బీజేపీ సర్కారు స్థిరంగానే ఉంది: దేవెగౌడ

Spread the love

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ప్రధాని
కేంద్రంలోని బీజేపీ సర్కారు స్థిరంగానే ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే తాను మోడీ పాలన గురించి ఏమీ వ్యాఖ్యానించనని అన్నారు. ఏడేళ్ల మోడీ పాలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దేవెగౌడ, దర్శనానంతరం టీటీడీ మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ కుమారుడయిన నితిన్ నివాసంలో శనివారం అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. ఇప్పటి పరిస్థితిలో బీజేపీ, కాంగ్రేసేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కష్టమని, ముందు అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకే వేదికపై రావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయా రాష్టాల్లో శక్తివంతంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, ముందు ఒకే


అజెండాతో ఒక వేదికపైకి రావల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రాంతీయ పార్టీల సహకారం లేనిదే, కేంద్రంలో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. తొలుత దేవెగౌడ శుక్రవారం రాత్రి తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. తిరిగి శనివారం ఉదయం కూడా కుటుంబసభ్యులతో కలసి దర్శనం చేసుకుని, బలిజనాడు కన్వీనర్ రమణ కుమారుడి నివాసానికి వెళ్లి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా దేవెగౌడ.. ఏపీలోని రాజకీయ పరిస్థితులు, టీటీడీ పరిపాలనా వ్యవహారాలపై రమణతో చర్చించారు. సెప్టెంబర్, నవంబర్‌లో కమ్మ-రెడ్డేతర కులాలతో తిరుపతిలో బలిజ ఐక్యవేదిక సభ నిర్వహించే అంశంపై రమణ, మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చించినట్లు సమాచారం.

Leave a Reply