Home » భయంతో బతికాం బాబూ..

భయంతో బతికాం బాబూ..

-చంద్రబాబుతో కొప్పర్రు బాధితురాలి మొర
మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, కొప్పర్రు బాధితురాలు బత్తిని శారద మొన్న రాత్రి తన ఇంటిపై జరిగిన దాడి గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుని కేంద్ర పార్టీ కార్యాలయంలో కలిసి తన కుటుంబంపై, ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ…మొన్న రాత్రి 10.30 గంటల సమయంలో వైసీపీ నాయకులు మా ఇంటిపై దాడి చేశారు. అతి దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారు.రాళ్లదాడికి పాల్పడి ఇంటిని ధ్వంసం చేశారు.మేమంతా భయోత్పాతానికి గురయ్యాం. ప్రాణభయంతో అల్లాడిపోయాం. అసలు ప్రాణాలతో బయటపడగలమా అని అనుమానమొచ్చింది.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినాయక నిమజ్జనం అనే సాకుతో మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండుమూడు నెలలకే నా భర్తను అరెస్టు చేశారు.వినాయకుడి ఊరేగింపు సాకుతో మా ఇంటిముందుకు వచ్చి దాడికి పాల్పడుతున్నారు.
మొదటి యేడాది కారు అద్దాలు పగులగొట్టారు. రెండో ఏడాది ఇంటి నిండా గులాం కొట్టారు. ఈ యేడాది ప్రీ ప్లాన్డ్ గా పెట్రోల్ బాటిళ్లు, చిన్న చిన్న సిలెండర్లు ట్రక్కుల్లో గోతాముల్లో రాళ్లు, కర్రలు తెచ్చి దాడికి పాల్పడి మమ్మల్ని భయభ్రాంతులను చేశారు. నా భర్త ఊర్లో టీడీపీ తరపున బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఆయనపై కక్ష గట్టారు.మావారిపై వ్యక్తిగత కక్షలేమీ లేవు. కేవలం రాజకీయ కక్షలే ఉన్నాయి. సింగిల్ లీడర్ షిప్ తో ఊరిని అభివృద్ధి పరుస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు.ఇంటిలో నుంచి బయటికి లాగి కొట్టాలని ప్లాన్ వేసుకున్నారు. ఇరుగు పొరుగు మాకు రక్షణ కల్పించారు. వారు కాపాడకపోతే మేం ప్రాణాలతో ఉండేవారం కాదు.
పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఎస్సై కూడా ప్రాణభయంతో ఇంటిలోపలికి పరిగెత్తారు. ఇంటిబయట ఇద్దరు పోలీసులు మాత్రమే ఉంచారు. గంటన్నరపాటు నరకయాతన అనుభవించాం. రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. జగన్ పాలనలో ప్రాణభయంతో బతకాల్సివస్తోంది.
నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏవివాదాలు ఉండేవికావు. మండలాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చాను. మండల అభివృద్దే పనిగా పెట్టుకునే వారం. వేరే ధ్యాస ఉండేదికాదు.నిధులు తెచ్చి రోడ్లు, అభివృద్ధి పనులు చేసుకునే దానిపైనే ధ్యాస ఉండేది.మాకొస్తున్న మంచిపేరును చూసి వైసీపీవారు జీర్ణించుకోలేకపోయారు.


రాజకీయ కక్షతో నా భర్తపై దాడి చేశారు. దాడి చేసిందేకాక మాపైన్నే తప్పుడు కేసులు పెట్టారు. నాపై సానుభూతి చూపినవారిపై కూడా కేసులు పెట్టారు. వైసీపీవారిని ఎదుర్కోవాలంటే కష్టంగా ఉంది. మేం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది.ఈరోజు చంద్రబాబునాయుడుగారిని కలవగా ఆయన మాకు ధైర్యమిచ్చారు.మూడేళ్ల నుంచి బాధపడుతున్నామని తెలుపగా భయపడొద్దు, మంచిరోజులొస్తాయని భరోసా ఇచ్చారు.అవసరమైతే ప్రైవేటు కేసులు పెడదామన్నారు. టీడీపీ నాయకులంతా నాకు న్యాయం జరగేలా చూడాలని కోరుకుంటున్నాను. మేం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. నిందితులను తూతూమంత్రంగా అరెస్టు చేసి వదిలేశారు. న్యాయం జరగకపోతే ప్రైవేటు కేసు వేస్తాను.

Leave a Reply