– సముద్ర వనరుల ద్వారా స్థానిక సముదాయాలకు లాభాలు చేకూరేలా చర్యలు
– అక్రమ వేటపై కట్టడి చర్యలు
– జీవవైవిధ్య చట్టం అమలు ద్వారా మత్స్యకారులు, రైతులకు లెవీ బదిలీ
– ఏపీఎస్‌బీబీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్
విజయవాడ: బయోడైవర్సిటీ చట్టం లోని యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ABS) విధానం ద్వారా ప్రకృతి వనరుల వినియోగం వల్ల వచ్చే లాభాలను స్థానిక ప్రజలకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని ఏపీఎస్‌బీబీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ వల్ల చేపల ధరలు ఏమాత్రం పెరిగే అవకాశం లేదన్నారు.
చెన్నై లోని నేషనల్ బయోడైవర్సిటి అథారిటీ , అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయో డైవర్సిటి బోర్డు సంయుక్తంగా, సముద్ర జీవ వైవిధ్య వనరుల వినియోగంలో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ABS) విధానంపై ప్రత్యేక వర్క్ షాపు ను స్థానిక మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో బుధవారం ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీఎస్‌బీబీ చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎర్రచందనం విక్రయాల ద్వారా రైతులకు 5% లాభం అందజేస్తూ, గత మూడు నెలల్లో సుమారు ₹7 కోట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇదే విధానాన్ని సముద్ర సంపదపై కూడా అమలు చేసి, మత్స్యకారులకు ప్రయోజనాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2025లో సముద్ర సంపద విలువ ₹4,155 కోట్లకు చేరిందని, ప్రాసెసింగ్ తర్వాత అది మరింత దాదాపు రూ. 9 వేల కోట్లకు పైగా పెరుగుతుందని తెలిపారు.
ఎగుమతిదారుల టర్నోవర్ ఆధారంగా 0.2% నుంచి 0.6% వరకు ఏబీఎస్ (ABS) రుసుము వసూలు చేసి, ఆ నిధులను మత్స్యకారుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 13,000 బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను (BMCs) బలోపేతం చేసి, ఈ నిధులను జెట్టీలు, ఇన్సూరెన్స్ మరియు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. సముద్ర జీవవైవిధ్య సంరక్షణతో పాటు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం సాధన ఈ విధానం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
సముద్ర వనరులను పరిశోధనలు, ఔషధ తయారీ (Pharmaceuticals), ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో వినియోగించే సంస్థలు పొందే లాభాల్లో కొంత భాగం స్థానిక సముదాయాలకు చేరేలా చూడటం ఏబీఎస్ విధానం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన ₹145 కోట్ల ఏబీఎస్ నిధుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే ₹97 కోట్లను పొందడం గర్వకారణమని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ నిధుల్లో ఎక్కువ భాగం ఎర్రచందనం మరియు వ్యవసాయ రంగం ద్వారా లభిస్తున్నాయని, భవిష్యత్తులో సముద్ర వనరుల ద్వారా కూడా స్థానిక బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలకు (BMCs) మరింత లాభం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
నేషనల్ బయోడైవర్సిటి అథారిటీ చైర్మన్ వీరేంద్ర తివారి మాట్లాడుతూ… సముద్ర వనరుల వినియోగంలో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ABS) విధానం కీలకమని తెలిపారు. ఈ దిశగా 2025లో ‘అక్వాటిక్ జెనెటిక్ ఎక్స్ పర్ట్ కమిటీ’ను ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లో లభించే చేపల జాతుల సమగ్ర జాబితాను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ జాబితా ఆధారంగా ఎగుమతిదారుల టర్నోవర్ లేదా ఉత్పత్తుల విలువను బట్టి ఏబీఎస్ నిధులను వసూలు చేసి, తీరప్రాంత మత్స్యకారులకు అందజేయనున్నట్లు వివరించారు.
కొల్లేరు సరస్సు జీవవైవిధ్య పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కాంటూర్ పరిమితులు, స్థానికుల జీవనోపాధిని సమతుల్యంగా కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ స్థానిక ప్రజల జీవనోపాధిని రక్షించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి. కృష్ణయ్య మాట్లాడుతూ… సముద్ర కాలుష్య నియంత్రణతో పాటు మత్స్యకారుల జీవనోపాధి బలోపేతం అవసరమన్నారు. తీరప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు, పట్టణ మురుగునీరు సముద్రంలో కలవడం వల్ల చేపల నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వలలు, బాటమ్ ట్రాలింగ్ వంటి అశాస్త్రీయ పద్ధతులు సముద్ర వనరులకు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మత్స్యకారులపై వేట ఒత్తిడిని తగ్గించేందుకు మెరికల్చర్, చేపల అనుబంధ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. పాత పద్ధతుల బదులుగా హైజీనిక్ డ్రైయింగ్, వాల్యూ అడిషన్ సాంకేతికతలను ప్రోత్సహించాలని తెలిపారు. వేట నిషేధ కాలంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.20,000 అందిస్తుందన్నారు.
మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖ, 350 ల్యాండింగ్ సెంటర్లు మరియు 555 తీరప్రాంత గ్రామాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 8 లక్షల సముద్ర తీరప్రాంత ప్రజలు, 20 లక్షల అంతర్భాగ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారని వివరించారు. 2025-26లో దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం 38% వాటా (సుమారు ₹27,000 కోట్లు) సాధించిందని తెలిపారు. భారీ ట్రాలర్ల ద్వారా జరిగే విధ్వంసకర చేపల వేట చిన్న మత్స్యకారులకు ఇబ్బందిగా మారిందని, దీనిని అరికట్టేందుకు మత్స్యశాఖ, అటవీశాఖ, మెరైన్ పోలీసులతో కలిసి నిఘా కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు బి.మల్లికార్జునరావు, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పారెస్ట్ డిపార్ట్ మెంట్ కు చెందిన సీసీఎస్ నాగేశ్వరరావు, బయోడైవర్సిటీ చెందిన నిపుణులు తదితరులు హాజరయ్యారు..