– ప్రజలు తిడితే పైశాచికానందమా… సీఎం సిగ్గుపడాలి
– ప్రజల బాధలను చూసి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందన్న రేవంత్ పై కేటీఆర్ మండిపాటు
– ప్రజల బాధల పట్ల పైశాచిక ఆనందం పొందుతున్నానని బాహాటంగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని ఏమనాలని ప్రశ్న
హైదరాబాద్: ప్రజలు, ప్రతిపక్షాలు తిడుతుంటే తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో మోసపోయిన ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాల వలన అన్యాయానికి గురవుతున్న వర్గాలు ప్రభుత్వాన్ని నిందిస్తుంటే తనకు సంతోషం కలుగుతుందంటూ రేవంత్ రెడ్డి సంబరపడుతున్నాడని కేటీఆర్ అన్నారు.
ప్రజల పక్షాన ప్రభుత్వానికి సమస్యలు తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి తనకు పైశాచిక ఆనందం వస్తుందని ప్రతిపక్షాల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది చనిపోయినా రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదన్నారు. కనీసం కోతలు లేకుండా కరెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయలేకపోతున్నందుకు సిగ్గు అనిపిస్తుందా లేదా అని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రైతుల ధాన్యం రోడ్ల మీద తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ కూడా అనిపిస్తుందా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతుంటే… వారి బాధలను చూసి ప్రభుత్వాన్ని మేము తిడితే ప్రతిపక్షాల తిట్లతో తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందని… పైశాచిక ఆనందం పొందుతున్నానని బాహాటంగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు. ఇంత నిస్సిగ్గుగా పైశాచిక ఆనందం పొందుతున్న ముఖ్యమంత్రిని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రతిసారి “నేను మారిన మనిషిని” అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి యథావిధిగా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. విద్యార్థులు కాలేజీ చదువులకు దూరమయ్యే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నెలకొన్నదని కేటీఆర్ అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన మంచి పథకమని, భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగించిందన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోతే కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, కాలేజీలకు రాకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో, మీరు కాలేజీ వాళ్లు తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకోవాలని తీర్పు ఇచ్చిందని, ఇలాంటి తీర్పు వచ్చిన తర్వాత విద్యార్థుల కాలేజీ చదువులు అంధకారంలో కూరుకుపోయినా కూడా ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం విద్యారంగానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చి గురుకుల పాఠశాలల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వరకు అన్ని రంగాల్లో విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు.
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుబంధు పూర్తిగా ఆగిపోయిందని, చివరికి రైతన్నలకు యూరియా బస్తాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. పండించిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్దన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, మక్కలు, శనగలు, జొన్నల వంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా, రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవలం బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ కనీసం మహబూబ్నగర్ జిల్లాకైనా ఒక్క మంచి పని చేశాడా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడని, కేసీఆర్ పరిపాలన గురించి తెలంగాణలో ఏ పల్లెను అడిగినా చెబుతారన్నారు.
రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో అమలు చేస్తానని చెప్పి, 30 నెలల తర్వాత కూడా అవి అమలు చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. మూడు నెలలు కాదు, 30 నెలలైనా పథకాలు అమలు కాలేదంటే ఆ పథకాలను గాని, ఆ వ్యక్తిని గాని ఏమనాలి అని ప్రశ్నించారు.
పెండింగ్ ప్రాజెక్టుల్లో కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయడం లేదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టు కావడంతో దాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రతిసారి అప్పుల కారణంగా అభివృద్ధి చేయలేమని సాకులు చెబుతున్నారని, కానీ గత ప్రభుత్వం తెచ్చిన ప్రతి అప్పు ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం మూడు లక్షల 80 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఒక్క రూపాయి పనీ చేయలేదన్నారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చి రైతుబంధు వంటి పథకాలను పక్కనపెట్టి ‘రాహుల్ బంధు’ను మాత్రం జోరుగా నడిపిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం ఒకప్పుడు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండగా, ఈరోజు రియల్ ఎస్టేట్ భూముల ధరలు పడిపోయి రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం భూములు కొనుగోలు చేసిన మధ్యతరగతి వర్గాలు కూడా ఈరోజు ఆందోళనలో కూరుకుపోయాయని అన్నారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా 25 సంవత్సరాల పాటు ప్రజలతో, వారి ఆకాంక్షలతో నిలబడి తెలంగాణ సాధించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిసారి ప్రజల పక్షంగానే ఉంటామని తెలిపారు.