పెంచిన విద్యుత్ ఛార్జీల తగ్గించడంతో పాటు ట్రూఅప్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ ఇన్‌చార్జ్‌లు, నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ, విద్యుత్ ఛార్జీల పెంపు, ట్రూఅప్ ఛార్జీలపై ప్రజలతో చర్చిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలపై టీడీపీ నెల రోజుల ఆందోళన కార్యక్రమంలో మూడవ వారంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆక్టోబర్ 18 నుంచి 24 వ తేదీ వరకు రోజుకు రెండు గ్రామాల చొప్పున వారం మొత్తంలో 12 గ్రామాల్లో పర్యటించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 364 గ్రామాల్లో టీడీపీ నాయకులు పర్యటించి గ్రామ సమావేశాల్లో మాట్లాడారు. కొన్ని చోట్ల ఫ్యాన్లను చేతితో పట్టుకోని జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్యాన్లు తిరగడం లేదని వినూత్నంగా గ్రామాల్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు చూసి ఇళ్లల్లో గుడ్డి దీపాలు పెట్టుకుంటున్న పరిస్థితి దాపురించిందన్నారు. రెండున్నర ఏళ్లగా ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యావసరాల ధరలు పెరిగి బతుకే భారంగా మారిన పరిస్థితుల్లో విద్యుత్ చార్జీల భారం కూడా ప్రజలపై పడుతుంటే ప్రభుత్వం చూస్తూనే ఉందన్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచనని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చారు. మాట తప్పి, మడమ త్రిప్పి రెండున్నరేళ్లలోనే రూ. 36,802 కోట్ల భారం విద్యుత్ వినియోగదారులపై మోపినట్లు తెలిపారు. రూ. 350 బిల్లు వచ్చే పేదల ఇంటికి నేడు రూ. 1000 వస్తుందన్నారు. ఒక పేద కుటుంబంపై రాబోయే రెండున్నరేళ్లలో రూ. 20 వేల అదనపు భారం పడుతున్నట్లు తెలిపారు. చంద్రన్న 5 ఏళ్ల పాలనలో విద్యుత్ రంగం 140అవార్డులు సాధించింది. వైకాపా అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలకు కరెంటు కోతలు, బిల్లుల మోతలు మిగిలాయన్నారు.
టీడీపీ డిమాండ్స్
1. ట్రూఅప్ ఛార్జీలు నిలుపుదల చేయడం కాదు , పూర్తిగా రద్దు చేయాలి .
2. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే చర్యలు వెంటనే విరమించుకోవాలి .
3. జగన్‌రెడ్డి ఎన్నికల హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచరాదు . ఇప్పటివరకు వసూలు చేసిన ఛార్జీలు రిఫండ్ చేయాలి .
4. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు రూ .12 వేల కోట్లు వెంటనే చెల్లించాలి .
5. ప్రభుత్వరంగ సంస్థలు డిస్కమ్‌లకు బకాయి వున్న రూ .10,800 కోట్లు చెల్లింపులకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి .
6. ప్రభుత్వ విద్యుత్ సంస్థల సామర్థ్యం మేరకు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి . 7. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయరాదు .
25 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర జోనల్ స్థాయిలో వినూత్న నిరసన కార్యక్రమాలు
25 – అక్టోబర్ – 2021న జోన్ -1 (అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్స్)
26- అక్టోబర్ – 2021న జోన్ – 5 (నంధ్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంట్స్)
27- అక్టోబర్ – 2021న జోన్ – 2 (అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పార్లమెంట్స్)
28- అక్టోబర్ – 2021న జోన్ – 4 (ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, రాజాంపేట, తిరుపతి పార్లమెంట్స్)
29- అక్టోబర్ – 2021న జోన్ – 3 (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్స్)