Suryaa.co.in

Editorial

అరాచకాంధ్రప్రదేశ్..

(మార్తి సుబ్రహ్మణ్యం)
రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గంజాయి, డ్రగ్స్‌లకే కాదు.. రాజకీయ నేతల బూతులు, రాజకీయ పార్టీ కార్యాలయాలపై ముష్కరదాడులకు అడ్డాగా మారడం విషాదం. రాష్ట్రం ఏర్పడి- మళ్లీ విడిపోయి- కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఇప్పటివరకూ, ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై ప్రత్యర్ధులు దాడులు చేసిన ఘటనలు వినలేదు. కనలేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో మమతాదీదీ పార్టీ మూకలు… భాజపా కార్యాలయాలు, ఆ పార్టీకి ఓట్లేసిన సానుభూతిపరుల ఇళ్లపై తెగబడి, అరాచకాలు సృష్టించిన వైనం చూశాం. ఆ తరహాలోనే ఏపీ టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ అనే ‘శాంతికాముక పార్టీ’కి చెందిన ‘అభినవ గాంధీ’గారి కార్యకర్తలు విధ్వంసం సృష్టించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఆ రకంగా ఆంధ్రాలో కర్రలు, కత్తులు, సుత్తులతో ప్రజాస్వామ్యం పరిఢివిల్లుతుండటం మేధావులు, ప్రజాస్వామ్యపిపాసులకూ అనందదాయకమే కదా? ఇలాంటి శుభ దినాల కోసమే కదా.. వారంతా గత ఎన్నికల ముందు శ్రమదానం చేసింది? ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగితే ప్రజాస్వామ్యం అంత శోభిల్లుతున్నట్లు లెక్క!
ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు కర్రలు, కత్తులు, సుత్తులు పట్టుకుని దాడి చేసిన వైనం.. అక్కడికి కూతవేటుదూరంలోనే ఉన్న డీజీపీ ఆఫీసుకు గానీ, ఏపీఎస్పీ బెటాలియన్‌కు గానీ, ఇంకొం దూరంలో ఉండే ఆక్టోపస్ ఆఫీసుకు గానీ తెలియకపోవడమే వింత. డీజీపీ ఆఫీసు-టీడీపీ ఆఫీసు జాతీయ రహదారికి ఆనుకునే సర్వీసు రోడ్డులోనే ఉంటాయి. డీ జీపీ ఆఫీసుకు టీడీపీ ఆఫీసు కూతవేటు దూరమే. సహజంగా డీజీపీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా, అంతకుమించిన బందోబస్తు ఉంటుంది. కాబట్టి అటు వైపు ఎవరొచ్చినా సులభంగా తెలిసిపోతుంది.


