– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం విచారకరమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీకోసం… అనూష కుటుంబాన్ని పరామర్శించడం కోసం కొద్ది రోజుల క్రితమే నిర్ధారించుకున్న కార్యక్రమమిది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పా?
ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో, పోలీసు రాజ్యంలో ఉన్నామో అర్థమవటంలేదు. టీడీపీ నాయకుల కార్యక్రమాలంటే వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది?. మేమేమైనా అరాచక శక్తులమా? సంఘ విద్రోహ శక్తులమా? లేకుంటే యుద్ధానికేమైనా వెళ్తున్నామా? ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రతిపక్ష నాయకులుగా బాధితులను పరామర్శించడం మా బాధ్యత. 14 సంవత్సరాలపాటు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు వద్ద పనిచేసిన నాయకులకు విలువివ్వాల్సివుంది. ప్రజాస్వామ్యయుతంగా చేసే ఆందోళనలను అడ్డుకోవడంలో అర్థంలేదు. టీడీపీ హయాంలో మేమిలా చేసివుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా?.
ఇలా వ్యవహరిస్తే వైసీపీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదు. వైసీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జంకు బొంకు లేకుండా ముందుకు సాగుతాం. పెట్టే కేసులు, నిర్భందాలకు భయపడేవారు ఎవరూ లేరు. వైసీపీ నాయకులు తాలిబన్లను గుర్తుకు తెస్తున్నారు. ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్లు వ్యవహరించినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మేం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం. మీరు చేస్తున్న సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి. టీడీపీ నాయకుల కార్యక్రమాలకు ఆంక్షలు విధించడం బాగాలేదు.
ఇంతటి దరిద్రపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 39 సంవత్సరాలైతే 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మిగతా కాలమంతా ప్రతిపక్షంలో పనిచేశాం కానీ ఇలా ఎప్పడు వ్యవహరించలేదు. ప్రజల్ని, ప్రతిపక్షాన్ని అణచివేసే పని, నీతిబాహ్య చర్యలను మానుకోవాలి. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, లేకుంటే తీవ్ర ప్రజా వ్యతిరేకతకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.