– ఆ సీసీ కెమెరాలు హ్యాక్ అయితే బాధ్యత ఆయన తెచ్చిపెట్టుకున్న ఏజెన్సీదే
– హరీష్ రావు తన ఇంటి ముందు ఆయనే సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు
– సొంత అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత స్పష్టం చేసింది
– హరీష్ రావు ట్యాపింగ్ గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే
– వరి వేస్తే ఉరేనన్న ప్రభుత్వం మీది
– అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు?
– కేసీఆర్ హయాంలో 6676 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
– ప్రభుత్వ విప్ వేముల వీరేశం
హైదరాబాద్: హరీష్ రావు మీడియాలో ఉండటం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటి కే 6300 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటివరకు వరి 7,70,053 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి కనీస మద్దతు ధర (MSP) కింద రైతులకు రూ. 322.86 కోట్లు చెల్లించాం. మొక్కజొన్న 3,46,121 మెట్రిక్ టన్నులు, శనగలు 30,220 మెట్రిక్ టన్నులు, సన్‌ప్లవర్ 3,492 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాము.
ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అబద్దాలు చెప్పి రైతులను గందరగోళపర్చడమే హరీష్ రావు ఉద్దేశం. హరీష్ రావు లాంటి నీచ రాజకీయాలు దేశంలో మరొకరు చేయరు.అబద్దాల పునాదుల మీద రాజకీయాలు చేస్తున్నారు.బీఆర్ఎస్ హయాంలో రైతులకు మంచి జరిగినట్లు ప్రచారం చేస్తున్నాడు. నల్గొండ జిల్లా మర్రిగూడెంలో రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారు.
మా ప్రభుత్వంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొన్న మూడు రోజులకే రైతులకు చెల్లింపులు చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో కేవలం రైతు బంధు ఇచ్చి అద్భుతం చేశామని చెప్పుకున్నారు. రైతు బంధు మొదలు పెట్టినా అప్పుడు రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు? కేసీఆర్ హయాంలో 6676 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. .వరి వేస్తే ఉరేనన్న ప్రభుత్వం మీది. ప్రజా ప్రభుత్వం పైన హరీాష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నాడు.
రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. బాధ్యతాయుత ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన సూచనలు ప్రభుత్వానికి ఇస్తే తీసుకునేవాళ్లం. మీడియాలో ఉండటం కోసం కేటీఆర్, హరీష్ రావు డ్రామాలు ఆడుతున్నారు.రాష్ట్ర రైతుల పట్ల చిత్తశుద్ది లేదు.తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వలసల గురించే మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయకుండా దోషులు, నేరస్తులుగా బీఆర్ఎస్ నాయకులు మిగిలిపోయారు.
గాడి తప్పిన వ్యవస్థను, అప్పులపాలైన రాష్ట్రాన్ని చక్కదిద్దే నాయకుడు మా రేవంత్ రెడ్డి అని ప్రజలు అధికారం ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు పెట్టిన బకాయిలు, ఫీజు రీఎంబర్స్ మెంట్ , ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన బకాయిల గురించి కేటీఆర్ మాట్లాడటం లేదు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల గురించి చెప్పకుండా కేటీఆర్ దాచిపెడుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులను చీరి చింతకు కట్టాలి.
హరీష్ రావు తన ఇంటి ముందు ఆయనే సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఆ సీసీ కెమెరాలు హ్యాక్ అయితే బాధ్యత ఆయన తెచ్చిపెట్టుకున్న ఏజెన్సీదే. ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావే విచారణలో ఒప్పుకున్నాడు. ట్యాపింగ్ తమ మెడకు చుట్టుకుంటుందనే హరీష్ రావు ఇప్పుడు ట్యాపింగ్ జరుగుతుందని డ్రామా ఆడుతున్నాడు.రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకుంటుున్నారు.
ఎంత మంది బతకుల్లో నిప్పులు పోశారో సొంత కూతురు కవితనే చెప్పింది. సొంత అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత స్పష్టం చేసింది.. హరీష్ రావు ట్యాపింగ్ గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే..