Suryaa.co.in

Devotional

శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంట నివసిస్తుంది..? ఎదురు వస్తుంది?

సర్వ సంపదలకు అధినేత్రి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉంటారు.? ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ, నోములు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాము.. కానీ నిజానికి…,శ్రీ ( లక్ష్మీదేవి ) యొక్క నివాస స్థానం, ఆమె ప్రీతి కొరకు చెయ్యాల్సిన పనులు వంటి వాటి కోసం ఇప్పుడు మనం సూక్ష్మంగా తెలుసుకొందాము..
పూజలు, వ్రతాలూ, నోములు, యజ్ఞయాగాదులు వంటివి చేయలేని వాళ్ళు…..
వాళ్ల జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.
అటువంటి విధానాలలో ముఖ్యమైన 15 మార్గాలు మీకోసం..
గడపకు తగిన విలువనివ్వడం..అంటే…
సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మిద కాలు వేయడం, గడప మీద కూర్చోవడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు.
పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవి కి ఆహ్వానం పలుకుతాయి.అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమతో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తే మరీ మంచిదే.
వేకువజామునే లేచి కాలకృత్యాదులు ముగించుకొని, గృహాన్ని శుభ్రపరచి, సూర్యోదయ సమయానికల్లా దీప ధూప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీ దేవిని కొలిచేవారిపట్ల ఆ దేవి ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది.
శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మీదేవి కి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.
చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.
ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి.
ఇంటి ఇల్లాలు ఏడవటం, గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం, శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా కలియ తిరగటం వంటివి చేయకూడదు.
ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించలేదు.
అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరుసంధ్యలలో భుజించేవారు,నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు.
ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో, తల్లిదండ్రులను గురువులను పెద్దలను
గౌరవ మర్యాదలతో కొలిచే వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.
ఉదయ సంధ్యా నియమాలు పాటించేవారు, మంగళ శుక్ర వారాలు గుర్తెరిగిన వారు,లక్ష్మిని (ధన సంభందితాన్ని) గౌరవించే వారు, అపాత్ర దానం చేయని వారు, అవసరమెరిగి సమయపాలనలో దానం చేసిన వారు ఆమెకు అత్యంత ప్రీతిపాత్రులు.
సత్యవాదులు, ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు.
ప్రతి శుక్రవారం చక్కగా స్నానాదులు పూర్తిచేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి,
లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు.

LEAVE A RESPONSE