– ‘టీటీడీ ప్రత్యేకం’పై హైకోర్టు షాక్
– అవమానాలు అలవాటయిపోయిన వైనం
– కోర్టులో నిలవదని ముందే చెప్పిన ‘సూర్య’
( మార్తి సుబ్రహ్మణ్యం)
నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాళ్లెవరన్నది వెనుకటికి ఓ సామెత. అంటే రోజూ నగుబాటు పాలయ్యేవారి అవమానం గురించి, కొత్తగా వాపోవడం దేనికన్నది ఇప్పటి తాత్పర్యం. గత రెండున్నరేళ్ల నుంచి ఏపీ హైకోర్టులో శరపరంపరగా.. జగనన్న సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులు చూస్తే, మెడపై తల ఉన్న ఎవరికయినా వెనకటి ఈ సామెత గుర్తుకురాక తప్పదు. సరే.. మెడపై తల లేని వారిగురించి మాట్లాడుకోవడం కూడా, తెలివైనవారి లక్షణం కాదు.
టీటీడీ బోర్డులో ఘనత వహించిన పుణ్యపురుషులు-సంఘసంస్కర్తలను, ఏరికోరి ఎంపిక చేసి వేసిన ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలు, హైకోర్టు పుణ్యాన రద్దయ్యాయి. అంటే దేవుడిని కూడా కోర్టులే కాపాడుతున్నాయన్నమాట. టీటీడీలో జంబో కమిటీ వేసి ‘పైవారిని మెప్పించి’.. వారి పెదవులపై చిరునవ్వులు పూయించిన జగనన్న సర్కారు నిర్ణయం, హైకోర్టు తీర్పుతో కడకు నవ్వులపాలవడం విచారకరం. నిజానికి ఇలాంటి నగుబాటు ఏదో జరుగుతుందని ‘ సూర్య’ కథనంలోనే హెచ్చరించింది. ఇప్పుడు అదే జరిగింది. జగనన్న ఇచ్చిన ఉత్తర్వును కొట్టివేసింది. ఏం చేస్తాం? చేసుకున్నవారికి చేసుకున్నంత! ఇది కూడా చదవండి… టీటీడీ చట్టంతో కొత్త బోర్డుకు చిక్కులు
ఆంధ్రాలో జగనన్న సర్కారుకు, ‘విజయవంతంగా’ ఎదురవుతున్న ఈ అవమానాలు చూస్తుంటే.. ‘చెబితే వింటివ గురూ గురూ’ అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఓ పాట గుర్తుకురాక తప్పదు. ఎవరికయినా తెలియని వాళ్లకు చెప్పవచ్చు. లేకపోతే తెలిసిన వారికీ చెప్పవచ్చు. తెలిసీ తెలియని వారికి, అన్నీ తమకే తెలుసనే వారికి ఏం చెప్పినా అది వ్యర్థప్రయత్నమేనన్నది, తాజా హైకోర్టు తీర్పుతో మరోసారి తేలిపోయింది.
తన చట్ట వ్యతిరేక నిర్ణయాలపై.. కోర్టులు ఇస్తున్న తీర్పులపై ఆత్మపరిశీలన చేసుకోవడానికి జగనన్న సిద్ధంగా లేరని, దాని ఫలితమే టీటీడీ బోర్డుపై తీసుకున్న నిర్ణయానికి చెంపపెట్టయిన తీర్పు అనే కఠోర నిజాన్ని కూడా జగనన్న స్వీకరించేందుకూ సహజంగా సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆయన తత్వం అది. ఇదంతా ఆ ‘151 మార్కులు’ తెచ్చిన తంటా. అందుకే ఆయన తన ముందు కోర్టులు కూడా చిన్నవేనన్న భ్రమల్లో బతుకుతున్నారు. అందుకు తరచూ ఫలితం అనుభవిస్తున్నారు. కాబట్టి జగనన్న సర్కారుకు ఎదురవుతున్న అవమానాలకు ఇప్పుడు సానుభూతి కూడా కనిపించడం లేదు.