అలాంటిది.. వైసీపేయుల కార్లు కాన్వాయ్‌గా వచ్చి, అందులో ఉన్న వాళ్లు రాయలసీమ ఫ్యాక్షనిస్టుల మాదిరిగా కారు డోర్లకు వేళ్లాడుబడుతూ, కర్రలు గాల్లో తిప్పుతూ టీడీపీ ఆఫీసుకు చేరినా నియంత్రించకపోవడం ఎవరి వైఫల్యం? అసలు ఇలాంటిదేదో జరుగుతుందని నిఘా దళం పసికట్టకపోవడమే మరో వింత.
తెలంగాణ సరిహద్దులోని గుంటూరు-కృష్ణా జిల్లా సరిహద్దు గ్రామాల్లో.. రోజూ మద్యం రవాణా చేసే లక్ష్యంతో పోలీసులు కార్లు తనిఖీ చేస్తున్నారు. మరి.. డీజీపీ ఆఫీసు వద్ద అలాంటి తనిఖీలుండవా? అన్నది బుద్ధిజీవుల సందేహం. దాడికి ప్రేరేపితుడిగా భావిస్తున్న పట్టాభి.. హైకోర్టు జడ్జి, ఇతర ప్రముఖులు ఉంటున్న కాలనీలో నివసిస్తున్నారు. ఇప్పటికి ఆయన ఇంటిపై రెండుసార్లు దాడి జరిగిందంటే.. ప్రముఖులుండే ప్రాంతాలకే రక్షణ లేకపోతే, ఇక సామాన్యులకు దిక్కేమిటన్న భయం తలెత్తడం సహజం కదా?
టీడీపీ ఆఫీసుపై దాడిని రాజకీయ కోణంలో చూసినా, అందులో జీతాల కోసమే పనిచేసే ఉద్యోగులపై జరిగిన వికృతదాడి, అమానుషకాండను మాత్రం మనుసున్న ఎవరైనా ఖండించాల్సిందే. ముష్కరుల దాడిలో గాయపడిన వారెవరూ, పార్టీలో పదవులున్న నేతలు కాదు. పొట్టకూటి కోసం పనిచేస్తున్న ఉద్యోగులే. అలాంటి బక్క జీవులపైనా దాడి చేయడం దుర్మార్గమే కాదు అరాచకం కూడా. నక్సలైట్లు కూడా ప్రముఖులను కిడ్నాపు చేసినప్పుడే, హత్య చేసినప్పుడో.. ఆయా ప్రముఖుల వద్ద పనిచేసే సిబ్బందిని దూరంగా పంపేస్తుంటారు. కానీ జనజీవనంలో తిరిగే రాజకీయ పార్టీల ప్రేరేపిత మూకలు, ఆపాటి మానవత్వం ప్రదర్శించకపోవడమే విచారకరం.
రేపు ఒకవేళ వైసీపీ ఆఫీసుపై టీడీపీ ప్రతీకారదాడి చేసి, అక్కడ పనిచేసే ఉద్యోగులను గాయపరిచినా అది దుర్మార్గమే అవుతుంది. పొట్టకూటి కోసం పనిచేసే వారిపై దాడి చేయడం మగతనమవుతుందా? టీడీపీ ఆఫీసుపై దాడి తర్వాత అక్కడ బలగాలు పెంచాల్సిన పోలీసులు.. ముందస్తు జాగ్రత్తగా వైసీపీ ఆఫీసు వద్ద ప్రత్యేక దళాలను మోహరించడమే తమాషా. అలాంటి ముందస్తు జాగ్రత్తలేవో టీడీపీ ఆఫీసు, పట్టాభి ఇంటిదగ్గరే తీసుకుని ఉంటే ఇంత అరాచకం జరిగేదే కాదు కదా అన్నది బుద్ధిజీవుల ఉవాచ. రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులను ఇళ్ల వద్దనే బందీలను చేసి, అదే ఘటనపై నిరసన వ్యక్తం చేసిన వైసేపేయులను మాత్రం రోడ్లపైకి రానిచ్చిన పోలీసుల చర్యను ఎవరైనా తప్పుపట్టిన వాళ్లు దుర్మార్గుల కిందే లెక్క. ఎవరి బాధలు వారివి మరి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి విడిపోయేవరకూ చాలా దారుణాలు జరిగాయి. వంగవీటి రంగా, వైఎస్ రాజారెడ్డి, శివారెడ్డి, పరిటాల రవి హత్యలు, కారంచేడు, పదిరికుప్పం, కంచికచర్ల దాడులు అనేకం జరిగాయి. అవన్నీ వర్గ-కుల ఘర్షణ నేపథ్యంలోనివే. ఆయా సందర్భాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్-టీడీపీ కార్యాలయాలపై కూడా ఇలా దాడులు జరిగిన ఉదంతాలు లేవు. చివరకు ఫ్యాక్షన్‌కు పుట్టినిల్లయిన కడప జిల్లాలో, రాజారెడ్డి హత్యానంతరం కూడా ఇలాంటి దాడులు జరిగింది లేదు.
రంగా హత్యానంతరమే టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులు, షాపులు-బ్యాంకుల లూటీలు జరిగాయి. ఇప్పుడు నేరుగా పార్టీ ఆఫీసులమీదకొచ్చి దాడి చేసే కొత్త సంస్కృతి, భవిష్యత్తులో ప్రమాదఘంటికలకు సూచికలే. నిజానికి చంద్రబాబు ఇంటిపై దాడికొచ్చినప్పుడే ఇలాంటివి అరికట్టి ఉంటే, తాజా ఘటన కు ఆలోచన వచ్చేది కాదు. పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో పనిచేసే, వివిధ విభాగాలు బాసులకు కూతవేటు ఉండేదూరంలోనే అరాచకశక్తులను అదుపు చేయకపోతే.. ఇక సామాన్యులకు రక్షణపై ఎక్కడ భరోసా ఉంటుందన్నది ప్రశ్న.
ఇహ ఇప్పుడు సమస్యలోతుల్లోకి వెళదాం. ఇంత అరాచకానికి పట్టాభి అనే టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలే కారణమన్నది వైసీపేయుల ఆరోపణ. సీఎం జగన్, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని బూతులు తిట్టినందుకే శాంతికాముకులు-ప్రజాస్వామ్యప్రియులు- అహింసామూర్తులయిన తమ శ్రేణులు

రెచ్చిపోయారన్నది వైసీపీ నేతల వాదన. నిజానికి ప్రభుత్వ సలహాదారును తెదేపేయులు చాలాకాలం నుంచి పెద్ద పాలేరు- పెద్ద గుమాస్తాగా అభివర్ణిస్తు, ఆ మేరకు విమర్శలు గుప్పిస్తున్నారు. ఘనత వహించిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అయితే ఒక అడుగుముందుకేసి.. టీడీపీ కార్యకర్తలు జగన్‌ను తిడితే, చంద్రబాబు ఇంటికెళ్లి తంతామని చాలా మర్యాదపూర్వకంగా- ప్రజాస్వామ్యయుతంగా- అత్యంత అహింసాయుతగళంలో సెలవిచ్చారు.
ఎంపి మోపిదేవి వెంకట రమణ కూడా, టీడీపీ ఆఫీసుపై దాడి సరైనదేనని సెలవిచ్చారు. టీడీపీ నేతల భాష సరిగా లేకపోతే, సమాధానం ఇలాగే ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. మామూలుగా ఇప్పుడు ఏపీలో పోలీసులు అమలుచేస్తున్న ‘నోటీసురాజ్’ ప్రకారమయితే సదరు ప్రజాస్వామ్యవాదయిన ఎమ్మెల్యేకు అర్ధరాత్రి ఇంటికెళ్లి నోటీసులివ్వాలి. అలా ఇవ్వరనుకోండి. అది వేరే విషయం!
అయితే.. పట్టాభి అనే మాటల మాంత్రికుడి వాచాలతను ఎవరూ స్వాగతించరు. ఆయన వాడే భాషను ఎవరూ హర్షించరు. ఆయన వైఖరి వివాదంగానే ఉంటుంది. ఎంతబాగా తిడితే మీడియాలో ఎంత బాగా హైలె ట్టవుతామనే ట్రెండ్ పొలిటీషియన్లకు వచ్చేసింది. ఆ ప్రకారంగా ఆ తిట్టేవారిని ఇంటిపక్కన ఉండేవాళ్లు కూడా గుర్తుపట్టకపోయినా, చానెళ్లలో చర్చలు చూసే వారి దృష్టిలో మాత్రం వారు పెద్ద మేధావులు. ఆ పబ్లిసిటీ మోజులో పడుతున్న మాటల మాంత్రికులు.. ఒక్కోసారి తెచ్చే ఇలాంటి ప్రమాదాలకు, ఆయా పార్టీలు సిద్ధంగానే ఉండాలని తాజా ఘటన చెబుతోంది. సరే.. పట్టాభి అనే ఆయన మాట్లాడింది నూరుశాతం తప్పే. డీజీపీగారు చెప్పినట్లు పట్టాభి వాడిన భాష ఇప్పటివరకూ ఎవరూ వాడింది లేదట. పట్టాభి భాషను ఖండించడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికీ అనేక వేదికలున్నాయి. కావాలంటే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, పరువునష్టం దావా కూడా వేసుకునే వెసులుబాటు ఉంది. అయినా వాటిని పక్కనపెట్టి భౌతికదాడులకు పాల్పడటం అనాగరికం.
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో.. నేటి సీఎం జగన్ విపక్షనేతగా ఉన్నప్పుడు, నాటి సీఎం బాబును కాల్చిచంపమని పిలుపునిచ్చారు. ఇక మాననీయ మంత్రి కొడాలి నాని అయితే, ‘బూతుల మంత్రి’ అన్న బిరుదు తెచ్చుకున్నారు. చంద్రబాబును ‘వాడు- వీడు’ అన్న పదాలకు తక్కువకాకుండా, గౌరవంగా

