హిందూ దేవాలయాలకు కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లడం లేదు?
జగన్ కు శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్న
రాష్ట్రంలో హిందూ సంప్రదాయాలను ధ్వంసం చేయాలని జగన్ సర్కార్ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనాను అడ్డుపెట్టుకుని వినాయక చవితి పండుగను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందూత్వం మీద ఎందుకు కుట్రలు పన్నుతున్నారు? అంటూ ప్రశ్నించారు. ‘‘మీ నాన్న జయంతి కార్యక్రమాలకు కరోనా అడ్డు రాలేదా?’’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు.
గణపతి నవరాత్రులకు ఆంక్షలు పెట్టడం ఏమిటని, ఏ పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు.జెరూసలెంకు కుటుంబ సభ్యులతో వెళ్లే సీఎం జగన్ హిందూ దేవాలయాలకు కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హిందూత్వాన్ని జగన్ గౌరవించడం లేదన్నారు. ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మారుస్తున్నారని ఆరోపించారు.
పక్క రాష్ట్రంలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రశ్నల వర్షం కురిపించారు.వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే భక్తులు తిరగబడతారని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తే జగన్ రాజగురువు శారదా పీఠం స్వామీజీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.