టీటీడీ యాక్టులో లేని వాటిని చొప్పించి, తన మనసెరిగిన వారిని.. తాను మనసుపడ్డవారిని.. ‘పైనున్న వారిని’ మెప్పించే మెహర్బానీ కోసం వేసిన టీటీడీ జంబో కమిటీకి, హైకోర్టు మొట్టికాయలు వేయడం.. జగన్ సర్కారుకు పెద్ద అవమానంగా కనిపించకపోవడంలో వింతేమీ లేదు. ఎందుకంటే ఇలాంటి తలబొప్పులు చాలానే కట్టి, తలంతా మొద్దుబారింది కాబట్టి.. కొత్తగా వచ్చే వ్యతిరేక తీర్పులేమీ, జగనన్న సర్కారుకు పెద్ద అవమానాలుగా కనిపించవు. కర్ణుడి సహజకవచకుండలాల మాదిరిగా, అవమానాలనేవి గత రెండున్నరేళ్ల నుంచి అలవాటయిపోయింది. ఇటీవలి పరిషత్తు ఎన్నికల కౌంటింగ్‌పై, హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన వైసీపేయులు… అదే హైకోర్టు టీటీడీ జంబో కమిటీని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై మాత్రం, ‘పిత్తినపేరమ్మ’లా మౌనంగా ఉండటమే వింత. అంటే ‘జస్టిస్ చౌదరి’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్లు తీర్పు తీర్పుకు వ్యాఖ్యల్లో మార్పు ఉంటుందేమో!? ఇది కూడా చదవండి… కురుసభను మించి..కొండపై కొలువుదీరిన కొత్త బోర్డు
అసలు టీటీడీ వ్యవహారాల్లో వేలు పెట్టడమే ఓ తలనొప్పి. బోలెడు యాక్టులు, శాస్త్రాలు, విశ్వాసాలతో కూడుకున్న బోర్డులో వేలుపెట్టి బావుకున్నవారెవరూ లేరు. అదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రం వరకూ.. అంతా హిందువులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి, టీటీడీపై జోక్యం చేసుకునే ందుకు వారెవరూ సాహసించలేదు. ఎందుకంటే హిందువులకు వెంకన్నంటే భయం-భక్తి ఉంటాయి కాబట్టి. ఎటొచ్చీ మధ్యలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే కొత్త పోకడ మొదలయింది. వైఎస్ పుణ్యాన సెక్యులర్ పదవులయిన తిరుపతి ఎమ్మెల్యే, తుడా చైర్మన్లు టీటీడీ సభ్యులయ్యారు. ఆ రెండు నిర్ణయాలు తప్ప, వైఎస్ కూడా టీటీడీపై వేలు పెట్టిన సందర్భాలు కనిపించవు.
అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. తండ్రికి మించిన తనయుడయిన జగనన్న టీటీడీ వ్యవహారాల్లో వేలే కాదు.. ఏకంగా కాళ్లే పెట్టేయడమే ఇంత రచ్చకు అసలు కారణం. జగన్ క్రైస్తవుడయినందున, ఆయనకు టీటీడీ విశిష్టత తెలియనందుకే అంతమందిని వేశారని.. అదే నిర్ణయం ముస్లిములకు చెందిన వక్ఫ్‌బోర్డుపై తీసుకోగలరా? అన్న అనవసర నిందలకు, జగనన్న గురి కావలసి వచ్చింది. నిజానికి టీటీడీకి వేసినట్లే వక్ఫ్బోర్డుకూ డజన్లమందిని వేసుకునే వెసులుబాటు ఉంది. కానీ జగనన్న దాని జోలికి పోరు. వెంకన్న హుండీలో కానుకలు వేయవద్దని సెలవిచ్చిన అదే రమణదీక్షితులకు.. మళ్లీ అక్కడే కొలువు ఇవ్వడం వల్ల జగన్ ఇమేజ్ దారుణంగా డామేజీ అయిందే తప్ప, ఇంచి కూడా పెరగలేదన్నది మనం మనుషులం అన్నంత నిజం.
అసలు కోర్టుల్లో వరస వెంట వరస ఎదురవుతున్న ఎదురుదెబ్బలకు, కారణం ఎవరన్నది ఇప్పటివరకూ ఎవరికీ అంతుబట్టని రహస్యం. సాధారణంగా అయితే ప్రభుత్వ న్యాయవాదులు కీలకమైన కేసుల సందర్భాల్లో ముఖ్యమంత్రులతో చర్చించి, వారికి సలహాలు ఇస్తుంటారు. వారు కూడా దానినే అనుసరిస్తుంటారు. వైఎస్ కూడా అదే చేసేవారు. శాసనసభకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తినప్పుడు, నాటి శాసనసభ న్యాయసలహాదారు జంధ్యాల రవిశంకర్‌తో సంప్రదించేవారు. జగనన్నకు ఆ విధంగా సలహా ఇచ్చే ధైర్యం గానీ, ఆయనే న్యాయవాదుల సలహా తీసుకోరన్నది బయట వినిపించే మాట.
అసలు ఇప్పడు జగనన్నకు ప్రభుత్వ న్యాయవాదులు అలాంటి సలహాలు ఇవ్వడం లేదా? ఒకవేళ ఇస్తున్నా జగనన్నే వాటిని ఖాతరు చేయడం లేదా అన్నది ఒక అనుమానం. అదీకాకపోతే.. తాను ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి, ఇక దాని మంచి చెడ్డలన్నీ మీరే చూసుకోవాలే తప్ప, జయాపజయాలతో నాకు సంబంధం లేదన్నట్లు జగనన్న భావిస్తున్నట్లయినా ఉండాలి. ఈ రెండూ కాకపోతే.. జీతాలిస్తున్నాము కాబట్టి, తన నిర్ణయం కోర్టులో నెగ్గేలా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులదేనన్న భావనయినా ఉండాలి. ఏదేమైనా.. పరువు పోతుంది మాత్రం ప్రభుత్వానికే. మరి ప్రభుత్వమంటే ప్రజలే కాబట్టి, ఇప్పుడు పోతున్న పరువు ప్రజలదే అనుకోవాలా?