November 12, 2026

దావోస్ తరహాలో ప్రపంచ విధాన చర్చలకు హైదరాబాద్ వేదిక

  • ప్రజాస్వామ్య పరిరక్షణకు హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్-2
  • అహింస, అలీన విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలే ప్రపంచానికి మార్గదర్శకాలు
  • ‎రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి చర్చలకు భారత్ సమ్మిట్-2
  • ఈనెల 13, 14న హైదరాబాదులో భారత్ సమ్మిట్ 2026 నిర్వహణ
  • 70కిపైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధుల భాగస్వామ్యం
  • ప్రతిపక్షాలను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
  • ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటమే కాంగ్రెస్ పార్టీ విధానం
  • ప్రజాస్వామ్య పరిరక్షణ, అహింస, అలీన విధానాలే సమ్మిట్ ప్రధాన అజెండా
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక, పెట్టుబడుల విధానాలపై చర్చలకు దావోస్ అంతర్జాతీయ వేదికగా గుర్తింపు పొందినట్లే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే భారత్ సమ్మిట్ 2026తో రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై ప్రపంచానికి దిశానిర్దేశం చేసే అంతర్జాతీయ వేదికగా హైదరాబాద్ ఎదగనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు హైదరాబాద్‌లో నవంబర్ 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్-2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి, ప్రపంచానికి నూతన దిశానిర్దేశం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తోందన్నారు.

‎హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో భారత్ సమ్మిట్-2 విజయవంతం చేయడానికి నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 70కిపైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికే తమ అంగీకారం తెలిపారని వెల్లడించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో, జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.

‎పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉన్నట్లే ప్రతిపక్షం కూడా ఉండాలని, ఈ రెండూ ప్రజాస్వామ్య వ్యవస్థకు రెండు కీలక స్తంభాలని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్ష పార్టీలను, నాయకులను శత్రువులుగా చూడకూడదని, కేవలం తమతో విభేదించే రాజకీయ ప్రత్యర్థులుగానే భావించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ఎక్కువ మంది ఓటర్లను తొలగించడం కాకుండా, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల కమిషన్, ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలని అన్నారు.

‎ మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌ఛార్జి గురుదీప్ సింగ్ సప్పల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సమృద్ధ భారత్ ఫౌండేషన్ డైరెక్టర్ పుష్పరాజ్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు

Total Visitors: 3,364,428