సంబోధిస్తుంటారాయన. అలాగని తెలుగుతమ్ముళ్లేమీ సుద్దపూసలనుకుంటే పొరపాటే. ‘రాష్ట్రాన్ని చెత్తనాకొడుకులు పరిపాలిస్తున్నారు. కోడెల ముందు పోలీసు నాకొడుకులు నిలబడేవార’ని అయ్యన్నపాత్రుడు.. జగన్ గాలిగాడని లోకేష్ సెలవిచ్చారు. కాబట్టి అంతా ఆ తాను ముక్కలేకాబట్టి.. ఇప్పటి ఆంధ్రా రాజకీయాల్లో నైతిక విలువలు, మర్యాద రామన్నలను ఆశించడం అత్యాశే కాదు. అవివేకం కూడా.
టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనను జగనన్న ఖండిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురయింది. సహజంగా ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా అణిగి ఉండాలి. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా సంయమనం వహించాలి. ఎందుకంటే అప్పుడు జరిగే అన్ని అనర్ధాలకూ ప్రభుత్వంలో ఉన్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అందుకే ఆ స్థానాల్లో ఉన్నవారు తమ పార్టీ శ్రేణులను కంట్రోల్ చేస్తూ వస్తుండటం ఇప్పటిదాకా చూశాం. అంటే ఏదైనా అరాచకం జరిగినప్పుడు ఆ పరిణామాలపై చింతిస్తున్నామనో, జరిగిన ఘటన దురదృష్టకరమనో, ఇకపై అలాంటివి పునరావృతం కాకుండా చూస్తామనో, బాధ్యులపై చర్యలు తీసుకుంటామనో, తమ పార్టీ శ్రేణులు ప్రతీకార దాడులకు పాల్పడకుండా సంయమనం పాటించాలనో హితవు పలుకుతుంటారు.
దానివల్ల అధికార పార్టీ శ్రేణుల నుంచి కొత్తగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదన్నది పాలకుల అసలు భావన. అదే రాజధర్మం కూడా! కానీ విచిత్రంగా తాజా ఘటనపై తెరపైకి వచ్చిన జగనన్న మాటల్లో అవేమీ కనిపించలేదు. పైగా ‘టీడీపీ నేతలు తనను తిడుతుంటే బీపీ వచ్చిన తన అభిమానులు రియాక్ట్ అవుతున్నార’ని మురిసిపోతూ చెప్పడమే విడ్డూరం. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన అలాంటి వ్యాఖ్యలు పోలీసుల చేతులు కట్టిపడే సేవే. పైగా తాను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరినీ తిట్టలేదని సెలవిచ్చారు. అయితే మరి.. నంద్యాల ఉప ఎన్నికలో నాటి సీఎం ‘చంద్రబాబును కాల్చిచంపినా తప్పులేద’ని నిండుసభలో ఉగ్రుడైనది బహుశా జగనన్న కాదేమో?!

LEAVE A RESPONSE