ఒక వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా తులనాడే విధంగా అవమానించే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా వారేదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది. నిజంగా అక్కడ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా లోక్ సభలో మరి వెంటనే తిరగబడి అక్కడికక్కడే అవసరమైతే తేజస్వీ సూర్య ని నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేది కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయపడ్డారు.
అక్కడ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారు తప్ప తేజస్వీ సూర్య గారు తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చినా కనీస స్పందన లేకుండా మరి నిశ్చేష్టులుగా ఏదైతే చూస్తా ఉన్నారో దాన్ని సమావేశం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ ప్రజలు దయచేసి తెలంగాణ పార్టీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు ఏ రకంగా ఉందో ఆలోచించాలి.
.నాకు కూడా తేజస్వీ సూర్య ఫోన్ చేశారు. బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు. మీవాళ్లు అంటే.. లేదండి మీరు మాట్లాడింది చాలా తప్పు అని చెప్పాను. ఫోన్ చేస్తే నేను చెప్పాను. చాలా తీవ్రంగా చెప్పాను. మీరు చాలా మంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడారు, మరి మీరు మాట్లాడింది చాలా తప్పు.
విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. పార్లమెంట్ లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు కానీ మీరు చేసింది చాలా తప్పు. అన్నాను. మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు ఇది కాదు. కాంగ్రెస్ ను నిలదీయడం అని ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నారు.
పార్టీ పునర్నిర్మాణం పై ఫోకస్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే వీటి పునర్నియామకం జరుగుతుందని, గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అనుబంధ సంఘాలను పటిష్టం చేయాలని కూడా సూచించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ తీర్మానం. లేనిపక్షంలో గ్రామగ్రామాన పోరాటం చేస్తాం. 30 ఏళ్లుగా ఏదో ఒక అడ్డంకి కలిగిస్తూనే ఉన్నారని, మహిళా రిజర్వేషన్ల సాధన కోసం పార్టీ తరపున పోరాడాలని నిర్ణయం. SIR కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మొత్తం క్రియాశీలంగా ఉండాలి. చాలా సీరియస్ గా తీసుకోవాలి. పార్టీ కమిటీల రద్దు. కేవలం రాష్ట కార్యవర్గం మాత్రం కొనసాగుతున్నది త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు . పార్టీ శ్రేణులకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు
అసభ్య పదజాలం తప్ప రేవంత్ రెడ్డి కి ఇంకోటి రాదు
ముఖ్యమంత్రి కి నాదొక విన్నపం. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఇలాంటి ‘చీప్’ మాటలు మాట్లాడటం పద్ధతి కాదు. మీరు ఒక ముఖ్యమంత్రిగా విధానపరమైన అంశాల మీద మాట్లాడితే, ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందిస్తాం, మీకు జవాబిస్తాం. కానీ, మీకు విషయం మీద మాట్లాడే అవగాహన లేదు. ఎంతసేపూ విషం చిమ్మడం, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం తప్ప రేవంత్ రెడ్డి కి ఇంకోటి రాదు.
ఇవాళ ఆయన మా పార్టీ ఎక్స్ పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ చతికిలపడి ఎన్ని ఏళ్లయింది? పన్నెండు, పదమూడేళ్లుగా ఆ పార్టీ లేవలేకపోతోంది. ముందు మీ స్థాయి ఏంటో, మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. జాతీయ పార్టీ అని చెప్పుకునే మీరు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయారు. మీ సంగతి మీరు చూసుకోండి, మా గురించి మీకెందుకు?
మా పార్టీ ప్రస్థానం ఏంటో, మా పార్టీ ఏం సాధించిందో, ప్రజా పోరాటాలతో ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నామో మీ జాతీయ నాయకత్వాన్ని అడిగితే చెబుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీని గడగడలాడించింది ఎవరో వారినే అడగండి. అసలు అప్పుడు మీరు ఎక్కడున్నారో మీకైనా తెలుసా?
ముఖ్యమంత్రి ఇప్పటికైనా దిగజారుడు మాటలు మానుకుంటే మంచిది. ఇవాళ మా పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభదినం. ఇలాంటి సందర్భంలో ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం గానీ, అగత్యం గానీ నాకు లేదు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పిన వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం? దేవుళ్లందరినీ ఆయన మోసం చేశారు.
బాసర వెళ్లి సరస్వతీ అమ్మవారి మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తానన్నారు.. తీరా బయటకొచ్చాక ఆ మాట మరిచిపోయారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా మాట ఇచ్చారు. జోగులాంబ అమ్మవారి వద్ద ఒట్టు పెట్టారు.
ఇలాంటి ముఖ్యమంత్రి గురించి ఏం చెప్పాలి? ఆయన వ్యక్తిత్వానికి కానీ, ఆయన మాటలకు కానీ ఏమైనా విలువ ఉందా? ఏదో టైం పాస్ కోసం మాట్లాడుతుంటారు. ‘చీట్ చాట్’ పేరిట లీకులు ఎందుకు? ధైర్యం ఉంటే ఆయన్ని బయటకు వచ్చి మాట్లాడమనండి. నిజానికి ఆయనది ఐడెంటిటీ క్రైసిస్ (గుర్తింపు సమస్య). పాపం, ఆయన్ని ఎక్కడికి వెళ్లినా ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. కనీసం కేసీఆర్ గారైనా తన పేరు ఒకసారి ప్రస్తావిస్తారేమో అని ఆరాటపడుతున్నారు. కానీ కేసీఆర్ ఆయన పేరు కూడా ఎత్తడం లేదు. ఆ బాధ వర్ణనాతీతం!
రేవంత్ రెడ్డి .. మిమ్మల్ని యాంకర్లు, యాక్టర్లు, ప్రజలు, చివరకు ప్రతిపక్ష నాయకుడు కూడా గుర్తించడం లేదు. ఇది మీ వ్యక్తిగత గుర్తింపు సమస్య. దానికి మేమేం చేయగలం? కావాలంటే ‘ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం’ అని బ్యానర్ కట్టుకుని ఊరూరు తిరగండి. కేసీఆర్ గురించి రోజూ చాలా మంది మాట్లాడుతుంటారు. వాటన్నింటికీ సమాధానం చెప్పడానికి మాకు ఖాళీ లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి.