November 12, 2026

బడుగుల భూములు దోచేస్తున్న రేవంత్ సర్కార్

  • రేవంత్ రెడ్డి సర్కార్‌ దళిత, బీసీల భూముల దోపిడీ
  • భూమిని రక్షించాల్సిన ప్రభుత్వాన్ని ‘గాదే కింద పందికొక్కులా’ మార్చి దోచుకుంటున్న రేవంత్ కాంగ్రెస్
  • వేల కోట్ల విలువైన లిడ్ క్యాప్ , బీసీ స్టడీ సర్కిల్ భూముల కబ్జా
  • గచ్చిబౌలి, ఖాజాగూడా సర్వే నెంబర్ 20/ 1లో రూ. 1,000 కోట్ల భూముల అన్యాక్రాంతం వెనుక పెద్దల ప్రమేయం
  • భారత్ సమ్మిట్ లో మీ దోపిడిని వివరిస్తారా?
  • బీసీ బిడ్డలు వీహెచ్, మహేష్‌గౌడ్, పొన్నం, కొండా, మధు యాష్కీ మాట్లాడరేం?
  • బీసీ మంత్రులు ఇకనైనా నిద్ర లేవండి
  • సర్కార్‌ను నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు

హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఎప్పటికీ రాచరికపు ఓనర్లు కాదని, కేవలం రాజ్యాంగానికి, ప్రజల ఆస్తులకు కస్టోడియన్లు మాత్రమేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. తోటమాలి లాగా ఉండి భూమిని రక్షించాల్సిన ప్రభుత్వాన్ని ‘గాద కింద పందికొక్కులా’ మార్చి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడి భూ దోపిడీకి పాల్పడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పేద బహుజన వర్గాల భవిష్యత్తును తాకట్టు పెడుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న దళిత, బీసీ భూముల అన్యాక్రాంతంపై ఆయన పలు కీలక అంశాలను, ఆధారాలను విడుదల చేశారు.

దళిత బిడ్డల ‘లిడ్ క్యాప్’ భూముల స్వాహా

గచ్చిబౌలి ముల్కం చెరువు ఎదురుగా, దుర్గం చెరువు వెనుక వైపు ఉన్న లిడ్ క్యాప్ సంస్థకు చెందిన సుమారు 6 ఎకరాల పైచిలుకు భూమిని (వేల కోట్ల విలువైనది) అపర్ణ మరియు వంశీరామ్ బిల్డర్స్‌కు కట్టబెట్టారు. ‘ఏక్తా మాల్’ పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కళా ఉత్పత్తులను ప్రదర్శించే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి, ముందుగా ఒక ఎకరం తీసుకుని, ఆ తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా మార్చడానికి మిగతా భూమిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు.

బీసీ స్టడీ సర్కిల్ భూమిపై రియల్ ఎస్టేట్ పంజా

శేర్‌లింగంపల్లి మండలం, ఖాజాగూడా గ్రామంలోని సర్వే నెంబర్ 20/1 లోని 3 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమిని (సుమారు రూ. 1,000 కోట్ల విలువైనది) ఎస్‌ఐఎస్ ఇన్‌ఫ్రా సంస్థకు కట్టబెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీసీ విద్యార్థుల అభ్యున్నతి కోసం కేటాయించిన ‘బీసీ స్టడీ సర్కిల్’ భూమిని నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం చారిత్రక ద్రోహం.

అధికార దుర్వినియోగం – రికార్డుల మార్పు: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2020 జనవరి 13 నాటి లేఖలో SAS Infra సంస్థ అనధికారికంగా ఆక్రమించిందని స్పష్టం చేస్తూ, ₹1.93 కోట్ల జరిమానా విధించి ఖాళీ చేయించాలని ఆదేశించారు. నారాయణ రెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలో 2025 నవంబర్ 1న ఈ భూమిని 22-A ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్‌లో చేర్చారు.

ఇన్ని నిబంధనలు, ఆధారాలు ఉన్నప్పటికీ ఎలాంటి టైటిల్ వెరిఫికేషన్ లేకుండా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసి, హైడ్రా పరిధిలో అనుమతులు ఇచ్చి, హైరైజ్డ్ కన్స్ట్రక్షన్లకు తెరలేపడం వెనుక పెద్దల లోపాయకారి ఒప్పందాలున్నాయని ఆరోపించారు.

ప్రజాప్రతినిధుల లేఖలు బేఖాతర్: ఈ భూ దోపిడీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ప్రభుత్వ పెద్దలకు, సీఎస్, సీసీఎల్‌ఏ, హైడ్రాకు లేఖలు రాసినా ప్రభుత్వంలో చీమ కుట్టినట్టయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు.

దళిత భూముల కుంభకోణం

ప్రాంతం: గచ్చిబౌలి (ముల్కం చెరువు ఎదురుగా, దుర్గం చెరువు వెనుక)
విస్తీర్ణం: 6 ఎకరాల పైచిలుకు (వేల కోట్ల రూపాయల విలువైనది)
లబ్ధిదారులు: అపర్ణ బిల్డర్స్ & వంశీరామ్ బిల్డర్స్
ఉద్దేశం: ఏక్తా మాల్ పేరుతో మొదలై రియల్ ఎస్టేట్ జాయింట్ డెవలప్‌మెంట్‌గా మార్పు
బీసీ స్టడీ సర్కిల్ భూముల కుంభకోణం (ఖాజాగూడా):
సర్వే నెంబర్:
201 & చెరువు ఎఫ్టీఎల్ పరిధి (సర్వే నెం. 17)
విస్తీర్ణం: 3 ఎకరాల 17 గుంటలు (స్టడీ సర్కిల్ భూమి) + 4 ఎకరాల 11 గుంటలు (చెరువు భూమి)
కేటాయింపు: 2013లో బీసీ స్టడీ సర్కిల్ కోసం కేటాయింపు
ప్రస్తుత లబ్ధిదారు సంస్థ: SAS Infra (చైర్మన్ జి.వి. రావు, యాదగిరి రావు, వంశీకృష్ణ వడ్లమూడి తదితరులు)
అధికారిక రికార్డులు: రంగారెడ్డి కలెక్టర్ లేఖ (13.01.2020), 22-A ప్రొహిబిటెడ్ లిస్ట్ నమోదు (01.11.2025)

ఖాజాగూడ భూమి & తౌటానికుంట చెరువు వ్యవహారాలపై కీలక ప్రశ్నలు

ఖాజాగూడ సర్వే నంబర్ 20/1లోని 3 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమి ప్రైవేట్ సంస్థ SAS Infra పేరుతో ఎలా రిజిస్టర్ అయింది? సుమారు రూ.1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడానికి బాధ్యులెవరు? 1954-55 నుంచి ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలం రికార్డులు ఎప్పుడు, ఎవరి ఆదేశాలతో మారాయి?

2013లో బీసీ విద్యార్థుల స్టడీ సెంటర్ కోసం కేటాయించిన భూమి ప్రైవేట్ సంస్థకు ఎలా దక్కింది? 2018 డిసెంబర్ 13న రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూమిగా గుర్తించిన స్థలం ప్రైవేట్ పేరుతో ఎలా రిజిస్టర్ అయింది? 2020 జనవరి 13న SAS Infra నుంచి రూ.1.93 కోట్ల జరిమానా వసూలు చేయాలని, భూమిని ఖాళీ చేయించాలని ఆదేశించిన ప్రభుత్వం ఆ చర్యలను ఎందుకు అమలు చేయలేదు?

2025 నవంబర్ 11న 22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూమి 2026 జూన్ 19న SAS Infra పేరుతో ఎలా రిజిస్టర్ అయింది? ఒకే Transaction No.2600387641తో రెండు సబ్ డివిజన్ల రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? 2026 జూన్ 15న గూడె వెంకటేశ్వరరావు పేరుతో ఒక గుంట భూమి పట్టా కావడం వెనుక ఉన్న అసలు కథేంటి? ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించే హక్కు జంగయ్య కుమారుడు ఎస్. నరసింహకు ఎక్కడి నుంచి వచ్చింది?

భూ భారతి పోర్టల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డుల్లో మార్పులు చేసిన అధికారులెవరు? ఖాజాగూడ తౌటానికుంట చెరువు సర్వే నంబర్ 17లోని సుమారు రూ.300 కోట్ల విలువైన 4 ఎకరాల 11 గుంటల భూమి ఆక్రమణకు గురవుతోందన్న ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? చెరువు రక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను ధ్వంసం చేసిందెవరు? చెరువు భూమిలో మట్టి పోసి రోడ్డు నిర్మించడానికి అనుమతి ఇచ్చిందెవరు?

చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఆరు బేస్‌మెంట్లు, భారీ నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారు? హైడ్రా కంచె, GHMC ఫిర్యాదులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగడానికి సహకరించిన అధికారులెవరు? GHMC, HMDA ఇచ్చిన నిర్మాణ అనుమతుల వెనుక నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? వాటిని ప్రభుత్వం సమీక్షిస్తుందా? గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్‌లోని కుటుంబాల డ్రైనేజీ పైప్‌లైన్‌ను నిర్మాణ సంస్థ అనుమతి లేకుండా వినియోగిస్తోందన్న ఫిర్యాదుపై HMWSSB ఎలాంటి చర్యలు తీసుకుంది?

సామాన్యుల ఇళ్లపై వెంటనే చర్యలు తీసుకునే హైడ్రా, కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు, చెరువుల విషయంలో బడా నిర్మాణ సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఖాజాగూడ ప్రభుత్వ భూమి, తౌటానికుంట చెరువు వ్యవహారాలపై హైకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరిపించి, భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, బాధ్యులైన రాజకీయ నాయకులు, అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమా?

బడుగు, బలహీన వర్గాల, దళితులు, బీసీల చదువులు, ఆత్మగౌరవం కోసం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే ప్రక్రియను వెంటనే రద్దు చేయాలి. ఎస్‌ఐఎస్ ఇన్‌ఫ్రాకు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకుని, ఆ భూమిని యథావిధిగా బీసీ స్టడీ సర్కిల్‌కు అప్పగించాలి. బీసీ పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మరియు బీసీ అడ్వైజర్ వి. హనుమంతరావు తదితరులు ఈ దోపిడీపై స్పందించి, బహుజన బిడ్డలకు సమాధానం చెప్పాలని డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. పత్రికా సమావేశంలో లో బీఆర్ఎస్ కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Total Visitors: 3,364,427