మోదీకి చంద్రబాబు నాయుడు లేఖ
భారతదేశ జనాభాలో వెనుకబడిన తరగతులు (BC లు) ఎక్కువ శాతం ఉన్నారు. కానీ, జనాభాలో వారి నిష్పత్తికి సమానంగా ప్రయోజనాలను అందక, నిర్లక్ష్యానికి గురిచేయబడ్డ సమూహంగా బి.సి లు మిగిలిపోతున్నారు. 1953 లో ఏర్పాటు చేసిన మొదటి బిసి కమిషన్ అయిన కాలేల్కర్ కమిషన్, తరువాత వచ్చిన కమిషన్లు, వివిధ రాష్ట్ర కమిషన్లు, ప్రభుత్వాలతో సహా, వెనుకబడిన తరగతుల జన గణన చేయాలని సిఫార్సు చేయటం జరిగింది.
భారతదేశంలో కుల వివక్ష ఇప్పటికీ వుంది అనేది ఒక కఠినమైన వాస్తవం. కుల జనాభా గణన అనేది ఇప్పటికే ఉన్న సామాజిక విభజనలను మరింత తీవ్రతరం చేస్తుందని, వివక్షను ప్రోత్సహిస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఏదేమైనా, కుల జనాభా గణన చేయకపోవడం కూడా కుల వివక్ష వలె అన్యాయం.
జనాభా లెక్కలు లేకపోవడం వలన బీసీల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకాల అమలు బలహీనంగా జరుగుతుంది. దీని వలన బిసిలు విస్మరణకు మరియు వివక్షకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.కులాల జనాభాపై ఉన్న ప్రస్తుత సమాచారం 90 సంవత్సరాల కాలం నాటిది. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు పాత సమాచారం పై ఆధారపడి అసంబద్ధంగా ఉండరాదు.
మనం మరింత సమ సమాజం వైపు అడుగులు వేస్తున్నామని నిర్ధారించుకోవడానికి, బీసీలను సామాజికంగా మరియు ఆర్థికంగా అర్థం చేసుకోవడానికి, వారికి సమాన అవకాశాలు కల్పించడానికి సరి అయినా ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. భారత రాజ్యాంగములోని 15 (4) అధికరణ ప్రకారం బీసీలకు వృత్తిపరమైన కోర్సులలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజికంగా మరియు విద్యాపరంగా వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేయవచ్చు.
అదేవిధంగా, అధికరణ 16 (4) ప్రకారం, బిసిల నిష్పత్తి ప్రకారం వారికి ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్ర సర్వీసులలో రిజర్వేషన్స్ కల్పించవచ్చని చెబుతోంది. ఈ రెండు సందర్భాల్లో, వివిధ రంగాలలో బిసిల ప్రాతినిధ్య నిష్పత్తిని అర్థం చేసుకోవడానికి వారి జనాభాను అంచనా వేయడం చాలా అవసరం.
కుల జనాభా లెక్కలు పాత సమాచారం పై ఆధారపడి పథకాల రూపకల్పన చేయడం సరైనది కాదని అనేక కమిషన్లు, మేధావులు, విద్యావేత్తలు, ఇతరులు అభిప్రాయం వెలిబుచ్చారు. అంతేకాకుండా, బిసి జనాభా జాబితాలను కాలానుక్రమంగా సవరించాలి అని అందరి అభిప్రాయం.
వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చట్టం, 1993 లోని సెక్షన్ 11, 2018 లో రద్దు చేయబడినప్పటికీ, చాలా స్పష్టంగా ఈ క్రింది విధంగా పేర్కొనబడింది…
“ కేంద్ర ప్రభుత్వం, ఈ చట్టం అమలులోకి వచ్చిన పదేళ్ల గడువు ముగిసిన తర్వాత, ప్రతి పదేళ్లకు బీసీ జాబితాలను సవరించాలి. వెనుకబడిన తరగతుల జాబితాలలో కొత్త తరగతులను చేర్చేవిధంగా సవరణ చేయవచ్చు.”
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యములో, బీసీ కుల గణన కోసం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి భారత ప్రభుత్వం పరిశీలనకు పంపడం జరిగింది.
బిసిల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, బీసీలు పేదరికంలో కొనసాగుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారి జనాభాపై తగిన సమాచారం లేకపోవడమే. అందువల్ల, బీసీల సంక్షేమం మరియు అభివృద్ధిని నిర్ధారించేందుకు బిసి కుల గణనను జనాభా గణనలో చేర్చాలని అభ్యర్థిస్తున్నాను